mt_logo

బాధ్యతారాహిత్యం మాటల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్: ఇబ్రహీంపట్నం సభలో సీఎం కేసీఆర్

కాంగ్రెస్ నాయకులు బాధ్యతారాహిత్యంగా ఏది తోస్తే అదే మాట్లాడుతున్నరని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇబ్రహీంపట్నం ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో మొదట రైతులు బాగుండాలంటే..వ్యవసాయ స్థిరీకరణ జరగాలని నిర్ణయించాం అని తెలిపారు. దానికోసం కావాల్సిన అన్నింటినీ అమలు చేసాం అని అన్నారు. నాడు 40, 70, 200 రూపాయలున్న పెన్షన్‌ను మొదట వెయ్యికి, తర్వాత రెండు వేలకు పెంచి ఇస్తున్నదే బీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ అని స్పష్టం చేసారు. అనుకోకుండా విధివంచితులైన వారు రెండు పూటలా మంచిగ తిని ఉండేలా పెన్షన్లనివ్వాలని 2014 లో అధికారులతో చెప్పి వెయ్యి రూపాయలుగా చేసినం.భారతదేశంలో పెన్షన్లను వేల రూపాయలకు పెంచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. 

తెలంగాణ వచ్చిన్నాడు తలసరి విద్యుత్ వినియోగం 1140 యూనిట్లు ఉంటే, ఇవ్వాల 2200 యూనిట్లకు చేరుకొని దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వివరించారు.  ఇబ్రహీంపట్నం చెరువు ఎడారిగా ఉంటే మెట్రో వాటర్‌తో చెరువును నింపాం అని వెల్లడించారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు ఖచ్చితంగా కృష్ణా నది నీళ్లు రావాలి. 

అన్నింటినీ అధిగమించి ఇటీవల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్విచ్ కూడా ఆన్ చేసిన అని చెప్పారు.పాలమూరు-రంగారెడ్డి పథకం పెడితే దానిమీద కాంగ్రెస్ నాయకులు 1096 కేసులను వేసిండ్రని ధ్వ‌జ‌మెత్తారు. గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టులంటూ..కాలికి పెడితే మెడకు పెట్టి.. మెడకు పెడితే కాలికి పెట్టి ఆపారని చెప్పారు. మునుగోడు రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నంకు నీళ్లొస్తే ఒక లక్ష ఎకరాలకు పారుతుందని తెలిపారు.ధరణి ఉండాలంటే ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలవాలని సూచించారు. ప్రధాని మోదీ మోటార్లకు మీటర్లు పెట్టమంటే నేను సచ్చినా పెట్టలేదని తెలిపారు. దాంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.25 కోట్లను ఎగ్గొట్టిండ్రని మండిపోయారు. 

దళిత బంధును దేశంలో ఎవరన్నా ఆలోచించిండ్రా? ఎవరన్నా పెట్టిండ్రా? అని ప్రశ్నించారు. భారతదేశంలో ఎవ్వరూ చేయని విధంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఎన్నో కార్యక్రమాలను చేసిందని అభివర్ణించారు. సుమారు రూ.700 కోట్లతో ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రోడ్లను వేశాడు. రింగురోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, కలెక్టరేట్, పండ్ల మార్కెట్, ఫాక్స్ కన్ ఇండస్ట్రీ మన ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలోనే వచ్చినయ్.. వస్తున్నయ్. ఇబ్రహీంపట్నం ముఖచిత్రమే మారిపోనున్నది. కారు గుర్తుకు ఓటేసి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే గా భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు.