- ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి
- అడ్వాన్స్ 30 లక్షలు
- అలవెన్సులు పెంచుతూ నిర్ణయం
- సోమవారమే 2.73% డీఏ మంజూరు
- వారం తిరగకుండానే భత్యం పెంపుదల
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కారు కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నది. సమైక్య రాష్ట్రంలో అరకొర వేతనాలతో నెట్టుకొచ్చిన ఎంప్లాయిస్‌కు.. కడుపు నిండా జీతాలిస్తూ కన్నబిడ్డల్లా కాచుకొంటున్నది. రాష్ట్ర అభివృద్ధికి ఇరుసుగా పనిచేసే ఉద్యోగులకు తెలంగాణ సర్కారు కష్టానికి ప్రతిఫలం ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత సోమవారమే 2.73శాతం డీఏ మంజూరు చేసిన తెలంగాణ సర్కారు.. తాజాగా వారికి అలవెన్సులు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కారు అని నిరూపించుకున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పెన్ష నర్లకు తెలంగాణ సర్కారు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఇల్లు కట్టుకోవాలను కొనే ఉద్యోగులకు అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ట్రావెలింగ్, ట్రాన్స్‌పోర్ట్ ఇలా అనేక రకాల భత్యాలను భారీగా పెంచింది. ఈ మేరకు ఆర్థి క శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. ఆ వెంటనే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు సంబంధిత జీవోలను విడుదల చేశారు. ఆ జీవోల ప్రకారం.. ఉద్యోగుల ట్రావెలింగ్ అండ్ కన్వేయన్స్ అలవె న్సును 30 శాతానికి చేరింది.బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ 30 శాతం, షెడ్యూల్డ్ ఏరియాలో పని చేసే వారికీ 30 శాతానికి అలవెన్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దీంతో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో పని చేసే వారికి రూ.650 నుంచి రూ.1,280, గ్రామాల్లో రూ.780 నుంచి రూ.1,430, కొండ ప్రాంతాల్లో పనిచేసేవారికి రూ.950 నుంచి రూ.1,660 అలవెన్స్‌గా లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అలవెన్సుల వివరాలిలా..
-సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రోజుకు రూ.150 చెల్లిస్తారు.
-బైక్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్‌ను ప్రభుత్వం రూ.80 వేల నుంచి రూ.లక్షకు పెంచింది.
-అంధులు, మూగ, చెవుడు వంటి దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వెయన్స్ అలవెన్స్‌ను రూ.2,000 నుంచి రూ.3,000కు పెంచింది.
-కారు, బైక్ నిర్వహణ అలవెన్స్‌ను రూ.1,050 నుంచి రూ.1,500కు, సైకిళ్ల నిర్వహణ అలవెన్స్‌ను రూ.300 నుంచి రూ.500కు పెంచింది.
-ఇల్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది.
-బేసిక్ పే రూ.38,890 గల వారికి రూ.20లక్షలు, రూ.62,110 బేసిక్ పే గల వారికి రూ.25 లక్షలు, రూ.62,110కు మించి ఉన్నవారికి రూ.30 లక్షల వరకు, ఆలిండియా సర్వీసెస్ ఆఫీసర్లకు రూ.35 లక్షలు ఇస్తారు.
-కారు కొనటానికి అడ్వాన్స్ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచిం ది. ఇందుకు బేసిక్ పే రూ.54,220కు మించి, బైక్ కొనేవారి బేసిక్ పే రూ. 32,810కి మించి ఉండాలి.
-ఉద్యోగుల పిల్లల పెండ్లిళ్లకు అడ్వాన్స్‌ను గణనీయంగా పెంచింది. నాలుగో తరగతి ఉద్యోగుల కుమారుడి పెండ్లికి రూ.2 లక్షలు, ఇతర ఉద్యోగుల పిల్లల వివాహాలకు రూ.3 లక్షలు మ్యారేజ్ అడ్వాన్స్‌గా ఇస్తారు. కుమార్తె పెండ్లికి నాలుగో తరగతి ఉద్యోగులకు రూ.2.5 లక్షలు, ఇతర ఉద్యోగులకు రూ.4 లక్షల వరకు అడ్వాన్స్‌గా చెల్లిస్తారు.
-స్టేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్‌ను 30 శాతం పెంచింది.
-గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, సీఐడీ, ఆక్టోపస్, యాంటినక్సలైట్ స్వాడ్ విభాగాల్లో పనిచేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేను 2020 పేసేల్ ప్రకారం వర్తింప చేస్తారు.
-పెన్షనర్లు చనిపోతే అందించే తక్షణ సాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచింది.
-ప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తించే అన్ని క్యాటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15 శాతం స్పెషల్ పే మంజూరు చేసింది.