ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో చూడండని పేర్కొన్నారు. గిరిజన బిడ్డలు, పేదలకు న్యాయం జరిగేందుకే మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాగా ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
కొమ్రంభీం పేరు మీద ’కొమ్రంభీం ఆసిఫాబాద్
‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో తెలంగాణ కోసం పోరాడిన మహాయోధుడు కొమ్రంభీం పేరు మీద ’కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా’ అని నేనే పేరు పెట్టిన అని తెలిపారు. కొమ్రంభీం పోరాటం చేసిన ప్రాంతాన్ని గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. 2014 తర్వాత నేనే స్వయంగా వచ్చి కొమ్రంభీంకి బ్రహ్మాండమైన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవ్వాల బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను నిర్మించిందని స్పష్టం చేసారు.
హాస్పిటల్ రావడంతో మన్యం బిడ్డలందరికీ మంచే..
ఆనాడు ‘గుట్టమీద గూడెం..గుట్ట కింద వాగుల నీళ్లు’న్న ఈ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే కలుషిత నీరు తాగి అంటురోగాలతో అనేక మంది చనిపోయేవారు. ‘మంచం పట్టిన మన్యం’ అంటూ నాడు పేపర్లలో వార్తలు వచ్చేవి. ఇవ్వాల ఆ పరిస్థితి లేకుండా చేశాం. ఎవరూ కలలో ఊహించని విధంగా ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకల హాస్పిటల్ రావడంతో మన్యం బిడ్డలందరికీ మంచి జరిగింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన అరాచకాలన్నీ మీ అందరికీ తెలిసిందే అని అన్నారు.
మాలి కులస్థులను ఆదుకుంటాం..
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను గతంలో కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? వాళ్లకు చేసే ఉద్ధేశ్యం లేదని మండిపడ్డారు. ఆసిఫాబాద్ ప్రాంతంలో చెక్ డ్యాంలు కట్టుకున్నాం. భూగర్భ జలాలు పెరిగి రైతులు వ్యవసాయం బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు మంజూరయ్యేలా చేస్తాం అని హామీ ఇచ్చారు. ఆరె కులస్థులకు ఓబీసీ కోసం, వారి సంక్షేమాన్నీ పట్టించుకుంటాం అని తెలిపారు. మాలి కులస్థుల విషయంలో మేం తీర్మానం పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదు. వాళ్లను తప్పకుండా ఆదుకుంటాం అని మాట ఇచ్చారు.
అభివృద్ధి జరగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే
మైనార్టీల సంక్షేమం కోసం గతంలో ఎవరూ చేయని విధంగా రూ.1200 కోట్లు ఖర్చు చేసాం అని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాంగతంలో మాదిరిగా ఆసిఫాబాద్ లో కల్తీ నీళ్లు తాగి మరణించడాలు లేకుండా చేశాం అని గర్వించారు. గిరిజనుల పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నాం. వారు చక్కగా చదువుతూ డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నత స్థితికి వస్తున్నారు. ఇవన్నీ రావాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాల్సి ఉంటదన్నారు. కాంగ్రెస్ మళ్లీ వస్తే రైతుబంధుకు రాంరాం, పట్వారీలు, దళారీల రాజ్యం మళ్లీ వస్తది. ఆగమయ్యే అవకాశం ఉంటదని హెచ్చరించారు. అభివృద్ధి చెందే తెలంగాణ మరింత ముందుకు వెళ్లాలంటే కోవా లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించి కారు గుర్తుకు ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ మనవి చేసారు.