చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మడమతిప్పని పోరాటం చేసింది. స్వరాష్ట్రంలో నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై తీర్మానం చేసింది. ఆ కాపీని కేంద్రానికి పంపించింది. అనంతరం నిర్వహించిన అన్ని సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చించింది. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయగా, మహిళా బిల్లుపై పార్లమెంట్‌లో ఎంపీలు గళమెత్తారు. బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు.
ఈ బిల్లు కోసం బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత దేశవ్యాప్త ఉద్యమం చేపట్టారు. ఈ ఏడాది మహిళా దినోత్సవం రోజున ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసి, రాజకీయ పార్టీలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల మద్దతు కూడగట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్ర సర్కారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించింది. ఈ స్ఫూర్తితోనే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓబీసీ బిల్లు కోసం ఉద్యమాన్ని ప్రారంభించింది.
ఓబీసీల కోసం కదులుతున్న బీఆర్ఎస్
దేశంలో ఆదినుంచీ నష్టపోయిన వర్గమేదైనా ఉన్నదంటే అది బీసీలే. బీసీ కులగణన చేయాలని, బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్లను పట్టించుకోకుండా కేంద్రం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. దీనిపై బీఆర్ఎస్ ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నది. అదే సమయంలో తెలంగాణలో బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. కులవృత్తులకు జవజీవాలు తీసుకొచ్చి, బీసీల జీవితాల్లో వెలుగులు నింపింది. బీసీ సాధికారతకోసం కృషిచేసింది. అలాగే, బీసీ కులగణన నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగీవ్ర తీర్మానాలు చేసి కేంద్రానికి పంపింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఓబీసీ బిల్లుపై ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
ఈ బిల్లుకోసం తెలంగాణతోపాటు మహారాష్ట్ర వేదికగా ఉద్యమానికి బీఆర్ఎస్ ప్రణాళిక రచిస్తున్నది. ఈ మేరకు అక్కడి బీఆర్ఎస్ విభాగం సన్నాహాలు ప్రారంభించింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్రలో చొచ్చుకొనిపోయిన బీఆర్ఎస్.. ఇప్పుడు బీసీలు అధికంగా ఉండే మరాఠాగడ్డనుంచి ఓబీసీ పోరును ఉధృతం చేసేందుకు నడుంబిగించింది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్‌ఎస్సే సరైన వేదిక అని బీసీ ఉద్యమ, ప్రజాసంఘాలు విశ్వసిస్తున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ బిల్లు కోసం కార్యచరణ రూపొందిస్తే తాము కలిసి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించినట్టు సమాచారం.