నేడు ఎన్నికల్లో టిక్కెట్లు నమ్ముకున్నోళ్ళు రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బెల్లంపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. చాలా చైతన్యవంతంగా ఉంటూ ఉద్యమాలు జరిగిన ప్రాంతం బెల్లంపల్లి అని వెల్లడించారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాలు చాలా అభివృద్ధి దిశలో వెళుతున్నాయి. ఆనాడు సిటీ కాలేజ్ దగ్గర ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ ఉద్యమం జరుగుతుంటే 7గురు విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టపగలు కాల్చేసిందని భాద పడ్డారు. తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బలవంతంగా ఆంధ్రాతో కలిపిందని వివరించారు.
డిపెండెంట్ ఉద్యోగాలు ఊడపీకించారు
ఇల్లందు తర్వాత ప్రారంభించబడ్డ రెండవ గని బెల్లంపల్లి సింగరేణి అని తెలిపారు. నిజాం రాజు పెట్టిన 134 ఏండ్ల మన స్వంత కంపెనీ సింగరేణిని ముంచిందీ కాంగ్రెస్ పార్టీయే. వందశాతమున్న సింగరేణిని నాటి కాంగ్రెస్ దద్దమ్మలు కేంద్రం వద్ద అప్పులు తెచ్చి కట్టలేక వాళ్లకు 49 శాతం వాటా ఇచ్చారు. మన వాటా కోల్పోయామని ధ్వజమెత్తారు. నాడు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల యూనియన్లే సంతకాలు పెట్టి డిపెండెంట్ ఉద్యోగాలను కూడా ఊడపీకించారని మంది పడ్డారు.
చెల్లని రూపాయి బెల్లంపల్లిలో చెల్లుతుందా?
బెల్లంపల్లిలో 100 పడకల హాస్పిటల్ పెట్టుకున్నమని గుర్తు చేసారు. ఇంకా వసతులను పెంచుకుంటం అని హామీ ఇచ్చారు. అందరి కోసం పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అద్భుతమైన విద్య అందడం ద్వారా పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతున్నదని పేర్కొన్నారు. ఇయ్యాల తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందంటే.. మనం నిబద్ధతతో పనిచేయడం వల్లనే సాధ్యమైందని స్పష్టం చేసారు. చెన్నూరులో చెల్లని రూపాయి బెల్లంపల్లిలో చెల్లుతుందా?. ఇక్కడ కూడా చెల్లదని బెల్లంపల్లి ప్రజలు రుజువుచేయాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీవోళ్లకు సెల్ఫ్ ఉండదు.
తెలంగాణ ప్రజలే మాకు బాసులు
ఢిల్లీల కట్క ఏస్తనే ఇక్కడ లైట్ వెలుగుతదని ఎద్దేవా చేసారు. తెలంగాణ ప్రజలే మాకు బాసులు. ఇంకెవ్వరూ లేరని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తం అన్నారు. ఇవ్వాల ఎన్నికల్లో టిక్కెట్లు నమ్ముకున్నోళ్లకు అప్పగిస్తే రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా? అని ప్రశ్నించారు. చిన్నయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తే..బెల్లంపల్లికి ఇంజనీరింగ్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.పెద్ద ఎత్తున మీటింగ్‌కు తరలివచ్చిన మీరందరూ బీఆర్ఎస్ పార్టీని బలపరిచి, కారు గుర్తుకు ఓటేయాలని సీఎం కోరారు.