mt_logo

మొదలు రావాల్సింది భౌగోళిక తెలంగాణ!

By: చందా రాములు 

మనకు (మన తెలంగాణవాళ్ళకు) ఇప్పటికన్న ఒక స్పష్టత ఉండాలె. మనం ఇప్పుడు కొట్లాడుతున్నది మన ప్రస్తుత భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలు ఎట్ల ఉన్నాయో, ఎట్ల ఏర్పడ్డాయో అట్లాంటి ఒక రాష్ట్రం కొరకు. మనం భౌతికంగా ఇతర రాష్ట్రాలున్నట్లుగనే ఒక భౌగోళిక తెలంగాణ కొరకు కొట్లాడుతున్నాం.

మన ప్రాంతం కొరకు కోరుతున్నాం. అంటే ఇతర రాష్ట్రాల్లో సామాజికన్యాయం, ప్రజాస్వామ్యం, మంచిపాలన ఎట్ల ఉంటాయో, అవినీతి, భ్రష్టాచారం, ఇతర సామాజిక దుర్లక్షణాలున్నాయో అన్నీ లేదా కొన్ని ఏర్పడనున్న మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండబోతున్నాయి. వాటన్నిటికొరకు రాష్త్రం ఏర్పడ్ద తరువాత వేరు వేరుగా పోరాడాల్సి ఉంటుంది. ఐతే తెలంగాణ ఏర్పడితే ఏమార్పూ జరగనప్పుడు ఎందుకు కొట్లాడాలె అని మన వాళ్ళే కొందరు ప్రశ్నిస్తుంటరు. ఏ మార్పూజరగదని ఎవరన్న చెప్పినా నమ్మేపనిలేదు. ఎందుకంటే ప్రపంచ పెట్టుబడిదారీవిధానల అరిష్టాలకు తోడుగా సీమాంద్రులు కొనసాగిస్తున్న నీళ్ళు, భూములు, ఉద్యోగాల దోపిడీ మాత్రం పూర్తిగా ఆగిపోతుంది. వారిదోపిడీ ఆగితే కూడా తెలంగాణప్రజలకు సగం రిలీఫ్ దొరికితీరుతుంది. ఉద్యోగాలొచ్చి, నీళ్ళు పొలాల్లో పారి, తాగడానికి మంచినీళ్ళు దొరికి, విద్య, వైద్య సదుపాయాలు విస్తరించి, ఎంతో కొంత కొనుగోలుశక్తి పెరిగి సగటు భారతీయునికంటే కూడా తెలంగాణవాడు ఉచ్చస్థితిలో ఉంటాడు. అది చాలు తెలంగాణవాళ్ళు నేటి దయనీయ స్థితినుండి బయటబడటానికి.

గత 56 ఏండ్ల సీమాంధ్రుల పాలనలో ఎన్నడూ సామాజిక ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క నాడు కూడా అడగని వాళ్ళు, డిమాండ్ చెయ్యనివాళ్ళు ఇప్పుడు తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తున్న సమయంలో అడుగుతున్నారంటే అడిగేవాళ్ళు తెలంగాణవాళ్ళైనా వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాల్సిందే. అట్ల మాట్లాడేవాళ్ళు తమకు తెలువకుండానే ఇతరులచేతిలో చిలుకలైపోయారన్నమాట. వాళ్ళు పలికే పలుకులు ఇతరులు నేర్పితే పలుకుతున్నవన్నమాట.

తెలంగాణ ఉద్యమకారుల్లో కొందరు ఆ మధ్య ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని కూడా డిమాండ్ చేశారు, అదేదో ఇప్పుడున్న సమైక్యరాష్త్రంలో ఉన్నట్లు. సమైక్య రాష్ట్రంలో తమకు కనీస అవసరాల్లో కూడా ఏమీ అందకున్నా, ఏదీ రాకున్నా, ఏదీతీరకున్నా ఇంకొందరు తెలంగాణ వస్తే మాకేంటి? అనే ప్రశ్న వేస్తుంటారు. ఇంకొందరికి తెలంగాణ వస్తే రెడ్లపాలు, దొరలపాలు, ముస్లింలపాలు, నక్సలైట్లపాలు ఐతదని కొందరు మాట్లాడుతుంటరు. వాళ్ళలో ప్రొఫెసర్లవంటి వాళ్ళు కూడా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టం. అట్లాంటి మేధావులకు సింగరేణి ఓపెన్ కాస్ట్‌లతో ఏర్పడుతున్న అఖాతాలవంటి బొందలు/నీళ్ళు లేని సరస్సులు ఏర్పడి ఊళ్ళు ఖాళీచేసి వలసలుపోతున్న ఉత్తరతెలంగాణ జనాలు కనిపించరు.

తెలంగాణ వారికి రావాల్సిన/చెందిన లక్షలాది ఉద్యోగాలు,నదుల నీళ్ళు, హైవే రోడ్లు కాలువల విస్తరణ పేరిట సెజులు అస్సైండ్ ప్రజోపయోగం పేరిట భూములు, ఎన్నిలక్షల కోట్లలోనైనా నిధులు సీమాంధ్రులు నిరంతరం కొల్లగొట్తుకుపోతున్నా కనిపించవు. అసలు తెలంగాణవాళ్ళకు సీమాంధ్రులవల్ల వచ్చిన, వస్తున్న ఇబ్బందులు, కష్టాలు అటువంటివాళ్ళు అర్థంచేసుకునే ప్రయత్నాలే చెయ్యరు. చెయ్యకపోగా ఉద్యమంచేస్తున్న తెలంగాణ నాయకులకు వ్యతిరేకులుప్రచారం కొరకు వేస్తుండే ప్రశ్నలవంటి ప్రశ్నలు వేస్తుంటారు. ఇంటా బయట చెప్పాలంటె సీతమ్మోరి కష్టాలు తెలంగాణోళ్ళవి. ఇట్లాంటివి స్వతంత్రం వచ్చిన తరువాత ఏర్పడ్ద ఏ రాష్ట్రానికి కలుగలేదు. అందుకే తెలంగాణ రావాలంటే అన్ని శక్తులతో, అన్ని రకాల వ్యక్తులతో తెలంగాణ పోరాటం చెయ్యక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *