mt_logo

తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమై, దారుణమైన అణచివేతకు గురైంది

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ప్రగతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకావిష్కరణ చేసారు . బీఆర్‌ అంబేద్కర్‌, మహాత్మాగాంధీ, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌,  ప్రగతి భవన్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామని అన్నారు.  ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్రాప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు, 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణచివేతకు గురైందన్నారు. 

1971 లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కు మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినప్పటికీ.. దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఉద్యమాన్ని రగిలించేందుకు నడుమ నడుమ కొన్ని ప్రయత్నాలు జరిగినా.. నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడంవల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2001 వరకు తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలింది. “ఇంకెక్కడి తెలంగాణ” అనే నిర్వేదం జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైందన్నారు. 

ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ 

అహింసాయుతంగా, శాంతియుత పంథాలో వివేకం పునాదిగా, వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయి. ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులూ, విద్యావంతులూ, ఉద్యోగ ఉపాధ్యాయులూ, కవులూ, కళాకారులూ, కార్మికులూ, కర్షకులూ, విద్యార్ధులూ, మహిళలూ కులమత భేదాలకు అతీతంగా, సిద్ధాంతరాద్ధాంతాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై కదిలారు. వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. 2014లో అధికారంలోకి వచ్చిన నాటినుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైందన్నారు. ప్రతిరంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ నేడు పదో వసంతంలో అడుగు పెట్టడం ఒక మైలురాయి. ఈ సందర్భంగా స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేటినుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి. గ్రామస్థాయి నుంచి రాజధాని నగరం వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ  ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా  పాల్గొనాలని  కోరుతున్నాన్నారు. 

అటు పోరాటంలోనూ, ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైన స్ఫూర్తినీ, అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషినీ మననం చేసుకుందాం. దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతిని దశదిశలా చాటుదాం. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుందాం, తెలంగాణ సమాజం ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని  సాధించుకుంది అని అన్నారు. ప్రజల ఆశయం జయించి, 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది, తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం గుర్తుచేసుకుంటే.. ఏ రంగంలో చూసినా విధ్వంసమే. అంతటా అలుముకున్నది గాఢాంధకారమే. అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదగడం ఒక చారిత్రాత్మక విజయం అని తెలిపారు.