mt_logo

రాబోయే రోజులన్ని ప్రాంతీయ పార్టీలవే: సీఎం కేసీఆర్

రాబోయే రోజులన్నీ  ప్రాంతీయ పార్టీల యుగం రాబోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఖమ్మం ప్రజా ఆశీర్వాదసభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి మాట్లాడుతూ..  ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఆ ఆశతోనే ఈ మాట చెబుతూ ఉన్నానని పేర్కొన్నారు. ఇదే జిల్లాకు చెందిన కవి రావెళ్ల వెంకట్రావు ఒక పాట రాశారని గుర్తు చేసారు. తెలంగాణ రాకముందు 70 ఏళ్ల క్రితం నా తల్లి తెలంగాణ రా.. అంటూ రాశాడని వెల్లడించారు. ఖమ్మం పట్టణం చూసి గర్వపడుతున్నాను. ఎన్నోసార్లు ఖమ్మంలో పాదయాత్రలు చేసినాను గోళ్లపాడు ఎట్ల ఉండే. లకారం చెరువు ఎంత వికారంగా ఉండే. ఇప్పుడు ఎంత సుందరంగా తయారైంది. లకారం చెరువు కోసం రూ.100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేసినాం అని తెలిపారు. విషయాలు చిన్నగా కనబడుతాయి. ఆలోచిస్తే పెద్దగా సామాజిక అవసరాలుగా ఉంటాయి.

తుమ్మ ముల్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా?

వైకుంఠధామాలు ,ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీకు తెలుసన్నారు. ఒక నాడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాలువలు, దుర్గంధంతో కూడిన పట్టణంగా ఉండే అని గుర్తు చేసారు. ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. ప్రమాదాలకు నిలయంగా ఉండే అన్నారు. ఈ రోజు ఖమ్మంలో సిక్స్ లేన్ రోడ్లు, సందుల్లో వైట్ టాప్ సిమెంటు రోడ్లు, ధగధగలాడే లైట్లు ,పచ్చటి చెట్లు. మంత్రమోస్తేనే, మాయ చేస్తేనో జరుగలేదు. మీ మంత్రి పువ్వాడ అజయ్  పనిచేస్తే జరిగిందని తెలిపారు.  ఖమ్మం పట్టణంలో రోడ్ నెట్ వర్క్ 400 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు 1115 కిలోమీటర్ల రోడ్ నెట్ వర్క్‌కు తీసుకుపోయారని చెప్పారు. డ్రైనేజీలు పోడవు 205 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు 1592 కిలోమీటర్లకు తీసుకుపోయాంమన్నారు. పువ్వాడ అజయ్‌ని గెలిపిస్తే పువ్వులో పెట్టుకుని చూసుకుంటాడని సూచించారు. తుమ్మల తుప్పలు తెచ్చుకుంటే ముల్లులాగా గుచ్చుకుంటది. మీకు తుమ్మ ముల్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా? అని అడిగారు. 

ఐటీ టవర్ ఖమ్మంలో ఉంది. ఇది కలలో కూడా ఊహించలేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా తెప్పించుకున్నాడని తెలిపారు. రవాణా మంత్రిగా ఉన్నందుకు అడ్వాంటేజ్ తీసుకున్నడు .హైటెక్ బస్టాండ్ నిర్మించుకున్నాడు. రూ.40 కోట్లతో ఆర్టీసీ కళ్యాణ మండపం కట్టించాడు. ప్రేమతో పువ్వాడ అజయ్‌ని అజయ్ ఖాన్ అని పిలుస్తారని నాకు తెలుసు. అయనను మళ్లీ గెలిపించండని కోరారు. 

ప్రజాస్వామ్య వాదులు దీనిని సహిస్తారా?

ఖమ్మానికిఇద్దరి పీడ వదిలించాం అని పేర్కొన్నారు. ఖమ్మం ఈ రోజు శుభ్రంగా ఉంది మంచి రిజల్ట్స్ రాబోతున్నాయని అన్నారు. ఎన్నికల్లో మాటలకు కూడా పరిమితి ఉంటది. తిట్టాలంటే తిట్లు తక్కువ ఉన్నాయా. అరాచకంగా మాట్లాడవద్దు కదా? అని అడిగారు.  బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ కడప తొక్కనీయను అంటున్నాడు ఒక అర్భకుడు. అతడేమైనా ఖమ్మం ప్రజలను గుత్తపట్టినడా? ప్రజాస్వామ్య వాదులు దీనిని సహిస్తారా? అని అడిగారు.  ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటదో మీకు బాగా తెలుసన్నారు. రాబోయే రోజులన్నీ  ప్రాంతీయ పార్టీల యుగం రాబోతుందని స్పష్టం చేసారు. అజయ్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.