- విద్యుత్తు సంస్కరణలు వద్దన్నందుకు తెలంగాణపై భారం
- సంస్కరణల రాష్ట్రాలకు కేంద్రం తాయిలం
- జీఎస్‌డీపీలో మనకు 0.5 శాతం నిధులు లాస్

తెలంగాణ ఏర్పడ్డప్పటినుంచీ సీఎం కేసీఆర్ రైతుల పక్షానే నిలబడ్డారు. వారి సంక్షేమం కోసం దేశంలోనే ఏ రాష్ట్రంలోలేని పథకాలను ప్రవేశపెట్టారు. సాగునీటి గోస తీర్చి అన్నదాతల కన్నీళ్లు తుడిచేందుకు కాళేశ్వరం కట్టారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, సకాలంలో ఎరువులు ఇలా రైతుల ప్రయోజనాల కోసమే పరితపించారు. కేంద్ర వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఆదేశిస్తే.. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో ఆ సంస్కరణలకు ఎదురుతిరిగారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని కేంద్రానికి తేల్చి చెప్పారు. ఉచిత విద్యుత్తునందిస్తూ, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడుతూ, డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకుంటూ.. తెలంగాణ సర్కారు గొప్ప త్యాగం చేసింది. కేంద్రం కత్తిగట్టి సంస్కరణలు పేరిట నిధులిస్తామని బేరం పెట్టిన.. తమకు కేంద్రం విదిల్చే డబ్బులు అవసరం లేదని ఆర్థిక త్యాగానికి సిద్ధపడింది. కేంద్రం ఇచ్చే కోట్లు తమకు ముఖ్యం కాదని రైతుల సంక్షేమం, ప్రభుత్వ సంస్థలను నిలుపుకోవటమే ముఖ్యమని కేసీఆర్ ప్రభుత్వం చాటిచెప్పింది.
సంస్కరణలకు నో చెప్పినందుకు భారీ లాస్..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్తు సంస్కరణలు అమలు చేసేది లేదని రాష్ట్ర ప్రభుత్వం కరాకండిగా తేల్చి చెప్పింది. ఫలితంగా రాష్ట్రాలకు కేంద్రం తాజాగా ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్) రూపంలో తెలంగాణ రాష్ట్రం భారీగా నష్టపోయింది. కేంద్రం చెప్పినట్టు నడుచుకుని, విద్యుత్తు సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్రం ఇన్సెంటివ్ రూపంలో తాయిలాలు ప్రకటించింది. 12 రాష్ట్రాలకు రూ.1,43,332 కోట్ల ఇన్సెంటివ్‌లను బుధవారం మంజూరు చేసింది. వీటిలో సంస్కరణలు అమలు చేసినందుకు ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 0.5 శాతం ఇచ్చే మొత్తం కూడా దాదాపు రూ. 66,413 కోట్లు ఉండటం గమనార్హం. రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా, డిస్కంలను ప్రైవేటీకరించడానికి దారులు తెరిచేలా ఉన్న సంస్కరణలను అమలు చేయనందుకు తెలంగాణ త్యాగం చేసి, వేల కోట్ల నిధులను వదులుకున్నది. తమకు సంస్కరణలు ముఖ్యం కాదని రైతుల సంక్షేమమే ముఖ్యమని చాటుకున్నది. కేంద్రం తాజాగా కేటాయించిన ఇన్సెంటివ్‌లలో 2021-22, 2022-23 మధ్యలో అదనపు రుణ పరిమితితో పశ్చిమబెంగాల్ అత్యధికంగా రూ.15,263 కోట్లను కేంద్రం నుంచి ఇన్సెంటివ్‌గా అందుకున్నది. ఇక ఆ తర్వాత రాజస్థాన్ రూ.11,308 కోట్లతో రెండోస్థానంలో ఉండగా, మణిపూర్ రూ.180 కోట్లు, మిజోరాం రూ.192 కోట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.
రైతుల కోసం తృణప్రాయంగా..
2021-22 నుంచి 2024-25 మధ్యకాలంలో విద్యుత్తు సంస్కరణల అమలు చేస్తే.. రాష్ట్ర జీఎస్‌డీపీలో 0.5 శాతం ఆర్థిక ప్రోత్సాహకాలిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇలా నాలుగేండ్ల పాటు ఈ ప్రోత్సాహకాలివ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. అమలుచేసే సంస్కరణలను బట్టి అదనపు ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం, ప్రభుత్వ రంగంలోని విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించడం, విద్యుత్తు రాయితీలను రద్దుచేయడం, క్రాస్ సబ్సిడీని ఎత్తివేయడం వంటి సంస్కరణలున్నాయి. అయితే రాష్ట్ర ప్రజానీకం విస్తృత ప్రయోజనాలను కాంక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఈ సంస్కరణలను మొదటి నుంచి వ్యతిరేకించింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ తన గొంతులో ప్రాణమున్నంత వరకు మోటార్లకు మీటర్లు బిగించమని కుండబద్ధలు కొట్టారు. ఒక వేళ ఈ సంస్కరణలు రాష్ట్రం అమలు చేసి ఉంటే కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు వచ్చేవి. కాని వీటిని ప్రజల కోసం తృణప్రాయంగా వదులుకునేందుకు రాష్ట్రం సిద్ధపడింది. ప్రభుత్వ రంగంలోనే విద్యుత్తు సంస్థలను నడుపుతామని, ప్రజలు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటించడమే కాదు.. ఆచరించి చూపింది.