కాంగ్రెస్ బలవంతంగా మన తెలంగాణను ఆంధ్రాలో కలిపి 58 ఏండ్లు అరిగోస పెట్టిండ్రని సీఎం కేసీఆర్ అన్నారు. ‘షాద్ నగర్’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ఆనాడు మంచినీళ్లు, సాగునీళ్లు లేకుండె. కరెంటు రాకుండె.. షాకులు కొట్టి చనిపోవుడు.. ఎక్కడెక్కడో బతుకపోవుడు.. ఇలా ఎన్నో కరువులకు గురయ్యాం అని ఆవేదన వ్యక్తం చేసారు.
తెలంగాణను మునగ్గొట్టి నాశనం చేసిందే కాంగ్రెస్
షాద్‌నగర్ ఒకప్పుడు మంచినీళ్లకు గొడగొడ ఏడ్చిన, తీవ్రకరువున్న ప్రాంతం.షాద్‌నగర్‌లో ఒక్కోసారి పదిహేను రోజులకు కూడా మంచినీళ్లు రాక అరిగోస పడ్డమన్నారు. తెలంగాణను మునగ్గొట్టి నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరూ బాగుపడలేదు. ఇందిరమ్మ రాజ్యం సక్కగుంటే.. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి రెండు రూపాయలకు కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆకలికే చచ్చినాం కదా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం సక్కదనముంటే ఎన్టీ రామారావు పార్టీని పెట్టాల్సి వచ్చేది కాదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మాట్లాడితే మత కల్లోలాలు, కర్ఫ్యూలు, అల్లర్లు, చివరికి ఎమర్జెన్సీ పెట్టి లక్షలాది మందిని జైళ్లల్లో వేసినారు. ప్రజలకు అన్నం పెట్టలేదు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికీ అవసరం లేదని తేల్చి చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమాలపై ఆలోచన చేయాలి
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలన.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలపై ప్రజలందరూ ఆలోచన చేయాలె అని కోరారు. భారతదేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా ‘రైతు బంధు’ను ఇస్తున్నామన్నారు. ‘ధరణి’ తీసేసి ‘భూమాత’ పెడుతరట.. అది ‘భూమాత’నా? లేక భూ‘మేత’నా? అని అడిగారు. మీ భూములు మార్చాలంటే మీ బొటనవేలుకు తప్ప.. ముఖ్యమంత్రికి కూడా అధికారం లేకుండా చేసినమని పేర్కొన్నారు. భూమాత పెట్టి కౌలుదారుల కాలం, 24 కాలంలు పెడుతం అంటున్నరు కాంగ్రేసోల్లు. ఎవరైతే కౌలు చేస్తరో పైసలు వాళ్లకే ఇస్తం.. రైతులకు ఇవ్వమని కాంగ్రేసోల్లే చెబుతున్నరు. కౌలుదారు మూడేండ్లు ఉంటే ఆయనకే భూమి పోతది. రైతు రోడ్డున పడాల్సి వస్తదని హెచ్చరించారు.