– కొణతం దిలీప్
రాష్ట్ర రాజకీయాల్లో ఒక నాయకుడిగా చంద్రబాబు, ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీ భవితవ్యం ప్రశార్దకమైన రోజులివి. స్వంత మీడియా ఎన్ని జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నించినా ఈ సైకిల్ మళ్లీ రోడ్డెక్కే లక్షణాలు ఏమీ కనపడటంలేదు. దీంతో సహజంగానే తెలుగు తమ్ముళ్లు మెల్లగా ఈ మునిగే సైకిల్ ను వదిలేసి తమ భవిష్యత్ భద్రంగా ఉండే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీని అంటుపెట్టుకుని ఉన్న సీనియర్లు కూడా తెలుగుదేశాన్ని వదిలివెళ్తుండటంతో గంగవెర్రులెత్తిన చంద్రబాబు, పచ్చ మీడియా బాసులు ఈ మధ్య ఫిరాయింపుల మీద తెగ బాధపడిపోతున్నారు. ఆపాటికి తమ అధినాయకుడు కడిగిన ముత్యం అయినట్టు, ఫిరాయింపు అర్థం కూడా ఆయనకు తెలీయనట్టు ఆయన భజన బృందం, పచ్చ మీడియా కలిసి చేస్తున్న ప్రచారం చూస్తుంటే జుగుప్స కలుగుతుంది.
(Click on image to view full size)
స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉండి, మామపైనే పోటీకీ సిద్ధమని సవాల్ విసిరి, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చేతిలో చావుదెబ్బతిని, పది రోజులు తిరగకుండానే ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాపార్టీలోకి రావొద్దుపొమ్మని చీకొట్టినా సిగ్గులేకుండా ఆ పార్టీలోకి దొడ్డిదారిన దూరిన నీచమైన చరిత్ర చంద్రబాబుది.
రాజకీయాల్లో ఇంత నిర్లజ్జగా వ్యవహరించిన ఇంకొక నాయకుడు ప్రపంచ చరిత్రలో మనకు కనపడడు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశీయ వైద్యం, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.
ఎన్టీఆర్ పార్టీ పెట్టే సన్నాహాల్లో ఉండగానే ఆయన పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒక రోజు చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయనను కొత్త పార్టీలోకి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు చంద్రబాబు “రామారావుకు కేవలం 5% ఓట్లు మాత్రమే వస్తాయి – ఈయన జేబులో నుండి పైసా తీయడు అయినా సినిమా మోజుకు ఓట్లు పడతాయా? ఎట్టి పరిస్థితిలోనూ గెలవడు. నాకు కాంగ్రెస్ లో మంత్రి పదవి ఉంది. అది వదులుకుని నేను ఎలా వస్తాను?” అని వెటకారంగా మాట్లాడాడు అని స్వయంగా దగ్గుబాటి తను రాసిన “ఒక చరిత్ర – కొన్ని నిజాలు” పుస్తకంలో వెల్లడించాడు.
ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్న సమయంలో నవంబర్ 17 1982 నాడు సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ మీద కూడా పోటీకి సిద్ధమేనని సవాల్ విసిరాడు.
—
—
జనవరి 3, 1983 నాడు జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. 203 సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జనవరి 9, 1983 నాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశాడు.
పట్టుమని పదిరోజులు గడవకముందే చంద్రబాబు వచ్చి ఎన్టీఆర్ కాళ్ళుపట్టుకున్నాడు. తన విధానాలను మార్చుకుంటానని, అంకిత భావంతో పనిచేస్తానని కాళ్ళావేళ్లాపడటంతో కరిగిపోయిన ఎన్టీఆర్ చంద్రబాబును పార్టీలో చేర్చుకుంటానని మాట ఇచ్చాడు.
అంతకు మూడు వారాల కింది వరకూ మామపైనే పోటీకి సిద్ధమని బీరాలు పలికిన చంద్రబాబు, ఊసరవెల్లి కూడా ఉలిక్కిపడేంత వేగంగా రంగులు మార్చాడు.
చంద్రబాబు చేరికను పార్టీ చేత అమోదింపజేయడానికి నాదెండ్ల భాస్కర్ రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కాటూరి నారాయణ స్వామి, దేవినేని సీతారామయ్య, సిరిసిల్ల ఎమ్మెల్యే పాపారావులతో ఒక కమిటీ వేశాడు ఎన్టీఆర్. ఈ కమిటీ జనవరి 22 నాడు జరిగిన పార్టీ రాష్ట్ర సదస్సులో చంద్రబాబు చేరిక అంశాన్ని చర్చకు పెట్టింది. ఆరోజు సమావేశంలో చిత్తూరు జిల్లానుండి వచ్చిన అనేకమంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు చంద్రగిరి నియోజకవర్గం నుండి చంద్రబాబును ఓడించిన తెదేపా అభ్యర్ధి మేరసాని వెంకట్రామానాయుడు కూడా ఉన్నాడు.
ఎన్టీఆర్, కమిటీ సభ్యులు కలిసి చంద్రబాబును పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నామని ప్రకటించగానే సభలో ఒక్కపెట్టున నిరసన వ్యక్తమయ్యింది.
చంద్రబాబును ఓడించిన వెంకట్రామానాయుడు లేచి కాంగ్రెస్ నాయకులెవరినీ తెలుగుదేశంలో చేర్చుకోరాదని తీర్మానం ప్రతిపాదిస్తే ఆ సభలోని 99% మంది సభ్యులు చేతులు ఎత్తారు.
కార్యకర్తలను సముదాయించడానికి ఎన్టీఆర్ తో సహా అగ్రనాయకత్వం అంతా ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. చంద్రబాబు వంటి ఫిరాయింపుదార్లను పార్టీలో చేర్చుకోరాదని మహిళా నాయకులు కన్నీళ్లతో శాపనార్ధాలు పెట్టగా, ఆగ్రహోద్రగులైన కొందరు కార్యకర్తలైతే నాయకులను వెంటబడి తరిమారు.
ఈ పరిణామాలతో కలతచెందిన ఎన్టీ రామారావు సభనుండి అలిగి నిష్క్రమించగా, ఆ రోజు మధ్యాహ్నం సెషన్లో కార్యకర్తల నిరసనల మధ్యనే చంద్రబాబును చేర్చుకుంటున్నట్టు హడావిడిగా ప్రకటించారు.
ఆ రోజు సభ జరుగుతున్నంత సేపూ దాదాపు 300 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు వంటి ఫిరాయింపుదార్లను చేర్చుకోరాదని రామకృష్ణా స్టూడియో గేటు వద్ద నినాదాలు చేస్తూనే ఉన్నారు.
చిత్తూరు జిల్లా తెలుగు దేశం నాయకుడు సి.వి.సిద్ధయ్య మూర్తి ఒక ప్రకటనలో “ఎన్నికలు జరిగి 15 రోజులు కూడా కాలేదు, అధికారం లేకపోతే చంద్రబాబు వంటి వారు బతకలేరని వారి చర్యలవల్ల స్పష్టం అవుతుంది. చంద్రబాబు నాయుడు చేరిక వల్ల హరిజనులకు గానీ, తెలుగుదేశం కార్యకర్తలకుగానీ ఎంతమాత్రం న్యాయం జరగదు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు చంద్రబాబు వంటి వారి చేరిక ప్రమాదం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి చంద్రబాబును తెలుగుదేశంలో చేర్చుకోవడం తగదు”అని ఘాటుగా విమర్శించాడు.
తెలుగుదేశంలోని నాయకులు, కార్యకర్తలు వద్దువద్దని మొత్తుకున్నా చంద్రబాబు వంటి మయగాడిని పార్టీలో చేర్చుకున్నందుకు ఎన్టీఆర్ భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. చంద్రబాబు వైస్రాయ్ కుట్రతో వెన్నుపోటు పొడిస్తే మొదలు అధికారాన్ని, అటుపై ప్రాణాలనూ పోగొట్టుకున్నాడాయన.
అల్లుడని జాలితో చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీస్తే చివరికి తిన్నింటి వాసాలే లెక్కబెట్టి, ఎన్టీఆర్ నే తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించిన వంచకుడు చంద్రబాబు. తన వెన్నుపోటుతో కలిగిన ఆత్మక్షోభ ఎన్టీఆర్ ఉసురుదీస్తే, ఆయన మరణించిన రెండేళ్లు తిరగకుండానే మళ్ళీ ఎన్టీఆర్ నే దేవుడని కీర్తిస్తూ, ఆయన పేరు ప్రతిష్టలను ఓట్ల రూపంలో మార్చుకున్న కుసంస్కారి చంద్రబాబు.
చరిత్ర అంటే చంద్రబాబుకు ఎంత అయిష్టమయినా ఉండొచ్చు. ప్రజల జ్ఞాపకశక్తి మీద ఆయనకు చాలా చిన్నచూపు కూడా ఉండొచ్చు. కానీ ఆయన నయవంచక నైజం మాత్రం ప్రజల మదిలో, చరిత్ర పుస్తకాల్లో చాలా స్పష్టంగా రికార్డు చేయబడి ఉంది. అందుకే చంద్రబాబు వంటి గురివిందలు ఫిరాయింపుల గురించి, రాజకీయాల్లో విలువల గురించీ మాట్లాడితే వినడానికి అసహ్యంవేస్తుంది.
—
[నమస్తే తెలంగాణలో ప్రచురితం]