mt_logo

హైద‌రాబాద్ అభాగ్యుల‌కు ఓ అక్ష‌య‌పాత్ర‌.. ప‌దేండ్ల‌లో ప‌దికోట్ల మందికి ఉచిత భోజ‌నం

  • న‌గ‌రంలో 32 చోట్ల ఉచిత భోజ‌నం
  • దేశంలోనే అతిపెద్ద ప‌థ‌కంగా రికార్డు 

హైద‌రాబాద్‌:  ద‌వాఖాన‌ల్లో మెరుగైన వైద్యం, కోచింగ్‌, కూలీ ప‌నులు, వివిధ అధికారుల‌ను క‌లిసేందుకు ఇలా.. హైద‌రాబాద్‌కు సుదూర ప్రాంతాల‌నుంచి ఎంతో మంది వ‌స్తుంటారు. వారివ‌ద్ద ఉన్న కొద్దిపాటి డ‌బ్బుల‌ను బ‌స్సుచార్జీల‌కే చెల్లిస్తుంటారు. ఈ మ‌హాన‌గ‌రంలో పొట్ట‌నింపుకోవాలంటే క‌నీసం రెండు వంద‌ల రూపాయ‌లు ఉండాల్సిందే. దీంతో చాలామంది నిరుపేద‌లు ఆక‌లితోనే వెనుదిరిగిపోయేవారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన సీఎం కేసీఆర్ వివిధ ప‌నుల నిమిత్తం ప‌ట్నం వ‌చ్చిన ఎవ్వ‌రుకూడా ఆక‌లితో ఉండ‌కూడ‌ద‌ని సంక‌ల్పించారు. అన్న‌పూర్ణ భోజ‌న కేంద్రాల‌ను ఏర్పాటు చేసి, కేవ‌లం 5 రూపాయ‌ల‌కే మంచి భోజ‌నాన్ని అందించే ఏర్పాటు చేసి, అభాగ్యుల క‌డుపు నింపుతున్నారు. న‌గ‌రానికి వ‌చ్చే అతిథుల‌ను క‌డుపులో పెట్టిచేసుకొంటున్నారు.

పేద‌ల‌పాలిట అక్ష‌య పాత్ర 

అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట ‘అక్షయపాత్ర’గా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 సంవత్సరం నుంచి అమలవుతున్న ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10 కోట్ల 52 లక్షల మందికి పైగా భోజనం అందించి దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా నిలిచింది.. ఇందుకోసం ప్రభుత్వం రూ. 210 కోట్లు ఖర్చు చేసింది. హైదరాబాద్‌ నగరానికి పనులు, వివిధ వృత్తులు చేసుకునేందుకు వచ్చిన వారే కాకుండా విద్యార్థులు, నిరుద్యోగులకు అన్నపూర్ణ పథకం వారి దైనందిన జీవితంలో భాగమైంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌ వ్యాప్తంగా 32 అన్నపూర్ణ క్యాంటీన్లలో సిట్టింగ్‌ ఏర్పాటు చేసి ప్రైవేట్‌ భోజనశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్నపూర్ణ కేంద్రాలను మలిచారు. సకల సదుపాయాలు కల్పిస్తూ ఆకలి తీర్చడమే కాకుండా సంతృప్తిగా భోజనం చేశామన్న అనుభూతిని కల్పించేలా చర్యలు చేపట్టారు.

గ్రేటర్‌లో అమలు చేస్తున్న రూ. 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకం నగరంలో నిరుపేదల ఆకలిని తీర్చుతున్నది. హరే కృష్ణ మూవ్‌మెంట్‌తో కలిసి 1 మార్చి, 2014న 8 కేంద్రాలతో ప్రారంభమైన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించిన 259 కేంద్రాలకు పెంచింది. ప్రతి కేంద్రం ద్వారా రోజుకు 300 భోజనాలు అందించాలని లక్ష్యంగా ఒక రోజుకు మొత్తం 45 వేల భోజనాలు అందిస్తున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి కుటుంబ సభ్యులకు టిఫిన్‌, భోజన వసతి కోసం వ్యయ ప్రయాసలు ఇబ్బంది కలగకుండా వారికి సీఎం కేసీఆర్‌ టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులకు గాను 17 ఆసుపత్రుల్లో రూ. 5లకే భోజనం అందిస్తున్నది.