mt_logo

త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో.. అన్ని వర్గాలు సంతోషపడే శుభవార్త: మెదక్ జిల్లా తూప్రాన్‌లో హరీష్ రావు

సీఎం కేసీఆర్ గారు త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. అన్ని వర్గాలు సంతోషపడే శుభవార్త త్వరలోనే వింటారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రజలను తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప నాయకుడు ఆయన. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే టీఆర్ఎస్ పార్టీ కోసం తన ఇంటినిచ్చిన గొప్ప నాయకుడు కొండా బాపూజీ అని అన్నారు.

జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన ఆయన ఈ ప్రాంతం బాగుపడాలంటే ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందేనని బలంగా నమ్మారు. పద్మశాలి సమాజానికి ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ.. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది అని తెలిపారు. లక్ష్మణ్ గారి స్మృత్యర్థం తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టుకున్నాం అని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే తూప్రాన్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ హయాంలో తూప్రాన్‌కు వచ్చినప్పుడు ఎటు చూసినా చెత్త చెదారంతో పందులతో అపరిశుభ్రంగా ఉండేది అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పట్టణం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కేసీఆర్‌కు ముందు, కేసీఆర్ వచ్చాక పట్టణంలో ఏం జరిగిందో మీరే బేరీజు వేసుకోవాలి అని అన్నారు.

ఈ ఒక్క రోజే 50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇంత పురోగతి కనిపిస్తున్నా ఏమీ జరగలేదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అంటున్నాడు. తూప్రాన్ అభివృద్ధి కాలేదు అంటే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టే. ఈ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఆడపడచులు పడ్డ కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేం అని తెలిపారు.

ఈరోజు మంచినీళ్లు పట్టుకునే ప్రతి ఆడపడచు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటున్నది. రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి అవ్వకు కేసీఆర్ పెద్ద కొడుకులాగా కనిపిస్తాడు. కల్యాణ లక్ష్మి, షాదీ ముభరక్ తీసుకునే ప్రతి ఆడపిల్లకు మేనమామ మన కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ కనిపిస్తాడు అని మంత్రి అన్నారు.

పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశం పాటుపడుతున్న కేసీఆర్ గారిని ప్రతిపక్షాలు కావాలని తిడుతున్నాయి. మీకు తిడుతున్న ప్రతిపక్షాలు కావాలా? సంక్షేమం రూపంలో కిట్లు ఇస్తున్న కేసీఆర్ కావాలా? మహిళా పక్షపాతి అయిన కేసీఆర్ గారు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని స్పష్టం చేశారు.

నిజం ప్రచారం పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది. ప్రతిపక్షాల అబద్ధాలు తిప్పికొట్టాలంటే మీరంతా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చాటి చెప్పాలి. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఆపని ఏకైక రాష్ట్రం తెలంగాణ. కరోనా విపత్తులో సైతం ఆసరా పెన్షన్ ఆగలే. కళ్యాణ లక్ష్మి అగలే అని గుర్తు చేశారు.

కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం మనందరి అదృష్టం. ఆయన ప్రాతినిధ్యంవల్లే గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయి. అందుకే ఆయనను అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాలి. సిద్దిపేట కంటే ఎక్కువ మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దాం అని పిలుపునిచ్చారు.