తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న వేళ నేడు “సంక్షేమ సంబురాల దినోత్సవం” రోజున ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర్ రావు గారు మంచిర్యాల జిల్లా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంతో పాటు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మంచిర్యాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు నూతన సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చిరంజీవి శ్రీరాముల హరిత ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని పొందింది. ఈ విషయాన్ని మంచిర్యాల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ అమ్మాయిని పిలిపించుకుని ఘనంగా సన్మానించి ఐఏఎస్ కావాలని దీవించారు. ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హరిత ఉన్నత చదువులకై రూ. 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హరిత తండ్రి శ్రీరాముల వెంకటేష్, తల్లి రాజశ్రీలను అభినందిస్తూ హరితను ఉన్నత చదువులు చదివించాల్సిందిగా కోరారు.