mt_logo

ఒక అన్న, ఒక తమ్ముడు

By: విశ్వరూప్

(interesting story that has parallels with state division)

అదో పేద కుటుంబం. ఒకప్పుడు బాగానే బతికినవారు. అయితే చిన్న వయసులో తండ్రి చనిపోవడంతో సంపాదనలేక సంసారం చితికిపోయింది. తల్లే ఎలాగో పిల్లల్ని పెద్ద చేసి పిల్లల పెళ్లిళ్లు కూడా చేసింది. కూతుర్లు అత్తగారింటికి వెళ్లగా మిగిలిన ఇద్దరు కొడుకులూ ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. అన్న ఏ పని చేసేవాడు కాదు. బలాదూరు తిరిగేవాడు. సంపాదన లేకపోయినా ఆయన చేసే పెత్తనాల వల్ల ఊర్లో మంచి పలుకుబడే ఉండేది. తమ్ముడు చిన్న నౌకరీ మీదే కుటుంబం గడిచేది. సంపాదించేది తమ్ముడయినా పెద్దవాళ్లు కాబట్టి ఇంట్లో అన్నా, వదినల పెత్తనమే సాగేది. ఇంటెడు చాకిరీ చేసే తమ్ముడు భార్యకు కడుపునిండా తిండి కూడా దొరికేది కాదు. తమ్ముడు పెళ్లయినప్పుడు తమ్ముడి భార్యకు ఆమె పుట్టింటి వారు ఒక ఆవు దూడనిచ్చారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆవు పెద్దదయి బాగా పాలివ్వసాగింది.

అయితే పాలన్నీ అన్న పిల్లలే తాగేవారు. తమ్ముడి పిల్లలకు పాలూ, పెరుగు దొరికేవికావు. ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు ఉండేది. ఆ పళ్లని కూడా అన్న పిల్లలే ఆరగించేవారు. ఇలా సంపాదిస్తున్నా ఆహారం దొరకక క్రమంగా తమ్ముడు, తమ్ముడి భార్యా, పిల్లలూ బక్కచిక్కసాగారు. దాంతో వీరికన్నా బలంగా తయారైన అన్న పిల్లలు దౌర్జన్యం చేసేవారు, తమ్ముడి పిల్లలను గేలి చేసేవారు. కొన్నాళ్లకు ఒళ్లు మండిన తమ్ముడి భార్య భర్తతో మనం దోపిడికి గురవుతున్నాం. ఉమ్మడి కుటుంబంలో మనకు ఇబ్బందిగా ఉంది. విడిపోవడం తప్ప ఇంకో మార్గం లేదని తెగేసి చెప్పింది. భర్త ధైర్యం చేయకపోవడంతో తనే ఊర్లో పెద్దమనుషుల పంచాయితీ పెట్టించి ‘నా భర్త పనిచేసి సంపాదిస్తున్నా మాకు సరిగా తిండి కూడా దొరక అందుకే విడిగా ఉండాలనుకుంటున్నామ’ని మొరపెట్టుకుంది.

అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండా చక్కగా కూర్చుని తింటున్న అన్న కుటుంబానికి ఈ పరిణామంతో గట్టి షాక్ తగిలింది. ‘అమ్మో…విడిపోతే రేపటి నుంచి నేను ఏం చేసి ఈ కుటుంబాన్ని పోషించాలి?’ అని అన్న భయపడ్డాడు. ‘ఉన్నపళంగా విడిపోతే ఇంటిపని, వంటపని నేనే చేసుకోవాలి, ఎలా?’ అని అన్న భార్యా అనుకుంది. ‘ఇప్పుడు చక్కగా ఆవుపాలు తాగుతున్నాం. గడ్డ పెరుగు తింటున్నాం. చిన్నాన్న వాళ్లు విడిగా ఉంటే ఇవేవీ మనకు దక్కవు’ అని పిల్లలూ దిగులు పడ్డారు. అంతాకలిసి ఉమ్మడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలని నిర్ణయానికి వచ్చి అన్న, వదినలు తమ కుటుంబం విడిపోవడానికి వీల్లేదంటూ పెద్దమనుషుల దగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలైంది.

‘అదేంటీ…విడిపోవడానికి వీల్లేదంటూ శాసించే హక్కు మీకెక్కడిది? సంపాదన మాది, కూర్చుని తింటున్నది మీరు. నష్టం, మాకు లాభం మీది. నష్టాలతో కష్టాల్లో ఉన్న మేము నిర్ణయించుకోవాలి కలిసుండాలా? విడిపోవాలా? అని. ఆ హక్కు మాది. మీరెవరు వద్దనడానికి?మేం విడిపోతామని గట్టిగా పట్టుబడుతుంటే ఉన్న ఆస్తిపాస్తులను ఎలా పంచుకోవాలనే విషయంపై పంచాయితీ పెట్టించాలి గాని విడిపోవడానికి వీల్లేదని పంచాయితీ పెట్టడంలో అర్థంలేదు’ అంటూ తమ్ముడు నెత్తి, నోరూ బాదుకున్నాడు. ‘మనం ఒక తల్లి బిడ్డలం. ముందునుంచీ కలిసే ఉన్నాం. ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇదంతా ఆ పక్కింటి ఎల్లయ్యగాడి కుట్రకాకపోతే విడిపోవాలనే పాడుబుద్ధి నీకెలా వస్తుంది?’ అంటూ అన్న ఎదురు ప్రశ్న వేశాడు. ‘చూడు తిండిలేక నా డొక్క ఎట్లా ఎండిపోయిందో? ఇన్నాళ్లూ నా సంపాదన దోచుకున్నారు. ఇకమీదట మీతో కలిసుండడం మాకు సాధ్యం కాదు’ కాదంటూ కడుపు మాడిన తమ్ముడు మండిపడ్డాడు. ‘అమ్మో..అమ్మో…నీ సంపాదన మేం దోచుకున్నామా? మమ్మల్ని దొంగలంటావా? ఇట్లాగయితే మిమ్మల్ని అసలు విడిపోనివ్వం’ అంటూ అన్న భార్య హుంకరించింది. ‘నీ డొక్క ఎండిపోతే దానికి మేమా బాధ్యులం? నీ సమస్యకు మమ్మల్ని కారణం చూపుతావా?’ అంటూ అన్న లాజిక్ లేవనెత్తాడు. ‘నా సమస్యకు నువ్వు కారణం అనడంలేదు. అసలు నా సమస్యే నువ్వు అంటున్నా. అందుకే నీతో కలిసుండే ప్రసక్తే వద్దంటున్నాను’ గొణిగాడు తమ్ముడు. ‘మిమ్మల్ని దోచుకుతింటున్నామని అందరిముందూ మమ్మల్ని దొంగల్లా చిత్రించారు. మీ సంపాదనంతా మేమే హరించినట్టు లెక్కలు, పద్దులతో సహా నిరూపించండి. అప్పుడు ఒప్పుకుంటాం విడిపోవడానికి’ అన్న భార్య సవాలు విసిరింది. ఆ కటుంబం ఖర్చులు, లెక్కలు అన్నీ అన్నే చూసుకునేవాడు. అవన్ని ముందునుంచి తెలివిగా తనకనుకూలంగానే రాసుకున్నాడు. అయినా తమ్ముడు తనకు జరిగిన నష్టాన్ని లెక్కలతో సహా వివరించాడు. అవి అధికారిక లెక్కలు కావని అన్నా, వదిన కొట్టిపారేశారు. విడిపోవాలనే కుట్రతో దొంగ లెక్కలు చూపిస్తున్నారని తమ్ముడి మీదే అపవాదు వేశారు.

కలిసుండాలనే కోరిక, గౌరవం నాకూ ఉండాలి కదా. కలిసుంటే మేం బతికే అవకాశంలేదు మొర్రో, మేము, మా పిల్లలు బతకడానికైనా విడిపోక తప్పదని మొత్తుకుంటుంటే నువ్వెందుకు మమ్మల్ని మీతో బలవంతంగా కలిపి ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నావ్? నీ లాభం కోసమే కదా…నువ్వు ఈ పట్టుమీదున్నావ్? ఉమ్మడి, సమష్ఠి భావన మీద ఇద్దరికీ గౌరవం ఉండాలి. ఒకరి గౌరవం ఇంకొకరికి లాభం అయినప్పుడు నా భద్రత నాకూ ముఖ్యమే. నా హక్కును నేను పొందడానికి లెక్కలెన్దుకు? లేని నీ హక్కు కోసం నువ్వెట్లా పంచాయితీ పెడతావు?’ అంటూ తమ్ముడూ గట్టిగానే వాదించాడు. ‘నీ సంపాదన, మీకున్న ఆవును చూసుకునే కదా… విడిపోదామనే పన్నాగాలు పన్నుతున్నారు. ఇన్నాళ్లూ మన ఉమ్మడి పెరట్లో గడ్డిమేసే ఆవు బలిసింది. కాబట్టి అది ఉమ్మడి ఆస్తి. ఇప్పుడు దాన్ని నువ్వొకడివే పట్టుకుపోతానంటే ఎట్లా?’ అన్న తెలివి ప్రదిర్శంచాడు. ‘ఎంత విడ్డూరం? అది మా పుట్టింటివారు నాకిచ్చిన అరణం. ఇన్నాళ్లూ మీరే దాని పాడి అనుభవించారు. విడిపోతున్నప్పుడు నా ఆస్తి నాకు దక్కాలనుకోవడం కూడా తప్పేనా?’ తమ్ముడి భార్య ఆవేదన చెందింది. ఊళ్లో పెద్దమనుషుల దగ్గర అన్నకు మంచి పలుకుబడి ఉంది. దాంతో ఇరు వాదనలు విన్నా..న్యాయం ఎవరి పక్షాన ఉందో తెలిసినా పెద్ద మనుషులు ఏ తీర్పూ ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఆ కుటుంబ సమస్యను సాగదీస్తూనే ఉన్నారు. తమ్ముడి కుటుంబం కడుపు మండినప్పుడల్లా పంచాయితీ నడుస్తుంది గానీ ఒడుస్తలేదు, తెగుత లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *