తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న… కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్ల క్రితం ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం, ఇప్పటివరకు 10 లక్షల కుటుంబాలకు ఆసరాగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది కల్యాణలక్ష్మి పథకం. పేదింటి ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని భావించిన కేసీఆర్.. కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ అనే విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. 2014 అక్టోబర్ 2 నుంచి ప్రారంభమైన ఆ పథకం.. సీఎం కేసీఆర్ ఆశయాన్ని సాకారం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. తొలుత ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతుల వివాహానికి 51,000 వేల ఆర్థిక సాయాన్ని అందజేయగా, అటు తర్వాత దానిని బీసీలకు సైతం వర్తింపజేశారు. మూడేండ్ల తర్వాత 2017లో పథకం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని 51,000 నుంచి 75,116కు పెంచారు. ఆ తర్వాత మార్చి 19 తేదీ 2018 నుంచి ఆ మొత్తాన్ని 1,00116 లకు పెంచి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 10,56,239 మంది ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో అండగా నిలుస్తున్నాయి. ఈ పథకం కింద ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి లబ్ధి పొందిన వారుండటం విశేషం. అదేవిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఆడబిడ్డల్లో అత్యధికశాతం మంది అటు తర్వాత కేసీఆర్ కిట్లను అందుకుంటుండటం మరో విశేషం. రాష్ట్రంలో ప్రతి పేదింటి కుటుంబం తన బిడ్డ పెండ్లికి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది.
9,800 కోట్లు :
కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధిపొందిన వారిలో అత్యధికులు బీసీలే. పథకాన్ని ప్రారంభించిన మూడేండ్ల అనంతరం ఈబీసీలకు సైతం వర్తింపజేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు పథకానికి 6,38,358 మంది దరఖాస్తు చేసుకోగా, 4,85,135 మందికి మంజూరు చేశారు. ఇప్పటివరకున్న 10,56,239 లబ్ధిదారుల్లో బీసీలే 37.10శాతం కావడం విశేషం. ఇక మొదటి మూడేండ్లను మినహాయించినప్పుడు మొత్తంగా వచ్చిన దరఖాస్తులు 8,62,349 కాగా, అందులో లబ్ధి పొందిన బీసీలు 4,85,135 మంది. మొత్తంగా పథకం ద్వారా బీసీలే 56.25శాతానికి పైగా లబ్ధిపొందారు. ఈ పథకానికి ఇప్పటివరకు ప్రభుత్వం రూ.9,803.97 కోట్ల బడ్జెట్ కేటాయించగా, అందులో రూ.8420.89 కోట్లు (85.89శాతం) ఇప్పటికే ఖర్చుచేసిందంటే కల్యాణలక్ష్మి పథకం ఎంత ప్రతిష్ఠాత్మకంగా అమలవుతున్నదో అర్థం చేసుకోవచ్చు.