mt_logo

నిరుపేదకు మ‌హా ఆత్మ‌గౌర‌వ సౌధం.. తెలంగాణ స‌ర్కారు సంక‌ల్పానికి నిద‌ర్శ‌నం

 -దేశంలోనే అతిపెద్ద ‘ఆదర్శ టౌన్‌ షిప్‌’గా కొల్లూర్‌

-ఒకేచోట ల‌క్ష మంది ఉండేలా 15,660 ఇండ్ల నిర్మాణం

హైద‌రాబాద్‌: పేదొడికి సొంతిల్లు ఓ క‌ల‌. ఈ కాలంలో ఆ క‌ల‌ను నెర‌వేర్చుకోవాలంటే ఎంతో క‌ష్ట‌ప‌డాలి. ఐదువేళ్లు నోట్లోకి పోయేందుకే రెక్క‌లు ముక్క‌లు చేసుకొంటున్న నిరుపేద‌ల‌కు ఆ క‌ల క‌ల‌గానే మిగిలిపోతుంద‌నే బాధ‌ను తెలంగాణ స‌ర్కారు దూరం చేసింది. డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల‌ను నిర్మించి, వారి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుతున్న‌ది. రాష్ట్రంలో కండ్ల ముందు పేదోడి కలల సౌధాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఇందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌న‌మే ఆదర్శ టౌన్‌షిప్‌. సుమారుగా లక్ష జనాభా నివ‌సించేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్లను నిర్మించిన తెలంగాణ స‌ర్కారు త‌న సంక‌ల్పాన్ని నిల‌బెట్టుకొన్న‌ది. 

పేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూర్‌ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది. నాణ్య‌త‌లో ఎక్క‌డా కాంప్రమైజ్‌ కాకుండా కార్పొరేట్‌ హంగులతో పేదల కోసం కలల సౌధాల నిర్మాణం చేపట్టింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌ గ్రామంలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆదర్శ టౌన్‌షిప్‌ను గురువారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. కొల్లూర్‌ గ్రామంలో 145 ఎకరాల విస్తీర్ణంలో రూ.1432.5కోట్ల వ్యయంతో పేదల కోసం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది.

ఆద‌ర్శ టౌన్‌షిప్ ప్ర‌త్యేక‌త‌లు

-ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 117 బ్లాక్‌లు, అందులో జీ+9లో 38, జీ+10లో 24, జీ+11లో 55బ్లాక్‌లుగా నిర్మాణాలు చేపట్టారు. 

-ఒక్కో డబుల్‌ బెడ్‌రూం విస్తీర్ణం 580 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఉంటుంది. 

-ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. 

-ప్రతి ఫ్లోర్‌లో ఫైర్‌ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 

-36 మీటర్లు, 30మీటర్ల ఔటర్‌ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్ల ఇన్నర్‌ రోడ్లను వేశారు. 

-12అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ సంప్‌లను నిర్మించారు. ఒక్కో సంపు 11 లక్షల లీటర్ల సామర్థ్యం ఉంటుంది. -90లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంటుని ఏర్పాటు చేశారు. 

-వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. 

-అండర్‌ గ్రౌండ్‌ ద్వారా కరెంట్‌ కేబుల్‌ని ఏర్పాటు చేశారు. 

-మురికినీటి బాక్సులపై 10.55 కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ని ఏర్పాటు చేశారు. 

డబుల్‌ ఇండ్ల విశేషాలు..

-మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణం 145 ఎకరాలు

-మొత్తం 117 బ్లాక్‌లు, 15,660 డబుల్‌ ఇండ్లు

-ఒక్కో ఇంటి విస్తీర్ణం 580 చదరపు అడుగులు

-ఒక్కో ఇంటికి అయిన ఖర్చు రూ.7.60లక్షలు

-నిర్మాణ వ్యయం రూ.1432.5 కోట్లు

-జీ+9, జీ+10, జీ+11 అంతస్తులతో నిర్మాణాలు

-11కేఎల్‌ కెపాసిటీ గల 12 వాటర్‌ సంపులు

-ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌లు, జనరేటర్లు, ప్రతి ఫ్లోర్‌కు ఫైర్‌ సేఫ్టీ

-10.05 కి.మీ తాగునీటి పైప్‌లైన్‌

-10.60 కి.మీ అండర్‌ గ్రౌండ్‌ పైప్‌లైన్‌

-137 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

-వీధి దీపాల కోసం 500 పోల్స్‌.. ఐమాస్ట్‌ లైట్ల కోసం 11 పోల్స్‌

-3 షాపింగ్‌ కాంప్లెక్స్‌లు..118 దుకాణాలు

-33కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ (1), 11 కేవీ(2)

భూమి వినియోగం ఇలా..

-గ్రీనరీ, ఓపెన్‌ ఏరియా 21.77 ఎకరాలు

-ఇతర సౌకర్యాలకు 27.89 ఎకరాలు

-పార్కులు, క్రీడా మైదానాలకు 13.42ఎకరాలు

-పబ్లిక్‌ బిల్డింగ్‌ ఏరియాకు 6.26 ఎకరాలు

-ఓపెన్‌ పార్కింగ్‌ 2.32 ఎకరాలు

-రోడ్లకు 32.56 ఎకరాలు

-నివాస గృహాలకు 19.85 ఎకరాలు

-ప్రాజెక్ట్‌ మెయింటెనెన్స్‌ కోసం 20 ఎకరాలు

15,660 ఇండ్లు ఇలా..

-జీ+9లో 38 భవనాలు 4,527 ఇండ్లు

-జీ+10లో 24 భవనాలు 3,180 ఇండ్లు

-జీ+11లో 55 భవనాలు 7,953 ఇండ్లు