mt_logo

చేనేత కార్మికుల ఆత్మహత్యల నుంచి చల్లగ బతికేందుకు కృషి చేసిన కేటీఆర్‌: సీఎం కేసీఆర్

చేనేత కార్మికుల ఆత్మహత్యల నుంచి చల్లగ బతికేందుకు కృషి చేస్తున్నాడు కేటీఆర్‌ అని  సీఎం కేసీఆర్ తెలిపారు. సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నా డెబ్బై ఏండ్ల జీవితంలో కనీసం ఒక వంద డెబ్బై సార్లు తిరిగిన జిల్లా సిరిసిల్ల అని తెలిపారు. ఇక్కడ బంధుత్వాలు, బాంధవ్యాలు, ఆత్మీయతలు, ఎంతోమంది నా క్లాస్ మేట్స్ ఉన్న జిల్లా సిరిసిల్ల, అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మారిందని అన్నారు. నలభై, యాభై ఏండ్ల కింద మానేరులో ఒక పాయలాగా బ్రహ్మాండంగా నీళ్లు కనిపించేవన్నారు. 

సమైక్య పాలనలో మొత్తం నాశనం అయింది, నా చిన్నతనంలో నీళ్లు, రైస్ మిల్లులు ఎన్నో ఉండేవి. సమైక్య పాలకుల దౌర్జన్యాలు పెరుగుతున్నా కొద్ది అవన్నీ మాయమైనాయి. అప్పర్ మానేరు ప్రాజెక్టుతోనే తెలంగాణ ఉద్యమ సభ కూడా జరిపాం. అప్పర్ మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దూకుతావుంటే అద్భుతమైన ఆత్మ సంతృప్తి కలుగుతావుంది. ఉద్యమ సమయంలో ఒక రోజు మధ్యరాత్రి  ప్రొ.జయశంకర్, నేను ఒక మీటింగ్ ముగించుకుని సిరిసిల్ల గుండా వెళుతుంటే కార్ల హెడ్ లైట్లలో గోడలమీద ‘ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. చావులు పరిష్కారం కాదు..చావకండి’ అనే రాతలు మేమిద్దరం కండ్లకు నీళ్లు తీసుకున్నం.

కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కావడం అదృష్టం

70 ఏండ్ల స్వతంత్రంలో ఇలాంటి వాల్ రైటింగ్ లు చూడాల్సి వచ్చింది..  ఈ సమైక్య రాష్ట్రంలో మనకెందుకీ బాధలని బాధపడ్డానని తెలిపారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒకరోజు 7గురు చేనేత కార్మికులు చనిపోయినప్పుడు ఎంతో చలించి ఎవరూ చనిపోవద్దని రూ.50 లక్షల పార్టీ ఫండ్ ను ఇవ్వడం జరిగింది.కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కావడం మీ అందరి అదృష్టం. చేనేత మంత్రిగా కూడా కేటీఆరే ఉండటంతో అనేక మీటింగ్‌లలో నాతో కొట్లాడి, అనేక రకాల పోరాటాలు చేసి చేనేత కార్మికులకు కావాల్సిన మరమగ్గాలు ఏర్పాటు, వాటి ఆధునీకరణకు డబ్బులు తెచ్చి చేనేత కార్మికుల పరిస్థితులు మార్చాడు. చేనేత కార్మికులను ఆత్మహత్యల పరిస్థితి నుంచి ఈరోజు చల్లగ బతికేందుకు కృషి చేసినందుకు కేటీఆర్‌ను కూడా అభినందిస్తున్నాను.

సిరిసిల్లను మరో సోలాపూర్‌ను చేయాలె 

సోలాపూర్ ఏ విధంగా ఉందో సిరిసిల్లను కూడా అట్లాగే చేయాలని చేనేత వర్గానికే చెందిన ఎమ్మెల్సీ ఎల్.రమణ అడిగినట్లుగా మళ్లీ అధికారంలోకి రాగానే తప్పకుండా నేను, ప్రభుత్వం మీ వెంట ఉంటుందని హృదయపూర్వకంగా హామీనిస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని నీచాతినీచంగా రాజకీయాలు చేసే చిల్లర గాళ్లు, కొందరు దుర్మార్గులు ఉంటరు. వాళ్లున్నరని చిన్నబోవద్దు. చేనేత కార్మికులు బతకాలె. చేనేత కార్మికులకు పని కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కానుకలుగా రాష్ట్రంలోని కోటి మంది పేదలకు కొత్త చీరలు, కొత్త బట్టలను అందజేస్తున్నది. మూడు, నాలుగు వందల కోట్ల రూపాయలతో సిరిసిల్లలో చేనేత కార్మికులకు పని దొరకడం గాకుండా పేదలకు కొత్త బట్టలు కూడా అందుతున్నాయి. కొంతమంది దుర్మార్గులు బతుకమ్మ చీరలను కూడా కాలబెట్టి రాజకీయం చేస్తున్నరని బాధ వ్యక్తం చేశారు.   

గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం ‘బతుకమ్మ చీరలు’

బతుకమ్మ చీరలు కేవలం చీరల కోసమే కాదు.. ఇక్కడ ఉరిబెట్టుకొని, సచ్చిపోయి, అప్పులపాలైన చేనేత కార్మికుల బిడ్డల కన్నీళ్లు తుడిచేటటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం ‘బతుకమ్మ చీరలు’. ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ శ్రీకారం చుడితే, ఇది కావాలని, చేనేత కార్మికులను కాపాడుకోవాలని కేబినెట్ ఒప్పుకొని చేశామన్నారు. రామారావును పొగుడుకుంటే నన్ను నేను పొగుడుకున్నట్లు ఉంటది. రామారావు గుణగణాలు ఏందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మీరు, ఆయన కలిసి పనిచేస్తున్నరు కాబట్టి నేను రామారావును పొగిడే అవసరం లేదన్నారు.  

చేనేతల కోసం కేటీఆర్ పోరాడుతున్నడు

భవిష్యత్తులో గొప్ప విద్యా కేంద్రంగా, నీళ్లు కూడా వచ్చాయి కాబట్టి మంచి ప్రాంతంగా సిరిసిల్ల అన్ని హంగులు ఏర్పడే విధంగా నేను చర్యలు తీసుకుంటానని అన్నారు. చేనేతల కోసం కేటీఆర్ పోరాడుతున్నారని తెలిపారు.  సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితి మార్చాం,  ఇప్పుడు వేసవిలో కూడా అప్పర్ మానేరు మత్తడి దూకుతున్నదని తెలియ జేశారు. చేనేత కార్మికులకు అండగా ఉంటాం. మంచి నాయకుడు, మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు కేటీఆర్ మీ దగ్గరే ఉన్నడు. కేటీఆర్‌ను దీవించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.