నేడు ‘ధరణి’ రైతుల జీవన్మరణ సమస్య జాగ్రత్త అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా, పట్టణానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఇక్కడ నుంచే పోటీ చేసిన అని తెలిపారు. నేను మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ గౌరవం, కీర్తి జిల్లాకు, జిల్లా ప్రజలకు శాశ్వతంగా ఉంటుందని నేను గర్వంగా చెబుతున్నానని పేర్కొన్నారు.
దళారీలు రాజ్యం తెస్తమంటున్న కాంగ్రేసోళ్లు
శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాల నాయకుడిగా రాజీనామా చేసి రోడ్ల మీదికి వచ్చేటటువంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ ఆనాడు కల్పించిందని గుర్తు చేసారు. ఉద్యోగస్తులందరినీ కూడా రోడ్ల మీదికి బాటలు పట్టే పరిస్థితిని కాంగ్రెస్ కల్పించిందనే ఆవేదన వ్యక్తం చేసారు. ‘ధరణి’ తీసి బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు కాంగ్రెసోళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. భట్టి విక్రమార్క టీవీలల్ల చెబుతున్నడు. రాహుల్ గాంధీ మీటింగ్‌లల్ల చెబుతున్నడు. జాగ్రత్త అని హెచ్చరించారు. మళ్లీ వీఆర్వోలను తెస్తం.. కౌలుదారుల కాలం పెడుతం అంటున్నరు. మళ్లా ఆఫీసుల చుట్టూ తిరుగుడే అని అన్నారు. దళారీలు, పైరవీకారులు, పట్వారీల రాజ్యం తెస్తమని కాంగ్రేసోళ్లు గట్టిగా చెబుతున్నరు. ఇవ్వాల ధరణితో మీ కాలు కదలకుండానే రైతుబంధు, రైతు బీమా, పంటల కొనుగోళ్ల డబ్బులు మీ అకౌంట్లలోకి వచ్చిపడుతున్నయని వివరించారు. ఇవ్వాల ‘ధరణి’ రైతుల జీవన్మరణ సమస్య అని సూచించారు.
ఏ ముఖ్యమంత్రైనా ఒక్క మెడికల్ కాలేజీనైనా ఇచ్చిండా?
శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లో బైపాస్ రోడ్డు, చెరువు, కేసీఆర్ పార్క్‌ను సుందరంగా తయారు చేసిండని మెచ్చుకున్నారు. వేరే ప్రాంతాల్లో నుంచి వచ్చి చూసిపోతున్నరు. మహబూబ్‌నగర్ పట్టణం పక్కనే ఉన్న ఎకో పార్క్ తెలంగాణలోని ఏ నగరానికి కూడా లేదు. శ్రీనివాస్ గౌడ్ రూ.30 కోట్ల సీఎంఆర్ఎఫ్ డబ్బులను మహబూబ్‌నగర్ నియోజకవర్గ పేదలకు అందించిండని వెల్లడించారు. శ్రీనివాస్ గౌడ్ సహకారంతో దివిటిపల్లి దగ్గర రూ.10 వేల కోట్లతో అమర రాజా బ్యాటరీ కంపెనీ వచ్చింది.ఇయ్యాల పాలమూరు ఉమ్మడి జిల్లాల్లో 5 మెడికల్ కళాశాలలు వచ్చినయి. గతంలో పాలించిన ఏ ముఖ్యమంత్రైనా ఒక్క మెడికల్ కాలేజీనైనా ఇచ్చిండా? అని అడిగారు. శ్రీనివాస్ గౌడ్‌ను గెలిపించండి..మళ్లీ ఉన్నతస్థానంలోనే ఉంటడు. బ్రహ్మాండమైన అభివృద్ధిని మీకందిస్తడని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి వి.శ్రీనివాస్ గౌడ్‌ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని మనవి సీఎం కేసీఆర్ కోరారు.