mt_logo

కేసీఆర్ వెన్నంటే ఉంటాం.. బీఆర్ఎస్‌ పార్టీని బలోపేతం చేస్తాం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెన్నంటే ఉంటామని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి తాము బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని కేసీఆర్‌కు తెలియచేశారు.

పార్టీ నుండి గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరడం తమకు బాధ కలిగించిందని కేసీఆర్ వద్ద పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు.

ఒడిదుడుకులు బీఆర్ఎస్‌కు కొత్త కాదని పేర్కొంటూ.. కొంచెం ఓపిక పడితే మళ్ళీ ప్రజల్లో ఆదరణ లభిస్తుందని, ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్, తాగు నీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతున్నదనే అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారని సమాచారం.

పార్టీలోని అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ తమ కృషిని కొనసాగించాలని కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలోనే పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించే కార్యాచరణకు కేసీఆర్ త్వరలో శ్రీకారం చుట్టనున్నారు

కేసీఆర్‌ని సోమవారం కలిసిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రాంరెడ్డి, భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వర్ రావు, గండ్ర వెంకట రమణా రెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం చక్రపాణి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, పలువురు కౌన్సిలర్లు, తదితరులు ఉన్నారు