నరేంద్ర మోదీ నీకెందుకు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అడిగారు. భైంసా ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అలాంటి పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో ఓటు అడుగుతావ్ నరేంద్రమోదీ? అని మీరడగాలని ప్రజలకు సూచించారు.
ఇంకా అవసరమైన నిధులు మంజూరు చేస్తా..
చదువుల తల్లి సరస్వతి దేవి కొలువై ఉన్న బాసర పుణ్యభూమికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో మునుపెన్నడూ గోదావరి పుష్కరాలు జరగలేదని, తెలంగాణ వచ్చాక అద్భుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. బాసర ఆలయానికి ఇప్పటికే రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఇంకా అవసరమైన నిధులను కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చాయని అన్ని పార్టీల నాయకులు వస్తారని, కానీ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని సూచించారు. అభ్యర్థులనే కాదు, ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీని, ఆ పార్టీని నడిపించే నాయకుడిని కూడా చూడాలన్నారు. ఎమ్మెల్యేకు ఓటు వేస్తే, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ఆ ప్రభుత్వంలో ఎవరుండాలో మీరే నిర్ణయించుకోవాలని తెలిపారు.
రోడ్డు బాగుంటే తెలంగాణ, బాగోలేకపోతే మహారాష్ట్ర
తెలంగాణలో తాము చేసిన అభివృద్ధి కంటికి కనిపిస్తుందని పేర్కొన్నారు. రోడ్డు బాగుంటే తెలంగాణ, బాగోలేకపోతే మహారాష్ట్ర అనే కాడికి తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ అయినా అదే పరిస్థితి. తెలంగాణ బాగుపడాలంటే బీఆర్ఎస్‌కి ఓటు వేయాలని కోరారు సీఎం కేసీఆర్. సరిహద్దులో ఉండే మహారాష్ట్ర రైతులు తెలంగాణలో ఎకరం, అర ఎకరం భూములు కొని, బోర్లు వేసుకొని నీళ్లు పారించుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ తెచ్చిన నాయకుడిగా నా మాట నమ్మండి
వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని మోదీ ప్రభుత్వం తమపై ఒత్తిడి తెచ్చిందని కానీ రైతుల కోసం దానిని ఒప్పుకోలేదన్నారు. ఒకవేళ మీటర్లు పెట్టకుంటే రూ. 25 వేల కోట్లు కట్ చేస్తామని చెప్పినా, తాను దానికి నో అని చెప్పానని తెలిపారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అలాంటి పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో ఓటు అడుగుతావ్ నరేంద్రమోదీ? అని మీరడగాలని సూచించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా నా మాట నమ్మండి. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని తెలిపారు. మేము చేసిన అభివృద్ధి కంటికి కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా అబద్దాలు, గాలి మాటలు చెబుతున్నాయి.
ప్రజలను ఆగమాగం చేయాలని చూస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరో ప్రజలు పరిశీలించాలని సూచించారు. మహారాష్ట్ర రైతులు తెలంగాణలో బోర్లు వేసి మహారాష్ట్రలో పంటలు పండిస్తున్నారు. దయచేసి బీఆర్ఎస్‌ను గెలిపించి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.