ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రజాపాలన ఆరు గ్యారెంటీలకు వచ్చిన దరఖాస్తులు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కేవలం అప్లికేషన్ల పేరుతో ప్రజలను గందరగోళపరిచి కాలయాపన చేసేందుకు పన్నిన కుట్రలాగా కనిపిస్తుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరు గ్యారెంటీలకు ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఇప్పటికే పథకాలు అందుతున్న వారు మళ్లీ అప్లికేషన్లు పెట్టుకోవాలా లేదా అనే విధివిధానాలు ప్రభుత్వం ప్రజలకు చేరవేయడంలో విఫలమవడంతో ప్రజలు అయోమయానికి గురైనట్టు కనిపిస్తుంది.
ఉదాహరణకు గత ప్రభుత్వం వానాకాలం పంటకు రైతుబంధు పథకం లబ్ధిదారులు దాదాపు 69 లక్షల కాగా, రైతు భరోసా పథకానికి రైతు బంధు అందుతున్న రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం తెలిపింది. 69 లక్షల రైతు బంధు లబ్ధిదారులు కాకుండా గత 6 నెలల్లో కొత్తగా భూములు కొన్న వారు యాభై వేలమంది మంది కూడా ఉండరు. కానీ రైతు భరోసా పథకానికి 38 లక్షల కొత్త దరఖాస్తులు రావడం చూస్తుంటే రైతులు ఎంత అయోమయానికి గురయ్యారో తెలుస్తుంది.
ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు వారిని ఆదుకుంటాం అని అనేక పర్యాయాలు ప్రకటించింది కానీ.. ప్రజాపాలన దరఖాస్తులలో మాత్రం కేవలం 2.6 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న 2.6 లక్షల కౌలు రైతులను, దరఖాస్తు చేసుకోని 20 లక్షల మంది కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది? అసలు కౌలు రైతులను గుర్తించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
2014లో తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కొరకు దరఖాస్తులు ఆహ్వానించగా అప్పుడు కేవలం 600 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా వారిని గుర్తించి వారికి ఆర్థిక సాయం మరియు ప్రభుత్వ ఉద్యోగం అందించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్లలో ఉద్యమ అమరుల కుటుంబాలకు 250 గజాల స్థలం కొరకు ఏకంగా 23,794 మంది దరఖాస్తు చేసుకున్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో 23 వేల మంది అమరులు అయ్యారా? ఇన్ని తప్పుడు దరఖాస్తులు చూస్తుంటే దీని వెనక కాంగ్రెస్ నాయకులకు స్థలాలను దోచిపెట్టే పెద్ద కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అదేవిధంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలం కొరకు 84,659 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో 3 కోట్ల తెలంగాణ ప్రజానీకం పాలుపంచుకున్నారు. అందరూ ఇంటి స్థలాలకు అర్హులే కదా మరి?
గత ప్రభుత్వం 5 లక్షల పైచిలుకు దివ్యాంగులకు పింఛన్లు అందించేది అయితే ప్రజాపాలన అప్లికేషన్లలో మాత్రం 2.72 లక్షల మంది దివ్యాంగులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ కేవలం కొత్త దరఖాస్తులా? దరఖాస్తు చేసుకోని గత లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తారా లేదా అని దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు.
దివ్యాంగుల పింఛన్లు కాకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం 40 లక్షల ఆసరా పింఛన్లు అందించేది. కానీ ప్రజాపాలన అప్లికేషన్లలో మాత్రం కేవలం 22 లక్షల దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకోని గత లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తారా లేదా అనేది చెప్పకపోవడంతో ఆసరా పింఛన్ల లబ్ధిదారులలో కూడా గందరగోళం ఏర్పడింది.
ఈ విధంగా సరైన విధివిధానాలు లేకుండా ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు గందరగోళం సృష్టించి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టే నాటకంలా కనిపిస్తుంది అని ఈ దరఖాస్తులు తీరుని గమనిస్తున్న వారు ఆరోపిస్తున్నారు.
ఒకవేళ వీటన్నిటిని అధిగమించి, ప్రభుత్వం అన్ని గ్యారెంటీలను అమలు చేసినా ఖజానాపై కొన్ని లక్షల కోట్ల భారం పడనుంది. కేవలం ఐదు గ్యారెంటీల కోసం సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవ్వొచ్చని ఒక అంచనా.. ఇవి కాకుండా ఇందిరమ్మ ఇండ్లకు రూ. 5 లక్షల కోట్లు వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ మొత్తంలో నిధులు ఎలా సమకూరుస్తుంది అనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.
ఈ గ్యారెంటీలు కాకుండా నిరుద్యోగ భృతి, అంబేద్కర్ అభయహస్తం (దళిత బంధు, గిరిజన బంధు), విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వడ్ల కొనుగోలు బోనస్, గ్రామ పంచాయితీలకు ప్రత్యేక గ్రాంట్లు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. వారి జీతభత్యాలు అన్ని కలుపుకుంటే ప్రభుత్వానికి ఏడాదికి రూ. 3 లక్షల కోట్లు అవసరం పడుతుందని అంచనా.
హామీల వారీగా సంవత్సరానికి అయ్యే ఖర్చు అంచనా
మహాలక్ష్మి పథకం
దరఖాస్తులు – 92,23,195
ఖర్చు – రూ. 27,669 కోట్లు
రూ. 500 గ్యాస్ సిలిండర్
దరఖాస్తులు – 91,49,838
ఖర్చు – రూ 7,685 కోట్లు
ఇందిరమ్మ ఇండ్లు
దరఖాస్తులు – 82,82,332
ఖర్చు – రూ. 4.96 లక్షల కోట్లు (ఒక్కసారి)
గృహాజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్)
దరఖాస్తులు – 81,54,185
ఖర్చు – రూ. 7,828 కోట్లు
రైతు భరోసా
ఖర్చు – రూ. 23,510 కోట్లు
రైతు భరోసా (కౌలు రైతులు)
దరఖాస్తులు – 2,63,616
ఖర్చు – రూ. 395 కోట్లు
రైతు కూలీలకు రూ. 12,000
దరఖాస్తులు – 40,95,581
ఖర్చు – రూ. 4,914 కోట్లు
అమరుల కుటుంబాలకు నెలకు రూ. 25,000
దరఖాస్తులు – 23,794
ఖర్చు – రూ. 713 కోట్లు
దివ్యాంగుల పింఛన్లు
కొత్త దరఖాస్తులు – 2,77,292
ఖర్చు – రూ. 5,718 కోట్లు (పాతవి, కొత్తవి కలిపి)
ఇతర పింఛన్లు
కొత్త దరఖాస్తులు – 22,07,245
ఖర్చు – రూ. 29,793 కోట్లు (పాతవి, కొత్తవి కలిపి)