mt_logo

వ్యాక్సినేషన్ లో ఖమ్మం రికార్డ్.. వందశాతం మొదటి డోసు పూర్తి

మొదటి డోస్ టీకా వేయడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొదటి డోస్ టీకాల్లో ఖమ్మం జిల్లా వంద శాతం పూర్తి చేసి రికార్డ్ సృష్టించింది. కాగా..ఇందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగం, సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లా యంత్రాంగం, సిబ్బంది సహసోపేతంగా పనిచేశారని కొనియాడారు. ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో అతి తక్కువ నష్టంతో కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగామని, పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక శాతం మందికి టీకాలు వేసిన జాబితాలో తెలంగాణ టాప్ లో ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రజల వద్దకే టీకాలు తీసుకెళ్లి వేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ఇంటింటికీ తిరగటంతోపాటు, పని ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి ప్రజలను ఒప్పించి టీకాలు వేస్తున్నామన్నారు. టీకాలు వేసుకొనేందుకు ఆసక్తి చూపని వారు, గడువు ముగిసినా రెండో డోస్‌ వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలని మంత్రి పువ్వాడ వైద్యాధికారులకు ఈ సందర్భంగా సూచించారు. అనంతరం కేక్ కట్ చేసిన మంత్రి.. పలువురు సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, DM&HO మాలతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *