mt_logo

ధన బేహార్ల పొగరు అణచాలి: సీఎం కేసీఆర్

ధన బేహార్ల పొగరు అణచాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా సీఎం మునుగోడులో మాట్లాడుతూ.. గతంలో ఉప ఎన్నిక జరిగితే మీరందరూ తీర్పు ఇచ్చినారు. 90 శాతం హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు.  రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతున్నదని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగమై ఓట్లు వేయద్దని సూచించారు. మనంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్ ఇక్కడి ప్రజల నడుములు వంగి పోయేదాకా చచ్చిపోయే దాక చూసిండ్రు. ఫ్లోరైడ్ నివారణ చేయలేదన్నారు. 

ఎవ్వడి బూట్లు మోసుకుంటున్నడో?

బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ నీళ్ల గోస పూర్తిగా ఏ విధంగా పోయిందో మీకందరికీ తెలుసన్నారు. ఈ రోజు విమర్శలు చేసే వాళ్లు ఎవ్వడు ఏ చెట్టుకింద ఉన్నడో మీ అందరికీ తెలుసు. ఎవ్వడి బూట్లు మోసుకుంటున్నడో మీకు తెలుసన్నారు. ఫ్లోరైడ్ తో నడుములు వంగిపోయిన నాడు పట్టించుకోని వాడు ఈ రోజు నన్ను ఛాలెంజ్ చేస్తున్నారు, కేసీఆర్ నీకు దమ్మున్నదా; కొడంగల్ కాడా పోటీ చేస్తవా, గాంధీ బొమ్మ కాడికి వస్తవా అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో మన తోటి ఉన్నదెవరో, లేని దెవరో మీరు కండ్లతోటి చూసినారు. రాజకీయాలలో ఎవరైతే పనికి మాలిన వాళ్లు ఉంటరో, ఎవరైతే డబ్బు మదంతో పనిచేసే వారుంటరో బుద్ధి చెప్పకపోతే ప్రజలు గెలువరు, ప్రజలు ఓడిపోతరు. పైసలు వస్తయి, పోతయి. ప్రజలకు  డెవలప్మెంట్ కావాలి, సాగునీరు రావాలి. తాగునీళ్లు రావాలి, 24 గంటల కరెంటు రావాలన్నారు. 

నిన్నో పార్టీ ఇవ్వాలో పార్టీ, రేపో పార్టీలో.. 

ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తల రాత మారుస్తుందని సూచించారు. పైసలు పట్టుకుని వచ్చే బేహార్లు, పూటకో పార్టీలు మార్చే బేహార్లు, ఏం చేసినా చేస్తారు. ముంచినా ముంచుతారు. వారికో నియమం లేదు. సిద్ధాంతం లేదు. నిబద్ధత లేదు. నిన్నో పార్టీ ఇవ్వాలో పార్టీ, రేపో పార్టీలో ఉంటారని స్పష్టం చేశారు. కేవలం డబ్బు మదంతో అహంకారంతో ప్రజలను కొనగలుగుతాం అంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. నల్లగొండలో ఉన్న కమ్యూనిస్టు చైతన్యం కచ్చితంగా చూపించి ఇటువంటి బేహార్లకు బుద్ధి చెప్పాలి. రాజకీయ ప్రక్షాళన జరిగి లాభం జరుగుతుందన్నారు. 

ఏడాదిన్నర లోపల రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు

పాలమూరు ఎత్తపోతల పథకం పూర్తయితే దిండికి , శివన్న గూడేనికి నీళ్లు వస్తయన్నారు. ఏడాదిన్నర లోపల రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు తెచ్చే బాధ్యత నాదన్నారు.  కాంగ్రెస్ వస్తే కర్ణాటక మాదిరే కరెంటు లేకుండా  అవుతుందని హెచ్చరించారు. ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అవకాశం ఉంటే ఎన్నికల చివరి దశలో వచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ ప్రజల చైతన్యంతో ధన బేహార్ల నుంచి కాపాడాలని సూచించారు.