mt_logo

తెలంగాణ ప్రజలు ఆగం కావాల్సిన పరిస్థితి తెచ్చిందే కాంగ్రెస్: ఎల్లారెడ్డి సభలో సీఎం కేసీఆర్

కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో నోరు మూసుకున్నరు కాబట్టే తెలంగాణ ప్రజలు ఆగం కావాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎల్లారెడ్డి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు ఎలాంటి వారు? ఏం చేసిండ్రని చూస్తూనే ముఖ్యంగా వారి వెనుకున్న పార్టీల గత చరిత్రను చూడాలి. గులాబీ జెండా పుట్టిన్నాడు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన చెందిన విఠల్ రెడ్డి ‘‘మూగబోయిన..’’ అనే గేయాన్ని అద్భుతంగా రాసాడని తెలిపారు. రైతులు, పేదలు, మైనార్టీల గురించి ఎలాంటి వైఖరిని అవలంభిస్తున్నాయో పార్టీల గత చరిత్ర చూడాలని కోరారు. మిషన్ కాకతీయలో భాగంగా నేను కూడా సదాశివ నగర్ చెరువులో తట్ట మోసిన అని చెప్పారు. 

మిషన్ భగీరథతో మంచినీళ్ల బాధ పోగొట్టుకున్నం, మారుమూల తండా, గుడిసెల నుంచి ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కామారెడ్డి వెనుకబడి ఉందనే కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నా అని వెల్లడించారు. మాటలల్లో చెప్పను.. కామారెడ్డి, ఎల్లారెడ్డిలను జంట నియోజకవర్గాలుగా అద్భుతమైన అభివృద్ధిని అందించబోతున్నానని తెలియజేసారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంచెం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్లాలదే నరకంలా ఉండేది. ఉద్యమంలో ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా రాజీనామా చేసి మనతో కలిసి వచ్చిండ్రా అని అడిగారు. 

కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహూల్ గాంధీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడు రైతు బంధు, ధరణి తీసేస్తామంటున్నరు. 24 గంటల కరెంటు నిచ్చే మన దగ్గరికొచ్చి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో 5 గంటల కరెంటునిస్తమని అంటుంటే నవ్వాల్నా? ఎడ్వాల్నా? ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, పంట కొనుగోళ్ల డబ్బులు ఎలా వస్తయి? అని ప్రశ్నించారు. ధరణి బంద్ అయితే గతంలో ఉన్నట్లుగానే దళారులు, పైరవీకారుల రాజ్యమే అయితదని హెచ్చరించారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేసారు. జాజుల సురేందర్‌ను మంచి మెజార్టీతో గెలిపించాలని  సీఎం కోరారు.