mt_logo

జూలై 25న బడ్జెట్ తర్వాత మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ బృందం

బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కోవా లక్ష్మి, విజయుడు, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, సురభి వాణి దేవి ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు. రేపు పార్లమెంటులో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలి అని అన్నారు.

బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన మూడు గంటల పాటు జరిగింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూధనాచారిని ఏకగ్రీవంగా ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. బీఆర్ఎస్ఎల్పీ మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తాం అని తెలిపారు.

ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అదే రోజు మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరుతుంది. ఈ నెల 26న మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజ్‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సందర్శిస్తుంది. లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృధాగా పోతున్నా ఈ ప్రభుత్వం పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోయడం లేదు. మిడ్ మానేరు, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్లలో నీళ్లు నింపి రైతుల పొలాలకు తరలించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం అని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు ఎల్పీ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేశాము. నిరుద్యోగుల సమస్యలపై చర్చ కోసం రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో పాల్పడ్డ కుంభకోణాలపై అసెంబ్లీలో నిలదీస్తాం అని హరీష్ రావు ప్రకటించారు.

పౌరసరఫరాల శాఖలో కుంభకోణాలు జరిగాయి.. వాటిని లేవనెత్తుతాం. వేరే రాష్ట్రాల్లో నిషేధించిన బీర్లను ఇక్కడ ప్రవేశ పెట్టేందుకు చేసిన ప్రయత్నాల వెనుక ఉన్న అదృశ్య శక్తుల బండారాన్ని బయట పెట్టాలని అసెంబ్లీలో నిలదీస్తాం. మంత్రికి తెలియకుండానే నిషేధిత బీర్ల ప్రవేశం కోసం ప్రయత్నం ఎలా జరిగింది అనే దానిపై చర్చకు పట్టుబడుతాం అని పేర్కొన్నారు.

ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మిగిలిపోయిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు మేము చెల్లించాం.. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియలో జాప్యంపై నిలదీస్తాం.. రైతు భరోసాలో ఆలస్యంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం అని అన్నారు.

ఫిరాయింపులపై అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తాం.. కేసీఆర్ అన్ని అంశాలపై మాకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసమే మంత్రులతో భేటీలు అన్న రేవంత్ ఇప్పుడు ఏం చెబుతారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా.. రాహుల్ గాంధీతో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రేవంత్ మాట్లాడించాలి అని డిమాండ్ చేశారు.

ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలి.. పార్లమెంటు పోడియం దగ్గరకు వెళ్లి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసన తెలపాలి. ముందస్తు అనుమతితోనే కొందరు ఎమ్మెల్యేలు ఈరోజు భేటీకి హాజరు కాలేదు అని హరీష్ రావు తెలిపారు.