mt_logo

శ్రీమంతుల కుటుంబాల ఔదార్యం ఊరికి ఉపకారం!!

గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకానికి తనవంతు చేయతనిచ్చేందుకు ముందుకొచ్చారు దొడ్డా మోహన్‌రావు. తద్వారా తనకు జన్మనిచ్చిన ప్రాంతానికి చేయూతనందించేందుకు సిద్ధమయ్యారు. చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన పారిశ్రామికవేత్త దొడ్డా మోహన్‌రావు ఇప్పటికే మిషన్ కాకతీయలో పలు చెరువులను దత్తత తీసుకుని స్వచ్ఛందంగా నిధులు అందించారు. తాజాగా గ్రామజ్యోతి కార్యక్రమానికి రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిసిన దొడ్డా మోహన్‌రావు తన నిర్ణయాన్ని ప్రకటించారు.

ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం..
స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రవేశపెడుతున్న పలు పథకాలకు పారిశ్రామికవేత్త దొడ్డా మోహన్‌రావు ఆకర్షితులయ్యారు. గత వేసవిలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు రూ. 1.50 కోట్లు విరాళం ప్రకటించారు. లింగగిరి గ్రామంలోని మూడు చెరువుల్లో పూడికమట్టి తీయించి జలకళను సంతరింపజేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి మంగళవారం సీఎం కేసీఆర్ వద్దకు దొడ్డా మోహన్‌రావును తీసుకెళ్లి మాట్లాడించారు. దీంతో గ్రామజ్యోతిలో ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తనవంతు సాయంగా రూ. 50 లక్షలు అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా దొడ్డా మోహన్‌రావు తెలిపారు.

పురిటిగడ్డ రుణం తీర్చుకుంటున్న మోహన్‌రావు..
లింగగిరి గ్రామానికి చెందిన దొడ్డా మోహన్‌రావు పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటున్నారు. చెరువుల పునరుద్ధరణలో తనవంతు చేయూతనందించిన ఆయన మరో చెరువుకు తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన కానిస్టేబుల్ కిష్టయ్య పేరును నామకరణం చేయించి ఆదర్శంగా నిలిచారు. లింగగిరిలో చెన్నకేశవ ఆలయం గుట్టలో ఉండగా అక్కడ రూ. కోటి వెచ్చించి ఆలయ నిర్మాణం చేయిస్తున్నారు. గ్రామంలోని రైతులంతా సుభిక్షంగా ఉండాలని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, రుణాలు సకాలంలో అందేలా చెన్నకేశవ రైతు సహకార సంఘాన్ని నెలకొల్పారు. నర్సంపేటలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో లక్షల రూపాయలు వెచ్చించి తన భార్య పేరిట భవనాన్ని నిర్మించారు. ఉత్తమంగా చదివిన బాలికలకు ప్రతీ ఏటా ప్రోత్సాహక బహుతుల్ని అందిస్తున్నారు. ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బట్టల్ని కూడా అందిస్తూ మానవతాహృదయాన్ని చాటుకుంటున్నారు.

పాఠశాలకు తన సొంతింటి స్థలం ఇచ్చేందుకు ప్రతిపాదన..
నర్సంపేటలోని బాలికల ఉన్నత పాఠశాల స్థలం ఇరుకుగా ఉండడంతో పట్టణంలోని తన ఇంటి స్థలం ఇచ్చేందుకు మోహన్‌రావు అంగీకారం తెలిపారు. అయితే స్కూల్‌కు స్థలం దూరంగా ఉండటంతో అనుకూలంగా లేదు. పాఠశాల పక్కనే నీటి పారుదల శాఖకు చెందిన కార్యాలయం, స్థలం ఉంది. ఈ కార్యాలయానికి చెందిన స్థలం పాఠశాలకు కలిసే అవకాశం ఉంది. అయితే నీరుపారుదల శాఖకు చెందిన స్థలం బాలికల పాఠశాలకు ఇస్తే ఐబీ కార్యాలయానికి తన సొంత స్థలం ఇస్తానని దొడ్డా మోహన్‌రావు అధికారులకు తెలిపారు. గతంలో ఓసారి నర్సంపేటకు వచ్చిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా పాఠశాలకు వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రతిపాదనను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

