mt_logo

ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్- సీఎం కేసీఆర్

ఒక్క అప్లికేషన్ చాలు.. అనుమతులు వస్తాయి.. ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్.. సింగపూర్ కంటే వేగంగా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం హోటల్ తాజ్ కృష్ణాలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) జాతీయమండలి సభ్యులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం జరిగింది. సీఐఐ అధ్యక్షులు సుమిత్ మజుందార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్) సింగపూర్, వియత్నాం దేశాల పారిశ్రామిక విధానాలకంటే అద్భుతంగా ఉందన్నారు. టీఎస్ఐపాస్ రూపొందించే ముందు సింగపూర్ ఇండస్ట్రియల్ పాలసీని కూడా అధ్యయనం చేశామని, ఇంక్యుబేట్, ఇన్నోవేట్, ఇన్ కార్పోరేట్ అనే నినాదంతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని వివరించారు.

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే టీఎస్ఐపాస్ ను తెచ్చామని, పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా తన కార్యాలయంలోనే చేజింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు, నగరంలో మౌలిక వసతుల కల్పనకు కూడా భారీ ప్రణాళికలు రూపొందించామన్నారు. నూతన కార్మిక విధానాలు ఏవిధంగా ఉండాలో సూచించాలని పారిశ్రామికవేత్తలను సీఎం కేసీఆర్ కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నూతన పారిశ్రామిక విధానం, పరిశ్రమల అభివృద్ధికై తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *