- అందరికీ ఆరోగ్యంలో తెలంగాణే ఆదర్శం..
- నీతిఆయోగ్ ఆరోగ్యసూచీలో 3వ స్థానం
- కొవిడ్ సమయంలోనూ మెరుగైన సేవలు
న్యూఢిల్లీ, మే 28: సామాన్యుడికి కావాల్సింది విద్య, వైద్యం. ఈ రెండింటినీ తెలంగాణ సర్కారు ప్రాధాన్య అంశాలుగా గుర్తించింది. అటు నాణ్యమైన విద్య.. ఇటు మెరుగైన వైద్యంతో నిరుపేదలకు అండగా నిలుస్తున్నది. పీహెచ్‌సీలు, హెల్త్ సబ్ సెంటర్లు, బస్తీ దవాఖానలతో అందరికీ ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటింటికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్‌ను తయారుచేసింది. బీపీ, షుగర్ పేషెంట్లకు ఇంటికి ఉచితంగానే మందులను డోర్‌డెలివరీ కూడా చేస్తున్నది. చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహార లోపాన్ని పారదోలేందుకు అంగన్‌వాడీల ద్వారా పాలు, గుడ్లు, పౌష్టికాహారం అందజేస్తున్నది. తాజాగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కూడా ప్రారంభించింది. టీ డయాగ్నొస్టిక్స్‌తో ప్రభుత్వ దవాఖానల్లోనే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, వరంగల్ ఎంజీఎం దవాఖానల్లో పడకలు పెంచి, అధునాతన వైద్య సదుపాయాలు కల్పించింది. హైదరాబాద్ నగరానికి నాలుగువైపులా మల్టీస్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీతో వైద్యరంగాన్ని బలోపేతం చేసింది. తెలంగాణ ప్రజలందరికీ ఆరోగ్య యోగాన్ని కలిగించింది. ఫలితంగానే తెలంగాణ నీతి ఆయోగ్ జాతీయ ఆరోగ్య సూచీలో 3వస్థానంలో నిలిచింది.
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ భేష్
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ సేవలు అందిస్తున్నదని మరోసారి నిరూపితమైంది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ ఆరోగ్య సూచీలో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలవడమే దీనికి తార్కాణం. దేశవ్యాప్తంగా 2020-21 సంవత్సరానికిగానూ నీతిఆయోగ్ నిర్వహించిన ఆరోగ్య సూచీ సర్వేలో పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నీతిఆయోగ్, కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెలుగు చూసిన వాస్తవం ఇది. దీంతో సర్కారీ వైద్య సేవలపై రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్నవి పసలేని ఆరోపణలని మరోసారి తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నది. గత ఏడాది ఇంక్రిమెంటల్ పనితీరులో ప్రథమ స్థానంలో, ఈ ఏడాది మొత్తం ఆరోగ్యపరంగా పనితీరులో తృతీయ స్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే ఈ అధ్యయనం పూర్తయినప్పటికీ బీజేపీ పాలిత రాష్ర్టాల పనితీరు అధ్వాన్నంగా ఉండటంతో ఈ నివేదికను నీతిఆయోగ్ బయట పెట్టలేదు. 2022 డిసెంబర్‌లోనే ఈ ఆరోగ్య సూచీ నివేదిక విడుదల కావాల్సి ఉన్నా ఇప్పటికీ విడుదల కాకపోవడం శోచనీయమని ఈ నివేదికను బయటపెట్టిన ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొన్నది. నీతిఆయోగ్ నిర్వహించిన ఈ ఐదో ఆరోగ్య సూచీ అధ్యయనంలో మొత్తం పనితీరు విభాగంలో కేరళ, తమిళనాడు, తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బీహార్(19), ఉత్తరప్రదేశ్(18), మధ్యప్రదేశ్(17) అట్టడుగున నిలిచాయి.
24 అంశాల ఆధారంగా మదింపు
-24 అంశాల ఆధారంగా ఆరోగ్య సూచీలో రాష్ట్రాల పనితీరును మదిం పు చేశారు.
-ప్రధానంగా ఆరోగ్య ఫలితాలు, పాలన, సమాచారం, కీలక అంశాలను బేరీజు వేశారు.
-నవజాత శిశువుల మరణాల రేటు, మొత్తం మరణాల రేటు, పుట్టినప్పుడు లింగ నిష్పత్తి, రోగ నిరోధకత కవరేజ్ తదితర అంశాలనూ పరిశీలించారు.
-24/7 పని చేసే ఆరోగ్య కేంద్రాల నిష్పత్తి, కార్డియాక్ కేర్ సెంటర్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొన్నారు.