
సమైక్య రాష్ట్రంలో చెరువులు, నీటివనరుల్లో చుక్కనీరు కనిపించేదికాదు. సాగునీళ్లకే గోసపడ్డ తెలంగాణలో మత్స్యకారులకు ఉపాధి అనే మాటే లేదు. ఎప్పుడో కాలమైనప్పుడు చెరువుల్లో చేపలొస్తే పట్టుకొని అమ్ముకొనేవారు. చాలీచాలని డబ్బులతో దుర్భర జీవనం గడిపేవారు. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం పోశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగి, నీటి వనరులు నిండు కుండలయ్యాయి. నిండాజలంతో తడలుకొడుతున్న నీటివనరుల్లో సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లలను వదిలే పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా చేప పిల్లలను వదిలారు. దీంతో సముద్రతీర ప్రాంతం లేకపోయినా తెలంగాణ రాష్ట్రంలో నీలివిప్లవం వెల్లివిరిసింది. రాష్ట్రంలోని చెరువులన్నీ చేపలతో కళకళలాడుతుంటే.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. వెరసి మత్స్య సంబురం కొనసాగుతున్నది.
మత్స్యకారుల జేబుల్లోకి 32వేల కోట్లు
తెలంగాణ సర్కారు గడిచిన ఏడేండ్లలో ఉచిత చేప పిల్లల పథకం ద్వారా రూ.413.66 కోట్ల ఖర్చుతో 442.47 కోట్ల చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేసింది. ఇందులో రూ.349 కోట్లతో 414 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేసింది. ఇంత భారీ మొత్తంలో ఖర్చుతో చేప పిల్లల్ని పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ప్రభుత్వం ఉచితంగా పంపణీ చేసిన చేప పిల్లల ద్వారా 22.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి.ఉచిత చేప పిల్లల పథకం కేవలం ఏడేండ్లలోనే అక్షరాల రూ.32 వేల కోట్ల సంపదను సృష్టించింది. ఈ సంపద అంతా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వానికి రాలేదు.. అచ్చంగా మత్స్యకారుల జేబుల్లోకి వెళ్లింది. వారి బతుకుల్లో వెలుగులు నింపింది.
ఉచిత చేపపిల్లల పథకం వివరాలు..
-ఈ పథకాన్ని ప్రారంభించిన 2016-17 సంవత్సరంలో ప్రారంభించారు.
-3,939 నీటి వనరుల్లో చేపపిల్లలను వదిలిపెట్టగా.. 2022-23 లో 23,748 జలవనరుల్లో చేప పిల్లలను పెంచడం విశేషం.
-తొలి ఏడాది రూ.2,252.20 కోట్ల విలువైన సంపదను సృష్టించగా 2022-23 నాటికి ఆ సంపద విలువ రూ.6,656.27కు పెరిగింది.
-ఏడేండ్లలోనే దాదాపు మూడురెట్ల అభివృద్ధి జరిగింది.