ఆలోచించి వేయకుంటే ఓటే కాటేసే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. ఎలక్షన్లు వచ్చినయంటే అబద్ధాలు చెప్పడం..అభాండాలు వేయడం.. ఇష్టమొచ్చిన వాగ్ధానాలు, ప్రచారాలు చేయడం, జనాన్ని మోసం చేసే పరిస్థితి నడుస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా రాలేదని అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలతో పాటుగా వారి వెనుకున్న పార్టీల గత చరిత్రను కూడా చూడాలన్నారు. ఆలోచించి వేయకుంటే ఓటే కాటేసే అవకాశం ఉంటదనిపేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన, ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పెట్టిందని వెల్లడించారు. పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కటిగా సరి చేసింది.సంక్షేమంలో తెలంగాణ ఇండియాలోనే నంబర్ వన్. మనకు సాటి కూడా ఎవరూ లేరని అన్నారు. పద్మా దేవేందర్ రెడ్డిని గెలిపిస్తే రైతు బంధు ఉంటది.. రూ.16 వేలకు పెరుగుతదని వివరించారు. రైతులకు 24 గంటల వస్తే.. కేసీఆర్ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నడని మరో కాంగ్రెస్ నాయకుడంటరని వెల్లడించారు.
పీసీసీ అధ్యక్షుడు 3 గంటల కరెంటు చాలంటడు. దాని కోసం 10 హెచ్.పి.మోటార్ పెట్టాలంటడు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మోటార్లు ఉన్నయ్.. వాటిని కొనాలంటే డబ్బులు ఎవరిస్తరు? అని ప్రశ్నించారు. రైతుల వాడేదే 3 లేదా 5 హెచ్.పి.మోటార్లు అని తేల్చి చెప్పారు. పద్మా దేవేందర్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థికి ఏమన్నా పోలిక ఉన్నదా? అని ఎద్దేవా చేశారు. కారు గుర్తకు ఓటేసి పద్మా దేవేందర్ రెడ్డిని గెలిపించండి. మీ బాధలన్నీ తీర్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.