రాంపూర్ అభివృద్ధికి యశోద హాస్పిటల్స్ సాయం..
నల్లబెల్లి: ఇది రాంపూర్‌లోని శ్రీమంతుల కుటుంబాల ఔదార్యం. కోట్లు సంపాదిస్తేనే కోటీశ్వరులు కారని, తోటివారికి సహాయ సహకారాలు అందించినప్పుడే నిజమైన కోటీశ్వరులు అవుతారు అన్న దానికి నిదర్శనం ఈ కుటుంబం. కన్నతల్ల్లిలాంటి ఊరిని మరువకుండా తమ సంపాదనలో కొంతమేర వెచ్చిస్తూ బాగోగులు చూసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో యశోద హాస్పిటల్స్ యజమానులు తమ తల్లిదండ్రులు సంపాదించిన భూమిని గ్రామానికి ధారాదత్తం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ యశోద వైద్యశాలల యాజమానులు రాంపూర్‌లోని తమకున్న 12 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో గ్రామానికి ఉపయోగపడేవిధంగా ఫంక్షన్‌హాల్, మిగిలిన డబ్బులను గ్రామాభివృద్ధికి కేటాయిస్తామని స్పష్టం చేశారు.

యశోద వైద్యశాల ఔదార్యం..
రాంపూర్ గ్రామానికి చెందిన గోరికంటి రాంచంద్రారావు, యశోద దంపతులకు నలుగురు కుమారులు రవీందర్‌రావు, సురేందర్‌రావు, నరేందర్‌రావు, దేవేందర్‌రావు. ఉన్నత చదువులు చదివిన ఆ నలుగురు 35 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు తరలివెళ్లి స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తున్న యశోద హాస్పిటల్ వీరిదే. ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు గ్రామాన్ని ఏనాడు మరువలేదు. తల్లిదండ్రులు కాలం చెల్లాక ఇక్కడి ప్రజలు, బంధువులతో సత్సంబంధాలు నెరుపుతూనే ఇంటిస్థలం, 12 ఎకరాల భూమిని అమ్మకుండా అట్లే ఉంచారు. దళితులకు మూడెకరాల భూమిని కేటాయించేందుకు ధనిక రైతులు సహకరించాలని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు వీరు స్పందించారు. రాంపూర్‌లో తమకున్న 12 ఎకరాల భూమిని, 30 గుంటల ఇంటిస్థలాన్ని గ్రామానికి ధారాదత్తం చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో రాంపూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విడియాల కుటుంబం చేయూత..
ఇదే గ్రామానికి చెందిన విడియాల సుధాకర్ రావు 30 ఏళ్ల కిందటి భార్య పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే విడియాల ఫార్మసీ ఒక కంపెనీ స్థాపించి ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్లిన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. అమెరికా దేశంలోని న్యూయార్క్ పట్టణంలో ఉంటున్నారు. భార్యాపిల్లలతో అక్కడే స్థిరపడినప్పటికీ కన్న ఊరి మమకారంతో 5 ఏళ్ల నుంచి రాంపూర్ గ్రామ పరిధిలోని 15 మంది నిరుపేదలకు నెలకు రూ.500 చొప్పున అందిస్తున్నారు. అంతేకాక మేడపెల్లి గ్రామంలో నాలుగేళ్ల కిందట నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో నిత్య దూపదీప నైవేద్యాలకు రామాలయం పేరిట లక్ష రూపాయలు డిపాజిట్ చేశారు. వచ్చిన వడ్డీ డబ్బులతో నిత్యపూజలు చేయిస్తున్నారు. ప్రతీ సంవత్సరం గ్రామంలోని హైస్కూల్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ఒక్కక్కొరికి రూ.10, 15వేలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *