భారతదేశంలో యూనిఫాం సివిల్‌కోడ్ (యూసీసీ) అంటే ఉమ్మడి పౌరస్మృతి అనే ఆలోచనకు బీజేపీ మళ్లీ జీవం పోస్తున్నది. ఈ సారి ఎన్నికల ప్రచారాస్త్రంగా కాషాయ పార్టీ దీన్ని ముందుకు తీసుకువస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. యూసీసీతో ముస్లిం, ఇతర మతాలతోపాటు బీజేపీ ఎవరికైతే ప్రతినిధిగా ఉంటున్నామని చెప్పుకుంటున్న హిందువులకు కూడా అన్యాయం జరుగుతుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ యూసీసీని తెలంగాణ సీఎం కేసీఆర్‌కూడా వ్యతిరేకిస్తున్నారు. దేశాభివృద్ధిని విస్మరించి, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)) బి ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. యూసీసీ పేరుతో మరోసారి దేశ ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్రం తీసుకొనే నిర్ణయాలను తిరస్కరిస్తామని, అందుకే యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ ఉమ్మడి పౌరస్మృతితో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూమతాన్ని ఆచరించే ప్రజలు కూడా అయోమయానికి లోనవుతారని కేసీఆర్ చెప్తున్నారు. యూసీసీ బిల్లుకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరి దేశాన్ని ఇంతలా కలవరపెడుతున్న యూసీసీ అంటే ఏమిటి? దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
-యూనిఫాం సివిల్ కోడ్ ప్రస్తావన భారత రాజ్యాంగంలోని (ఆర్టికల్ 44) ఆదేశిక సూత్రాల్లో మాత్రమే ఉన్నది.
-1956లో రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి దీని అమలుపై చర్చ-అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి.
-వివాహం, విడాకులు, దత్తత, భరణం, సంరక్షణ, వారసత్వ అంశాల్లో దేశ పౌరులందరి మధ్యన ఏకరూపత (యూసీసీ) అనేది దీని ప్రధాన ఉద్దేశం
-యూసీసీ అమల్లోకి వస్తే వ్యక్తిగత మత చట్టాలు రద్దవుతాయి. గిరిజనుల అలిఖిత ఆచార సంప్రదాయాలకు చట్టబద్ధత పోతుంది. అలాంటప్పుడు యూసీసీతో భారతదేశంలో ఉన్న వివిధ జాతులు, మతాల్లో సమానత్వం అనేది సాధ్యం కాదు.
-భారత్‌కు స్వాతంత్య్రానంతరం నెహ్రూ, అంబేద్కర్ యూసీసీ రావాలని అన్నప్పటికీ భారత భూభాగంలోని ప్రజలు అంగీకరించి, యూసీసీకి విస్తృత సామాజిక ఆమోదం లభించినప్పుడు మాత్రమే తీసుకురావాలని స్పష్టం చేశారు. అందుకే దీనిని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో కాకుండా ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. అంటే ఇది కేవలం సలహా మాత్రమే!
-1995, 2000 సంవత్సరంలో సుప్రీం కోర్టు ఆర్టికల్ 44 స్ఫూర్తిని గుర్తు చేసినప్పటికీ దానిని అమలు చేయాల్సిందిగా తాము ఆదేశించడం లేదని విస్పష్టంగా పేర్కొన్నది.
-సుప్రీంకోర్టు కూడా సర్వజనామోదం తోనే యూసీసీ రావాలని స్పష్టంచేసింది. లా కమిషన్ 2016లోనే సంప్రదింపులు మొదలుపెట్టినప్పటికీ యూసీసీపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు.