mt_logo

కాంగ్రెస్ ముసుగులో తెలంగాణపై కన్నేసిన ఆంధ్రా ఆధిపత్య శక్తులు

తెలుగుదేశం పార్టీని తెలంగాణ ఎన్నికల బరి నుండి చంద్రబాబు ఎందుకు తప్పించాడు? పాలేరులో పోటీ చేస్తా, తెలంగాణలో అధికారం నాదే అని బీరాలు పలికిన షర్మిల ఎందుకు మొఖం చాటేసింది? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పిలిచి విలీనం పేరిట చర్చలు చేసి గాలికి వదిలేసినా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకు కాడి కింద పడేసింది? రేవంత్ వెనకున్నది ఎవరు? కాంగ్రెస్‌ను నడిపిస్తున్నది ఎవరు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ ప్రజల మదిలో తిరుగుతున్నాయి.

2018లో కాంగ్రెస్ పొత్తుతో తెలంగాణ మీద దండయాత్ర చేయాలనుకున్న చంద్రబాబు ఆశలు ఫలించలేదు. తన శిష్యుడు రేవంత్‌కు కాంగ్రెస్ పగ్గాలు దక్కేలా చేసి పరోక్షంగా తెలంగాణ మీద అధికారం చెలాయించాలని పన్నాగం పన్నాడు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యక్షంగా ఆంధ్రా ఆధిపత్యశక్తులు తెరమీద కనిపించడం మూలంగా 2018 మాదిరే తెలంగాణ ప్రజలు బండకేసికొడతారని భావించి తెలంగాణ రాజకీయాల నుండి తెలుగుదేశం పార్టీని అదృశ్యం చేశాడు.

తెలంగాణ ఏర్పాటు మీద విషం కక్కుతూ పాదయాత్ర చేసి, తెలంగాణ పాకిస్తాన్ తో పోల్చిన వైఎస్ షర్మిల తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ల తర్వాత హఠాత్తుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది. ఒకటి కాదు .. రెండు కాదు ఏకంగా విడతల వారీగా 3400 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద నిరాధార ఆరోపణలు చేసింది. కేసీఆర్‌ని, కేసీఆర్ కుటుంబాన్ని తూలనాడింది. పాలేరులో పాగా వేస్తానంటూ సవాళ్లు విసిరింది. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిని అంటూ తెగ ఊదరగొట్టింది. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ఫలితం ఉండదని ఆలస్యంగా తెలుసుకున్నది. కాంగ్రెస్‌లో విలీనం పేరుతో కతలు జెప్పింది. చివరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు అంటూ కాడి కిందేసింది. పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోను బీరాలు పలకడం తప్ప పోటీ చేసింది లేదు.

చంద్రబాబు అయినా, షర్మిల అయినా, వీరి వెనకున్న శక్తులయినా వారి లక్ష్యం కేసీఆర్. తెలంగాణలో అధికారం. ఆధిపత్యం. రేవంత్ లాంటి శిష్యుడు అధికారంలో ఉంటే వారనుకున్న పనులు చకచకా జరిగిపోతాయి. అందుకే కాంగ్రెస్ ముసుగులో ఈసారి ఎన్నికలను వెనకుండి నడిపిస్తున్నారు. తెలంగాణ సమాజం ఈ కుట్రను గమనించి కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది.

అంతేకాదు గత పదేళ్లలో కేసీఆర్ గారు తెలంగాణలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు అబద్దమా? పారుతున్న నీళ్లు అబద్దమా? పండిన పంటలు అబద్దమా? ఇచ్చిన 72 వేల కోట్ల రూపాయల రైతుబంధు అబద్దమా? లక్ష పైచిలుకు రైతు కుటుంబాలు అందుకున్న రైతుబీమా పరిహారం అబద్దమా? ఇస్తున్న ఆసరా ఫించన్లు అబద్దమా? కళ్యాణలక్ష్మి అబద్దమా? కేసీఆర్ కిట్లు అబద్దమా? పోషకాహార కిట్లు అబద్దమా?

సంక్షేమ గురుకుల పాఠశాలలు అబద్దమా? పెట్టిన జిల్లాకో మెడికల్ కళాశాలలు అబద్దమా? బాగుపడ్డ సర్కారు దవాఖానాలు అబద్దమా? మొత్తంగా మారిన తెలంగాణ అబద్దమా? ఇవి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, చర్చించాలి, కాపాడుకోవాలి.