తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు కూల్చివేతల పర్వం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా పేరిట చెరువులకు దగ్గర్లో ఉన్న కట్టడాలతో మొదలైన కూల్చివేతలు.. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో మొదలవ్వబోతున్నాయి.
బయటకి అక్రమ కట్టడాలను కూలుస్తున్నామని రేవంత్ ప్రభుత్వం బుకాయిస్తున్నప్పటికి.. వాస్తవానికి ఈ రెడ్ మార్కింగ్‌లు, కూల్చివేతల ప్రక్రియ రేవంత్ మానసపుత్రిక రూ. 1.5 లక్షల కోట్ల మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం అని బలమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక బడా కంపెనీకి ఈ ప్రాజెక్ట్ కట్టబెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ కూడా నడుస్తుంది. వారికి లైన్ క్లియర్ చేయడానికే మూసీ చుట్టూ ఉన్న ఇళ్లను బలవంతంగా కూల్చబోతున్నారని బాధితులు వాపోతున్నారు.
అసలు డీపీఆర్ కూడా లేని మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అంచనాలు రూ. 50 వేల కోట్ల నుండి రూ. 1.5 లక్షల కోట్లకు పెంచేసిన రేవంత్.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే పార్కులు, ప్లాజాలు, ఎంటర్‌టైన్మెంట్ జోన్ల కోసం తమకు గూడు లేకుండా చేస్తున్నాడని రేవంత్‌పై నిప్పులు కక్కుతున్నారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల కన్నీళ్లను రూ. 1.5 లక్షల కోట్లకు రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నాడని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
గత 20-30 ఏళ్ళగా తాము ఉంటున్న ఇళ్లను.. ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి నష్టపరిహారం కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ లేకుండా తమ ముందే రేవంత్ సర్కార్ మార్కింగ్ చేసి, కూల్చడానికి సిద్ధమవడం చూసి విలపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తమని రోడ్డు పాలు చేెశాడని శాపనార్థాలు పెడుతున్నారు.. ఎక్కడికక్కడ అధికారులను ఆడ్డుకుంటున్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తమని కంటికి రెప్పలా కాపాడుకున్నాడని.. గతంలో కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేసి, అనుమతులు ఇచ్చిన ఇళ్లను ఇప్పుడు వచ్చి అక్రమ కట్టడాలు అనడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సీఎం అన్న ఇంటికి, పెద్దల ఇళ్ళకేమో నోటీసులు ఇచ్చి, హైకోర్టు స్టే ఇచ్చేదాక ఆగిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ఇళ్ళకి వచ్చేసరికి నిర్దాక్షిణ్యంగా కూల్చడం ఏంటని సర్వత్రా ఆగ్రహం పెల్లుబికుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఇప్పుడు పేదల జీవితాలు నాశనం అవుతున్నాయి. తమ ఇళ్లను అన్యాయంగా కూలుస్తున్న ప్రభుత్వం.. ఇంకెందుకు ఆలస్యం.. తమ ప్రాణాలు కూడా తీయాలి అంటూ బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 1.5 లక్షల కోట్ల మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం రేవంత్ సర్కార్ పేదలను బలి చేయడం ఏంటని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విస్మయం చెందుతున్నారు.