mt_logo

అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీ: మంత్రి కేటీఆర్ 

  • ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని
  • సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ నినాదంగుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్ గా మారింది

ప్రధాని మోడీ ప్రసంగం పై బీఆర్ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.ప్రధానమంత్రి మోడీ పర్యటన మొత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ప్రధానమంత్రి ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం ఇక్కడి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందన్నారు. ప్రధాన మంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయగలరో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు.  తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని అయినా చెబితే బాగుండేదన్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో అడుగడుగునా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని గుర్తుంచుకొని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఆ పార్టీని తెలంగాణ నుంచి ప్రజలు తన్ని తరిమేస్తారని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. 

45 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, డిమాండ్ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే రిపేర్ షాప్ పేరుతో ప్రధానమంత్రి తెలంగాణ ప్రాంతానికి ఏదో గొప్ప మేలు చేసినట్లు చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమే  అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా తన సొంత రాష్ట్రానికి 20 వేల కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీని మోసపూరితంగా తరలించుకుపోయిన ప్రధానమంత్రి మోదీ సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ అనే నినాదం.. గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్ గా మారిపోయిందని మండిపడ్డారు.  తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిది సంవత్సరాలలో అడిగిన బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ పునః ప్రారంభం, తెలంగాణలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి మొదలుకొని, నూతన రైల్వే లైన్లు ఏర్పాటు,  రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను పక్కన పెట్టిన ప్రధానమంత్రి  తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను రాష్ట్ర ప్రజలను గమనిస్తున్నారని, సరైన సమయంలో బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.  

దేశానికి గోల్డెన్ పీరియడ్ వచ్చిందని, యువత ఈ బంగారు కాలాన్ని వినియోగించుకోవాలన్న ప్రధానమంత్రి అసలు దేశంలోని యువత కోసం గత తొమ్మిది సంవత్సరాలలో చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని అయినా చెప్పి ఉంటే బాగుండేదని కేటీఆర్ అన్నారు. ఒకవైపు దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం  పెంచిన తన అసమర్ధ పాలన పై ప్రశ్నిస్తే. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే అంటూ అవహేళన చేసిన ప్రధాన మంత్రి మోడీ యువత గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి, కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 16 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను నింపకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లోని  ఉద్యోగాలను శాశ్వతంగా ప్రైవేటుపరం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలోని  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పైన మాట్లాడడం గురువింద సామెత కన్నా హీనంగా ఉందన్నారు.  తెలంగాణ యువతకు లక్షలాది ఉద్యోగాలను అందించే అవకాశం ఉన్న ఐటీఐఆర్  ప్రాజెక్టును ప్రభుత్వం లోకి రాగానే రద్దు చేసిన ప్రధానమంత్రి మోడీ ఇక్కడి ఉన్నత విద్యావంతులకు చేసిన మోసాన్ని ఎన్నటికీ తెలంగాణ యువత మరిచిపోదన్నారు.

రాష్ట్రంలోని యూనివర్సిటీల ఖాళీల గురించి మాట్లాడిన ప్రధాని,  దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల ఖాళీలను ముందుగా భర్తీ చేయాలన్నారు.  యూనివర్సిటీల ఖాళీల భర్తీ కోసం మా ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని, బీజేపీ నాయకురాలు, ప్రస్తుత గవర్నర్ తమిళిసై తొక్కిపెట్టిన విషయంలో ప్రధానమంత్రి స్పందించి ఉంటే బాగుండేదని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ గురించి అసత్యాలు మాట్లాడిన ప్రధానమంత్రికి,  దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క గురుకుల విద్యార్థి పైన 1,25,000 ఖర్చుతో అత్యున్నత ప్రమాణాల విద్య అందిస్తున్న ప్రభుత్వం మాదని గుర్తుంచుకుంటే మంచిదని కేటీఆర్ హితవు పలికారు.