తెలంగాణలో మూడెకరాల లోపు రైతులు 95 శాతం మంది ఉన్నరు.. ఒక ఎకరా పారేందుకు గంట సేపు కరెంటు చాలు.. అంటే మూడెకరాలకు మూడు గంటలే చాలు.. 24 గంటల కరెంట్ అవసరం లేదు.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రేలాపనలు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ అన్నదాతల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ప్రారంభించిన 24 గంటల ఉచిత కరెంట్‌ను నిలిపేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించేశారు. ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు.. ఇంతకుముందు అసెంబ్లీలో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని మాట్లాడారు. దీనిపై సీఎం కేసీఆర్ అదే అసెంబ్లీ వేదికగా రేవంత్‌రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. ఆయనకు 24 గంటల కరెంట్ అవసరం లేదట. ఆయనకు వెంటన్ బంద్‌జేస్తం.. తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంట్ ఆపే ప్రసక్తే లేదు అని కేసీఆర్ తేల్చిచెప్పారు. అయినా.. ఇప్పటికీ రేవంత్‌రెడ్డి అదే పాట పాడుతున్నారు. అన్నదాతలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అటు అన్నదాతలతోపాటు సొంత పార్టీ నాయకులే మండిపడుతున్నారు.
రియల్ ఎస్టేట్ రేవంత్‌కు వ్యవసాయం గురించి తెలుస్తదా?
వ్యవసాయానికి 3 గంటల కరెంటే చాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను యావత్తు తెలంగాణ రైతాంగం తప్పుపడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి తప్పుగా మాట్లాడితే ఎట్లా అని అన్నదాతలు కన్నెర్రజేస్తున్నారు. గంటలో ఎకరం పొలం ఆయన పారిచ్చి చూపిస్తడా? రేవంత్‌రెడ్డి కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నడు. ఫుల్లుగా నీళ్లున్న బోరుకు బిగించిన త్రీ హెచ్‌పీ మోటర్ ఓ ఆరుగంటలు నడిస్తేనే దుక్కి దున్నేందుకు పొతం అయితది.. నాటేసినంక ఎకరం పొలం పారాలంటే కనీసం మూడు గంటలు పడ్తది అని రైతులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ చేసే రేవంత్‌రెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలుసునని మండిపడుతున్నారు. 24 గంటల కరెంట్ ఉంటేనే పంటలు పండిచగలమని అంటున్నారు. ఉచిత కరెంట్ ఇవ్వమంటూ తమను అవమానించిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెప్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ మాటలు కావంటూ మండిపడ్డారు.