mt_logo

అన్నాభావ్ సాఠే కు భారతరత్న ఇవ్వాలి : కేంద్రానికి సీఎం కేసీఆర్ డిమాండ్

అన్నాభావ్ సాఠేకు భారత రత్న ప్రకటించాలని  బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. సాఠే 103 వ జయంతి సందర్భంగా  మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.   ప్రముఖ మాతంగి దళిత కవి,. దేశం గర్వించదగ్గ ప్రజా కవి, అన్నాభావ్ సాఠేకు దేశ పాలకులు సరైన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు.  అంటరాని కులంలో పుట్టి జీవితాన్ని వడబోసిన దళిత బిడ్డ,  దేశ మూలవాసి మాతంగి సమాజ ముద్దుబిడ్డ,  అన్నాభావ్ సాఠే ను భారత రత్నగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. సాఠే రచనలు, సాహిత్యం, అణగారిన వర్గాల కోసం వారి పోరాటం అజరామరం అన్నారు. కమ్యూనిస్టుగా, అంబేద్కరిస్టుగా నిరంతరం సమసమాజ స్థాపన కోసం జీవితాంతం క`షి చేశారన్నారు. సాధారణ శాయరీలు చాలా మంది ఉంటారని,   లోక్ శాహరీ గా ప్రత్యేక గుర్తింపు పొందిన ఘనత సాఠేకే దక్కిందన్నారు.  తాను నమ్మిన సిద్ధాంతం కోసం , లక్ష్యం కోసం ఏనాడు వెనుకడుగు వేయకుండా జీవితాంతం ప్రజలతో ఉన్నారని అన్నారు.

రష్యాలాంటి దేశం సాఠేను గుర్తించి ఆ దేశ ప్రధాని పిలుపించుకుని సన్మానించారని సీఎం గుర్తు చేశారు. రష్యా లైబ్రరీలో సాఠే విగ్రహం ఉందని అన్నారు.  సాఠే ఇండియన్ మాక్సిమ్ గోర్కేగా  పేరొందారన్నారు. కానీ ఇంత గొప్పగా పేరొందిన సాఠేను భారత పాలకులు గుర్తించకపోవడం వారి సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమాలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. సాఠే త్యాగాలను ఇప్పటికైనా మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని సీఎం కోరారు. వారి రచనలన్నింటినీ భారత దేశంలోని అన్ని భాషాల్లో తర్జూమా చేయించాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాఠే విశ్వ జనీన తత్వాన్ని పరిచయం చేయాలని స్ఫష్టం చేశారు. ’’ ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం షిండేను,  వారి మంత్రి వర్గాన్ని నేను ఒక్కటే కోరుతున్నా..సాఠేను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే మన దేశాన్ని మనం గౌరవించడమే‘‘ అని సీఎం కేసీఅర్ అన్నారు.

అన్నాభావ్ సాఠే జన్మించిన మాతంగి సమాజం దేశ మూల వాసులని తెలిపారు. వీరు మాతంగి మహాముని వంశస్థులని చెప్పారు.  ఈ సందర్భంగా పురాణ కాలం నాటి మాతంగి  వంశ చరిత్రను, జన్మ వృత్తాంతాన్ని సీఎం కేసీఆర్  వివరించారు. మాతంగి సమాజం యొక్క గొప్పతనాన్ని మహాకవి కాళిదాసు కీర్తించారని తెలిపారు. సంగీత సాహిత్యానికి ఆది మూలమైన మాతంగి దేవతగా  జ్ఞాన సరస్వతిగా కొలుస్తూ  కాళిదాసు గొప్పగా వర్ణించారని అన్నారు.  ’’మాణిక్య వీణాముపలాలయంతీం, మదాలసాం మంజుల వాగ్విలాసాం, మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం, మాతంగకన్యాం మనసా స్మరామి ‘‘ అనే కాళిదాసు శ్లోకాన్ని చదివి మాతంగి సమాజ  గొప్ప తనాన్ని సీఎం కేసీఆర్  శ్లాఘించారు. 

అన్నాభావ్ సాఠేకు భారత రత్న బిరుదు ఇవ్వాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. సభలో పాల్గొన్న ప్రజలు చప్పట్ల ద్వారా కేసీఆర్ డిమాండ్ కు మద్ధతు పలికారు. మాతంగి సమాజానికి మహారాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఆదరణ, గుర్తింపు ఇవ్వడం లేదని , ఎమ్మెల్యేలుగా ప్రజా ప్రతినిధులుగా చట్ట సభల్లో భాగస్వామ్యం కల్పించడం లేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాతంగి సమాజానికి సంపూర్ణ మద్ధతుగా నిలుస్తుందని, సమయం వచ్చినప్పుడు అన్ని రకాల గుర్తింపును, సహాయ సహకారాలు అందిస్తామని సీఎం కేసీఆర్ స్ఫష్టం చేశారు.  జై భీం, జై అన్నాభావ్ సాఠే, జై భారత్ నినాదాలతో  ప్రసంగాన్ని కేసీఆర్ ముగించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్నాభావ్ సాఠే ప్రతిమను, సాహిత్యాన్ని వారి కుటుంబ సభ్యులు బహుకరించారు.