mt_logo

సమైక్యాంధ్ర లీడర్ సాకే శైలజానాథ్ ఒక బ్లాక్ కోబ్రా!

– ఆపరేషన్ రెడ్ స్పైడర్‌లో బుక్కయిన సమైక్యాంధ్ర నేత

– పొద్దున్న డబ్బులేస్తే సాయంత్రానికి వస్తాయి

– రియల్టర్ తరఫున వకాల్తా పుచ్చుకున్న మంత్రి
– నల్లధనం తెల్లధనంగా మారుస్తామని హామీ
– ఇందులో భయపడాల్సిందేమీ లేదని భరోసా
– సంచలన వీడియోలు బయటపెట్టిన కోబ్రాపోస్ట్

న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 6: దేశంలో సంచలనం సృష్టిస్తున్న కోబ్రాపోస్ట్ తాజా స్టింగ్ ఆపరేషన్.. రాష్ట్రంలోనూ కలకలం రేపింది. సమైక్యాంధ్ర ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్, రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్‌కు హవాలా దందాలో భాగం ఉందని ‘ఆపరేషన్ రెడ్ స్పైడర్’ పేరుతో కోబ్రాపోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోబ్రాపోస్ట్ సోమవారం విడుదల చేసింది. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టే నల్లధనానికి మంత్రి గ్యారెంటర్‌గా ఉన్నట్లు వీడియో సంభాషణలో ఉంది. హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తున హవాలా కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో కోబ్రాపోస్ట్ విలేకరి ఇక్కడ కూడా ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మంత్రి శైలజానాథ్ అడ్డంగా దొరికిపోయారు.

నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే హవాలా ఏజెంట్ల కోసం అన్వేషించిన కోబ్రాపోస్ట్.. హైదరాబాద్‌లో ఇండియన్ బ్యాంక్‌కు చెందిన ఒక మేనేజర్ ఇచ్చిన సమాచారంతో రియల్‌ఎస్టేట్ వ్యాపారి డాక్టర్ హరికృష్ణ ప్రసాద్‌ను కలిసింది. ఒక మంత్రి పాత్రను సృష్టించిన కోబ్రాపోస్ట్ విలేకరి ‘మంత్రి’కి చెందిన రూ.25 కోట్లను సదరు రియల్టర్ వెంచర్‌లో పెట్టి వైట్ చేసేలా డీల్ కుదుర్చుకునేందుకు సమావేశమయ్యారు. ఈ సొమ్మును వైట్ చేయడంతోపాటు వడ్డీ కూడా చెల్లిస్తామని హరికృష్ణప్రసాద్ వారికి హామీ ఇచ్చారు. అయితే ఇంత పెద్ద మొత్తం పెట్టుబడి పెడుతున్న తమకు గ్యారెంటీ కావాలని విలేకరులు కోరడంతో రాష్ట్ర మంత్రి శైలజానాథ్ సీన్‌లోకి ప్రవేశించారు.

నల్లధనం పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు నటించిన కోబ్రాపోస్ట్ విలేకరితో మాట్లాడిన శైలజానాథ్.. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడంలో భయపడాల్సిందేమీలేదని ఒకటికి రెండు సార్లు నమ్మబలికారు. వారు పెట్టే పెట్టుబడికి హామీ కూడా ఇచ్చారు. హరికృష్ణ ప్రసాద్ నమ్మకమైన వ్యక్తి అని కితాబునిచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ‘ప్రాజెక్టు’లపై కలిసి పనిచేసేందుకు విలేకరి ఆసక్తిని ప్రదర్శించగా.. అందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి శైలజానాథ్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో తమవారితో కూడా మాట్లాడుతానని, పది రోజుల్లో ఢిల్లీ వస్తానని, అప్పుడు మరోసారి కూర్చుందామని స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విలేకరుల రహస్య కెమెరాల ముందు మంత్రి దిలాసాగా చెప్పారు.

విలేకరుల కోరిక మేరకు అప్పటికప్పుడే ఓ స్వామీజీతో ఫోన్‌లో మాట్లాడిన శైలజానాథ్ .. హరిప్రసాద్ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. ఆయన వెనుక తాము ఉన్నామని, అన్ని విషయాలూ చూసుకుంటామని హామీ ఇచ్చారు. అంతా మంచే జరుగుతుందని ఆయనకూ భరోసా ఇచ్చారు. ఈ స్వామీజీ ఎవరో కోబ్రాపోస్ట్ బయటపెట్టలేదు. ఇది హవాలా వ్యాపారం అని ధృవీకరించేలా మాట్లాడిన విలేకరులు.. ఇక్కడ క్యాష్‌ను తమ హవాలా బిజినెస్ ద్వారా విదేశాలకు పంపిస్తామనగా.. ‘పొద్దున వేస్తే.. సాయంత్రానికి వస్తాయి’ అంటూ శైలజానాథ్ ముక్తాయింపు ఇవ్వడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో స్వామీజీ ఎవరు? మరో పాత్ర మనోహర్‌కు హరిప్రసాద్‌కు ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాలను మాత్రం కోబ్రాపోస్ట్ వెల్లడించలేదు.

ఏదైనా ఆర్థిక కుంభకోణం లేదా సెక్స్ స్కాండల్ తాలూకు విడియోలు బయటపడితే పొద్దస్తమానం ఊదరగొట్టే సీమాంధ్ర మీడియా.. శైలజానాథ్ మనీలాండరింగ్‌పై పట్టనట్లు వ్యవహరించడం సందేహాలకు తావిస్తోంది.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *