mt_logo

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

గ్రామజ్యోతి పథకంపై తెలంగాణ భవన్ లో బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా జెడ్పీ అధ్యక్షులు హాజరయ్యారు. గ్రామజ్యోతి పథకం తీరుతెన్నుల గురించి, రాష్ట్రంలోని అన్ని గ్రామాలను సమాంతరంగా ఎలా అభివృద్ధి చేయాలి? పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవతో ఈ పథకాన్ని ఎలా విజయవంతం చేయాలి? అనే అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 17న వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో ప్రారంభించనున్న గ్రామజ్యోతి పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు.

ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మండలాల్లో ఒకటి చొప్పున గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, ఒక్కో ఎమ్మెల్సీ తన సొంత గ్రామం లేదా తన జిల్లాలోని ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. జెడ్పీ చైర్మన్లు కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే బాగుంటుందని సీఎం అన్నారు. ఈ గ్రామాల్ని మోడల్ గ్రామాల్లా అభివృద్ధి చేసి మిగతా గ్రామాల్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేసుకోవాలని, ఇందుకోసం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులను భాగస్వాములను చేయాలన్నారు. గ్రామంలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది? రేషన్ బియ్యం ఎంతమందికి అందుతుంది? అన్న వివరాలు సేకరించాలని, అర్హులైన వారికి ఎవరికైనా రాకుంటే వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రజల మనసు దోచుకుంటేనే పార్టీలకు మనుగడ అని, ఏ ప్రభుత్వ పథకాలైనా, ఎంత అద్భుతంగా రూపొందించినా అవి ప్రజలను ఒప్పించి, మెప్పించేలా ఉండాలని చెప్పారు.

ఇదిలాఉండగా ఈనెల 15 తర్వాత ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. పాత, కొత్త కలయికతో పోస్టుల భర్తీ ఉంటుందని, రాష్ట్రంలో 10, 12 కార్పొరేషన్లకు చైర్మన్లు, పాలకమండళ్ళు ఏర్పాటు చేసుకుందామని సీఎం చెప్పారు. మరో 30 నుండి 40 కార్పొరేషన్లకు ఏపీ ప్రభుత్వం కిరికిరి పెడుతున్నందున తర్వాత భర్తీ చేసుకుందామని, అదేవిధంగా దేవాదాయ కమిటీల ఏర్పాటు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. పోస్టుల భర్తీలో 2001 నుండి పార్టీకోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, అదేవిధంగా కొత్తగా వచ్చినవారికి కూడా అవకాశాలు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *