mt_logo

జాతి ఆకాంక్షను అణచలేరు

 

-డాక్టర్ పులిగుజ్జు సురేష్

ప్రకాశం జిల్లా

 

ఒక జాతి రాజ్యంగా ఏర్పాడాలంటే ప్రజల ఆకాంక్ష ఉంటే చాలు ఒక జాతి రాజ్యంగా ఏర్పడాలనే కోరికకు ఎలాంటి కారణాలు చూపనక్కరలేదు. ఆ కోరికను సమర్థించుటకు ప్రజల ఇచ్ఛ ఉంటే చాలు.

-డాక్టర్ బీఆర్ అంబేద్కర్


జాతుల హక్కులు హరించబడినప్పుడు ప్రజల అభిష్టాలను పట్టించుకోనప్పుడు, స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు జనం జాగృతమై జాతీయ పోరాటాలు ముందుకు వస్తాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కూడా అదే జరుగుతున్నది. జాతీయ ఉద్యమాలను నియంవూతించుటకు అణచివేయుటకు రాజ్యం పరిపరి విధాల ప్రయత్నం చేస్తున్నది. రాజ్యంగా ఏర్పాడాలనే ప్రజల బలమైన కోరిక ముందు రాజ్యం వేసే ఎత్తుగడలు సాగవు. చివరకు ప్రజల ఆకాంక్షలే విజయకేతనం ఎగురవేస్తాయి. ఐదు దశాబ్దాల నుంచి జరుగుతున్న తెలంగాణ సమరశీల పోరాటాలను గౌరవించడం రాజ్యానికే మేలు. దీనికి భిన్నంగా ప్రజల ఆకాంక్షలను, ఉద్దేశాలను నాశనం చేసే ప్రభుత్వాలు, వాటిని నిషేధించడం ద్వారా తమకు రక్షణ ఉంటుందని భావిస్తాయి.

ప్రజలు రాజకీయ సమరం చేసి గద్దెదించి కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే సామర్థ్యం ప్రజలకే ఉంటుంది. ప్రముఖ సామాజికవేత్త జె.ఎస్.మిల్ మాటల్లో చెప్పాలంటే ‘మానవజాతి తమ ఇష్టం వచ్చిన రీతిలో విభాగమయ్యేందుకు స్వేచ్ఛ ఉండాలి. వారు ఎవవరితో కలిసి ఉండాలన్నది వారే నిర్ణయించుకోవాలి’. మరొక అడుగు ముందుకేసిన బీఆర్ అంబేద్కర్ -‘వైషమ్యాలు లేని రాజ్యాలు, అసమానతలు తొలగించే ప్రాంతాలు ఏర్పడాలంటే చిన్న రాజ్యాలు అవసరమ’ని భావించారు. బ్రిటిష్ పాలనలో భారత్ ఉన్నప్పుడు పాకిస్థాన్ దేశంగా, తెలంగాణ రాజ్యంగా ఉండటాన్ని సమర్థించారు. అస్పృశ్యతలు, దాస్య విముక్తి కావాలంటే ప్రత్యేక నివాసాలు, ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు.

ప్రపంచ చరిత్రను ఉదహరిస్తూ సజాతీయ రాజ్యాలు ఏర్పడాలన్నప్పుడు టర్కీ, గ్రీస్, బల్గేరియా చరిత్ర ఉపకరిస్తుంది. ఆదేశాల్లోని రెండుకోట్ల మంది ప్రజలను వారి నివాసం నుంచి మరొక నివాస ప్రాంతాలకు తరలించారు. ప్రాంతీయ నివాస బదలాయింపు జరిగింది. తెలంగాణ ఉద్యమాలలో ఇంతటి గొంతెమ్మ కోరికలు లేవు. తమకు జరిగిన అన్యాయాన్ని పూడ్చుకోవడానికి, ప్రజల సంతోష జీవనానికి తెలంగాణలో స్యయంపాలన కావాలని కోరుకుంటున్నారు. సరిహద్దు ఎడబాటు తప్ప 1948 పూర్వమున్న ప్రత్యేక దేశం కావాలని కూడా అడగటంలేదు. దేశంలో తెలంగాణ రాజ్యం ఏర్పాటుకు రాజకీయ పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నట్టు తెలిపాయి. రాష్ట్ర ఏర్పాటు నాన్చుడు ధోరణిలో వాయిదాలు వేస్తూ సాకులు చెప్తూ దాటవేస్తూ రాష్ట్ర ఏర్పాటును పట్టించుకోవడం లేదు. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు వినిపించే స్వేచ్ఛఉంటుంది. తెలంగాణ అంశంలో తెలంగాణ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ నియంతృత్వం పోకడలను అనుసరిస్తున్న ప్రభుత్వం పరిష్కార దిశగా ఒక్క అడుగైనా ముందుకు వేయడంలేదు.

రాజ్యంలో యుద్ధాలను పుట్టించగల శక్తిగానీ,రాజ్యపతనం చేయడం,రాజ్యస్థాపనశక్తి ప్రజలమనస్సుల్లో ఏర్పడిన జాతీయ వాదానికి ఉంటుంది. ‘ఒక జాతి రాజ్యంగా ఏర్పడాలన్న కోరికకు ఎలాంటి కారణాలు చూపక్కరలేదు. ఆ కోరికను సమర్థించుటకు ప్రజల అభీష్టం (ఇచ్ఛ) ఉంటే చాలు’ అని అంబేద్కర్ అన్నారు. ప్రపంచంలో మత ప్రాతిపదికన దేశాలు ఏర్పాడ్డాయి. ఒకే మతం గల దేశాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు వెలిశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డువస్తున్నది ఏమిటి? తెలంగాణలో వనరుల కొరత ఉందని కొందరి వాదన. బయ్యారం గర్భంలో దాగిన సంపద భావి తెలంగాణ రూపురేఖలనే మార్చగలదు. సింగరేణి నల్ల బంగారం ఒక్కరోజు కళ్లు మూస్తే రాష్ట్రంలో సగం చీకట్లో బతకవలసి వస్తుంది. తెలంగాణలోని ప్రాచీన వ్యవసాయ పద్ధతులు చెరువు నీటి వ్యవసాయ వ్యవస్థను పునరుద్ధరించగలిగితే ప్రపంచ పటంలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది. పురోభివృద్ధి అనేది ఆయా రాజ్య భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

రోమ్‌లో దేవతారాధనే ప్రధాన ఆర్థిక వనరు. కొన్ని దేశాలు పర్యాటకాన్ని ప్రధాన ఆర్థిక వనరుగా మార్చుకుంటే, మరికొన్ని దేశాలు టెక్నాలజీ, పెట్రోల్, డీజిల్ వంటి వాటిని జాతీయ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంబాలుగా చేసుకున్నాయి. మాస్టర్‌కీ అనే రాజకీయ అధికారమే సకల సమస్యలకు పరిష్కారమని అంబేద్కర్ భావించినట్లు రాజ్యం వారి చేతుల్లో ఉంటే ఆరాజ్యాన్ని ఏ విధంగా మలచుకోవాలో ఆ ప్రాంత ప్రజలు నిర్ణయించుకుంటారు. తెలంగాణ ఏర్పడితే జల వివాదాలు చెలరేగుతాయని, సీమాంధ్ర ఎండిపోయి వ్యవసాయం కుంటుపడుతుందని కోస్తాంధ్రకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు అంటూ.., నీరు పల్లం ఎరుగు నిజం దేవుడెరుగు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టులు , డ్యాంలు వాటి కాలువల నిర్మాణ నమూనాలు తయారు చేసేటప్పుడు జరిగే రాజకీయాల వల్ల బీద ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఎవరైనా పట్టించుకున్నారా? రాష్ట్రంలో జరుగుతున్న భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడ జరిగినా కడపకే నీళ్లు ఎలా తీసుకుపోగలుగుతున్నారు? వెలుగొండ ప్రాజెక్టుకు ఎత్తైన ప్రదేశంలో ఉన్న కడపకు ఎలా నీళ్లు తీసుకుపోగలుగుతున్నారు. కడప బ్రాహ్మణి స్టీల్స్‌కు నీటిని పారించగలిగినప్పుడు నల్లగొండలోని ఫ్లోరైడ్ బాధితులకు కృష్ణనీరు పారించడం అసాధ్యమవుతుందా? బీటలు బారి నోళ్లు తెరిచిన పొలాలకు నీటిని పారించడం అసాధ్యమా? ప్రజలకు సేవ చేస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేసిన ఏలికలు తెలంగాణకు వ్యతిరేక విధానాలు చేసి తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల సంపద కుప్పలపై పడగ చాపి కూర్చోవడం వల్ల ప్రజల పోరాటాలు, అభీష్టాలు వారికి కనబడటంలేదు. ఉద్యమాలను నియంత్రిన్చడమో, అణచివేయడమో చేయవచ్చుననే భావన పాలకులలో కనిపిస్తున్నది. సంపదపై కూర్చున్నవారు వాటిని వదులుకోలేక సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య శత్రుభావం కలిగేలా చిచ్చుపెడుతున్నారు.

సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు రాజకీయ అధికారం పరిష్కారంగా చూడాలి. అయితే సామాజిక ఐక్యత లేకుండా రాజకీయ సంస్కరణ సాధ్యం కాదు. ఆ రాజకీయ సంస్కరణ సామాజిక విప్లవానికి వారధిగా మారుతుందని నమ్మకం విశ్వాసం ప్రజల్లో కలిగించడం అవసరం. అయితే నీటి మీద తేలుతున్న నూనెలాంటి కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారుల అభిప్రాయాలు మీడియా ద్వారా ప్రచారం జరగడం వలన సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య పెద్ద అగాధం ఏర్పడుతున్నది. సమాజ శ్రేయస్సుకు ఈ ధోరణి హాని చేస్తున్నది.

కానీ వాస్తవంలోకి వెళ్తే తెలంగాణ ప్రజలు ఏవిధంగానైతే మానసికంగా ప్రత్యేకంగా విడిపోయి ఉన్నారో, సీమాంధ్రులు కూడా అదే అభివూపాయానికి దగ్గరగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తెలంగాణలో ఉండడం వల్ల మౌళిక వసతుల కల్పన మొత్తం హైదరాబాద్‌లో జరిగిన అంశాలను కేంద్రంగా చేసుకుని సీమాంధ్ర దోపిడీదారులు రాజకీయం చేస్తున్నారు. రాజధాని అంశాన్ని సమస్య చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగానూ, ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు చిన్న కమతాలుగాను, పెద్ద దేశాలు చిన్న దేశాలుగాను సామాజిక వికేంద్రీకరణ చెందుతున్నాయి. పెద్ద మర్రిచెట్టు కింద దాని నీడన ఏ మొక్క ఎదగదు. దేశంలో కూడా అదే జరుగుతున్నది. దేశంలో అతి పెద్దపార్టీగా వేళ్లూనుకొన్న జాతీయ పార్టీలకు ఆధిపత్యం గుప్పిటి జారకుండా అధికారం కేంద్రీకృతంగా ఉండాలని కోరుకుంటున్నాయి. రాష్ట్రాలు పెరిగే కొద్దీ ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడం ప్రజలు చైతన్యమై జగరూకతతో ఉండటానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే ప్రజల మద్ధతు ఉన్నది.

ఈ పరిణామాల వలన సమీప భవిష్యత్తులో జాతీయ పార్టీలకు అధికార ముప్పు ఉంటుందేమోనని భయం. జాతీయ పార్టీలు రాజకీయ దుర్బుద్ధితో ప్రజాప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజల ముంగిట పాలన అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేయాలనే ప్రజల బలమైన కోరికకు ఆమోదముద్ర వేయడమే. దీనిని గౌరవించకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశం దాగి ఉన్నది. సామాజిక అనిశ్చితిలో ప్రభుత్వాలు పటిష్టంగా నిలబడి బట్టకట్టలేవు. మనిషి బట్టలు మార్చుకున్నంత వేగంగా, సులభంగా జాతి అభిమానం మారదని ఏలికలు గుర్తించాలి. ప్రజల్ని బానిసలుగా జమకట్టి కల్లబొల్లి కబుర్లతో మేము మంచి చేస్తున్నామని చెప్పే దృక్పథం మార్చుకోకపోతే రాజ్యాలు కూలిపోక తప్పదు. ప్రజాభిష్టానికి అనుకూలంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. రాజ్య నియంత్రణ, నియంతృత్వ ధోరణులకు స్వస్తి పలకాలి. స్వేచ్ఛకు ప్రజల్ని దూరం చేసిన ఫ్రెంచి ప్రభువులను వ్యతిరేకించి తిరగబడ్డ ఆ దేశపౌరుల మనోభీష్టాన్ని పాలకులు సమర్థించక తప్పలేదు. ఆ ప్రజలకు సార్వభౌమత్వం ప్రకటించవలసివచ్చింది.

ప్రజల ఆకాంక్షలను గౌరవించని ప్రభుత్వాలకు ఏనాడైనా అదే గతిపడుతుంది ప్రజలకు యుద్ధాలను సృష్టించే శక్తి ఉంటుంది. తెలంగాణ ఉద్యమ ఉధృతి కట్టలు తెంచుకోకముందే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం పాలకులకు అన్ని విధాలా శ్రేయస్కరం. లేకుంటే పోరాడే శక్తులకు ఏదీ అడ్డు కాబోదు. పోరాడే వీరుల చేతుల్లోనే భవిష్యత్ ఉంటుందని గ్రహించేరోజు ఎంతో దూరంలో లేదని తెలంగాణ ఉద్యమం నిరూపిస్తుంది.

[ నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *