mt_logo

నిరుద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు: హరీష్ రావు

అసెంబ్లీలో నిరుద్యోగులపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.. అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు అని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయింది. రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్టీసీ యూనియన్‌ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదు అని విమర్శించారు.

నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా రాజీనామా చేశాను. మేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయింది. మేము అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుంది అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయింది.. అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు అని అన్నారు.

నిరుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ వస్తే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.. వెంటనే ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.