mt_logo

క‌రీంన‌గ‌ర్ పట్టణానికే త‌ల‌మానికంగా కేబుల్ బ్రిడ్జి

-మానేరున‌ది పై 224 కోట్లతో నిర్మాణం

-దేశంలోనే తొలిసారి డైన‌మిక్ లైటింగ్‌

క‌రీంన‌గ‌ర్‌: కేబుల్ బ్రిడ్జి అంటే మ‌న‌కు హైద‌రాబాద్‌లోని దుర్గం చెరువు గుర్తొస్తుంది.. కానీ ఇక‌నుంచి ఆ లిస్టులో క‌రీంన‌గ‌ర్ కేబుల్ బ్రిడ్జికూడా చేరిపోయింది. రూ. 224 కోట్ల‌తో నిర్మించిన ఈ బ్రిడ్జి ద్వితీయ శ్రేణి న‌గ‌రాల అభివృద్ధిపై తెలంగాణ సర్కారుకు ఉన్న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నంలా నిలుస్తున్న‌ది. మ‌హాన‌గ‌రంతోపాటు ఇతర సిటీల్లోనూ రాష్ట్ర స‌ర్కారు ప‌ర్యాట‌కానికి పెద్ద‌పీట వేస్తున్న విష‌యం అర్థ‌మ‌వుతున్న‌ది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్‌ లైటింగ్‌ తదితర హంగులతో ఇప్ప‌టికే అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్‌ సిగలో ఈ కేబుల్ బ్రిడ్జి మణిహారంగా చేరుతున్నది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ తీగల వంతెనను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిపై దేశంలోనే తొలిసారిగా డైనమిక్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్‌ బ్రిడ్జి ఇది. మానేరు నదిపై కరీంనగర్‌ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్‌ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు.

బ్రిడ్జి ప్ర‌త్యేక‌త‌లు

-నాలుగు వరుసలతో 500 మీటర్ల పొడవున నిర్మించిన బ్రిడ్జికి అవసరమైన కేబుల్‌ను ఇటలీ నుంచి తీసుకొచ్చారు. 

-పాదచారుల కోసం రెండువైపులా కలిపి 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ నిర్మించారు. 

-ఈ బ్రిడ్జిపై నుంచి చూస్తే.. ఒకవైపు మధ్యమానేరు జలాశయంతోపాటు రూ.410 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్‌ఫ్రంట్‌ వ్యూ మొత్తం కనిపిస్తుంది.