ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు.. నోటిఫికేషన్ ఇంకా రానే లేదు.. అయినా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ పార్టీ గెలుపు గుర్రాల జాబితాను ప్రకటించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలుంటే ఏకంగా 115 నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించి రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరిచారు. సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వరని, వారంతా తమ పార్టీలో చేరతారని ఆశలు పెట్టుకొన్న ఢిల్లీ పార్టీల నోట్లో కేసీఆర్ మట్టికొట్టారు. బీఆర్ఎస్ అసమ్మతులు తమ పార్టీకి క్యూ కడతారని భావించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఢిల్లీ పెద్దలైన మల్లికార్జున ఖర్గే, అమిత్ షాతో సభకు ప్లాన్ చేశారు. తీరా చూస్తే బీఆర్ఎస్‌నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాలేదు. సీఎ కేసీఆర్ బాటలోనే నడుస్తామని, అధినేత ప్రకటించిన అభ్యర్థులను గెలిపించుకొంటామని ఇప్పటికే రంగంలోకి దిగారు. దీంతో తెలంగాణ గల్లీల్లో ఢిల్లీ పార్టీలు పరేషాన్ అయ్యాయి. ఢిల్లీ పెద్దల సభలు జనం లేక వెలవెలబోయాయి.
ఢిల్లీ లీడర్లు.. పనికిరాని మాటలు!
తమ పార్టీల్లో భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఊదరగొట్టారు. ఢిల్లీలో గొప్పలు చెప్పి కాంగ్రెస్ నాయకులు ఖర్గేను, బీజేపీ నాయకులు అమిత్ షాను తెలంగాణలో సభలకు రప్పించారు. తీరాచూస్తే ఆ పార్టీల్లో ఏ ఒక్కరూ చేరలేదు కదా.. అటువైపు జనం కూడా కన్నెత్తి చూడలేదు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాటకాన్ని ఇక్కడి దళితులెవరూ నమ్మలేదు. ఇక రైతు గోస పేరుతో ఖమ్మంలో నిర్వహించిన అమిత్ షా సభ అట్లర్ ఫ్లాప్ అయ్యింది. తెలంగాణుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి ఏమైనా ప్రత్యేక హామీలు ప్రకటిస్తారని చూసిన జనానికి నిరాశే అయ్యింది. అమిత్ షా సహా ఆపార్టీ నేతలందరూ మజ్లిస్ టార్గెట్‌గా సీఎ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించి, తమవల్ల అయ్యింది ఇదేనని చెప్పకనే చెప్పారు. అమిత్ షా సభతో తెలంగాణ సమాజంలో మరోసారి కాషాయ పార్టీ చులకనైపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఓ వైపు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచార పర్వానికి తెరలేపి, గ్రామాల్లో పర్యటిస్తుండగా.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారు కాని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నైరాశ్యంలో మునిగితేలుతున్నారు.