mt_logo

తెలంగాణ‌లో పోడుకు ప‌ట్టాభిషేకం.. లక్షా 50 వేల మంది గిరిజ‌నుల‌కు కేసీఆర్‌ వ‌రం

  • 4,05,601 ఎకరాల పంపిణీకి రెడీ
  • పాలిగన్‌ టెక్నాలజీతో ప‌క‌డ్బందీగా పట్టాలు
  • వచ్చే నెల 24 నుంచి ప‌ట్టాల పంపిణీ

హైదరాబాద్‌:  పోడు భూముల‌కు ప‌ట్టాలు.. గిరిజ‌నులు.. ఆదివాసీల క‌ల‌.. వీటికోసం అడ‌వి బిడ్డ‌లు ఎన్నో పోరాటాలు చేశారు. త‌మ ర‌క్తాన్ని చిందించారు. స‌మైక్య పాల‌న‌లో అభివృద్ధి ఆమ‌డ‌దూరంగా ఉన్న ఈ అడవిబిడ్డ‌ల ఆక్రంద‌న‌ల‌ను వినే నాథుడే క‌రువు. కానీ స‌మైక్య రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గిరి బిడ్డ‌ల‌కు ప‌ట్టంగ‌ట్టారు. 500 జ‌నాభా ఉన్న తండాల‌న్నింటినీ గ్రామ పంచాయ‌తీలుగా మార్చేసి, వారికే పాల‌నాధికారం అప్ప‌గించారు. గిరిజ‌న రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు. ఆదివాసీ, గిరిజ‌న బిడ్డ‌ల‌కోసం గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్య‌మైన విద్య‌నందించారు. ఫ‌లితంగా ఐఐటీ, నీట్‌లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో అడ‌వి బిడ్డ‌లు స‌త్తాచాటారు. గిరిజ‌న బిడ్డ‌ల‌కు విదేశీ విద్య‌కూ స‌హ‌కారం అందించారు. గిరిజ‌నులు సొంతంగా వ్యాపారం చేసుకొనేందుకు లోన్లు ఇచ్చి, వారిని పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అడ‌విబిడ్డ‌ల ద‌శాబ్దాల క‌లను సీఎం కేసీఆర్ నెర‌వేర్చ‌బోతున్నారు. తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా పోడు భూముల‌కు ప‌ట్టాలు అంద‌జేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అటవీ, గిరిజన, రెవెన్యూ శాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది. ‘పోడు’భూముల పంపిణీ ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాల యం ప్రారంభోత్సం అనంతరం తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్‌ రైట్‌ కమిటీలు క్షేత్రస్థాయిలో నెలలపాటు కసరత్తు చేశారు. 12,49,296 ఎకరాలకు 4,14,353 క్లెయిమ్స్‌ను ఫారెస్ట్‌ కమిటీలు వివిధస్థాయిలో పరిశీలించాయి. 4,01,601 ఎకరాలకు సం బంధించి 1,50,123 మంది లబ్ధిదారులు పోడు పట్టాలకు అర్హత సాధించనున్నారు. ఇప్పటికే పట్టాల పంపిణీపై గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సంతకంతోపాటు లబ్ధిదారుడి ఫొటో ఉండేలా పట్టాదారు పాస్‌బుక్‌లు సిద్ధమయ్యాయి. 

ఒక్క ఇంచుకూడా అన్యాక్రాంతం కాకుండా..

‘భవిష్యత్తులో అటవీ భూమి ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకూడదు. పోడుభూముల పట్టాల పంపిణీ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకొంటు న్నాం. అటవీ భూమిని ఆక్రమిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాలు పోవాలి’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్న నేపథ్యం లో ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నది. ఒకసారి పంపిణీ తర్వాత అటవీ భూమి ఒక ఇంచు కూడా అన్యాక్రాంతం కాకుండా ఉండేదుకు పాలిగన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. భూమి సర్వే నంబర్‌, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ ఆకాంక్ష, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూమి హద్దులు ఏవి? వంటి అంశాలను గూగుల్‌ మ్యాపింగ్‌ వివరాలతోపాటు హోలోగ్రామ్‌ను పోడుపట్టాలో పొందుపరచనున్నారు. పంపిణీ చేసిన తర్వాత భవిష్యత్తులో ఇరుగుపొరుగు వారితో భూ హద్దు వివాదాలు తలెత్తకుండా ఉండటం, సదరు లబ్ధిదారుడి భూమి పక్కనే అటవీ భూమి ఉంటే కాలక్రమేణా సదరు భూమిని లబ్ధిదారుడు ఆక్రమించుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పాలిగన్‌ టెక్నాలజీని వినియోగించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పంపిణీ విషయంలో కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.