mt_logo

ప‌చ్చ‌ని పందిళ్లు.. తీరొక్క అందాలు.. క‌నువిందు చేసేలా ఔట‌ర్ ప్ర‌యాణం

 -ఆకట్టుకునేలా ఇంటర్‌చేంజ్‌లు..

-అబ్బురపరిచేలా ఓవర్‌ పాస్‌లు

విశ్వ‌న‌గ‌రంగా రూపుదిద్దుకొంటున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్‌పై తెలంగాణ స‌ర్కారు ప్ర‌త్యేక దృష్టిపెట్టింది. ప్ర‌యాణం ఆహ్లాదంగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ది. ఫ్లైఓవ‌ర్లు.. అండ‌ర్‌పాస్‌లు.. ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు నిర్మించ‌డంతోపాటు ఓఆర్ఆర్‌పై న‌గ‌ర‌వాసులతోపాటు మ‌హాన‌గ‌రానికి వ‌చ్చేవారి ప్ర‌యాణం ఓ మ‌ధురానుభూతిని పంచేలా స‌రికొత్త అందాల‌ను అద్దుతున్న‌ది. మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్‌పై ప్రయాణం ప్రతి ఒక్కరినీ కనువిందు చేస్తున్నది. వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు తీరొక్క అందాలతో ఔటర్‌ వినూత్నంగా స్వాగతం పలుకుతున్నది. ఒక్కో ఇంటర్‌చేంజ్‌ వద్ద ఒక్కో ఆకృతితో అపూర్వ స్వాగతం పలికేలా ఔటర్‌పై బ్యూటిఫికేషన్‌ పనులను హెచ్‌ఎండీఏ హెచ్‌జీసీఎల్‌ విభాగం అద్భుతంగా చేస్తున్నది. నార్సింగి పాయింట్‌ (ఓవర్‌ పాస్‌) వద్ద కాకతీయ కళాతోరణం, గచ్చిబౌలి వద్ద చేయి ఆకారం.. తాజాగా పుప్పాలగూడ-నార్సింగి రోడ్‌లో మీడియన్‌లో ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతులు ప్రయాణికులు, స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. అటుగా వెళ్లే చాలా మంది వీటి వద్ద నిల్చుని సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.

పుప్పాల‌గూడ‌-నార్సింగి రోడ్‌కు కొత్తందం

తాజాగా పుప్పాలగూడ-నార్సింగి రోడ్‌లో మీడియన్‌లో ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతులు ప్రయాణికులు, స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. ఆయా స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వీటిని ఏర్పాటు చేయగా.. అటు వెళ్లే చాలా మంది వీటి వద్ద నిల్చుని సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. రాజధాని మణిహారమైన ఔటర్‌ కేంద్రంగా నాగ్‌పూర్ (ఎన్‌హెచ్‌ 44), బెంగళూరు (ఎన్‌హెచ్‌ 44), ముంబై (ఎన్‌హెచ్‌ 65), విజయవాడ (ఎన్‌హెచ్‌ 65) రహదారుల నుంచి నగరంలోకి చేరుకునే ప్రయాణికులకు అపూర్వ స్వాగతం పలికేలా ఔటర్‌లో బ్యూటిఫికేషన్‌ పనులు చేపడుతున్నారు. ఎక్కడ ఖాళీ ప్రాంతం కన్పించకుండా ల్యాండ్‌స్కేపింగ్‌ పనులు, ప్రత్యేక ఆకర్షణతో ఏర్పాటు చేస్తున్న శిల్పాలు, ఆకృతులు కనువిందు చేస్తున్నాయి.