సమైక్య పాలనలో కరెంట్ కోసం నానా కష్టాలు పడ్డ రైతులకోసం స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్‌ను ఇస్తున్నారు. ఇందుకోసం ఆయన ఎంతో మేధోమథనం చేశారు. రాష్ట్రంలో విద్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు పక్క రాష్ట్రాలనుంచి కొనుగోలు చేసి కూడా ఒక ఎకరా భూమికూడా ఎండకుండా బోర్లు పోసేలా చూస్తున్నారు. ఆయన సంకల్పంతో అన్నదాతకు నాటి కరెంట్ కష్టాలు తీరిపోయాయి. బాయిలకాడ మంచాలు వేసుకొని పడుకొనే బాధ తప్పింది. రైతు ఎప్పుడంటే అప్పుడు పొలంకాడికి వెళ్లి కట్కా ఒత్తి పొలం పారించుకొంటున్నాడు. అటు మిషన్ కాకతీయ, కాళేశ్వరంతో జలవనరుల్లో పుష్కలంగా నీళ్లుండటం.. 24 గంటల కరెంట్ ఉండడంతో పొలాలన్నీ పారుతున్నాయి. ఫలితంగా మునుపెన్నడూ లేనివిధంగా పంట దిగుబడి వస్తున్నది. వరిధాన్యం పండించడంలో మనం పంజాబ్‌నే అధిగమించిపోయాం. అయితే, ఇది చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు 24 గంటల ఉచిత కరెంట్‌పై ప్రేలాపనలు చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత? అబద్దమెంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సమైక్యపాలనలో విడతలవారీగా కరెంట్ ఇచ్చేవారు. దీంతో రైతులు రాత్రిపూట మంచాలు వేసుకొని బాయిలకాడే పండుకొనేవారు. కరెంట్ వచ్చినప్పుడు పొలం పారిచ్చుకొనేవారు. ఈ క్రమంలో విషపురుగులు కరిచి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. విడతలవారీగా కరెంట్ ఇవ్వడం వల్ల మోటార్లు కాలిపోయేవి. లోవోల్జేజి సమస్య ఎక్కువగా ఉండేది. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకొనేవారు..కరెంట్ రాగానే ఒక్కసారిగా అన్ని మోటర్లు ఆన్‌కావడంతో సబ్‌స్టేషన్‌పై తీవ్ర ఒత్తిడి పడేది. ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, మాటిమాటికీ మోటర్లు కాలిపోవడం, ఫ్యూజులు కొట్టేయడం జరిగేది. అదే 24 గంటల కరెంటుతో ఈ బాధలేవీ ఉండవు. రైతులు తమకు ఎప్పుడు అవసరముంటే అప్పుడే మోటర్లు ఆన్ చేస్తారు. దీంతో సబ్‌స్టేషన్‌పై ఎలాంటి భారం పడదు. ఇకనుంచి కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు.. లోవోల్టేజీ సమస్యలు ఉండయ్ అని సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్‌ను ప్రారంభించేటప్పుడే చెప్పారు. ఇప్పుడదే నిరూపితమైంది. కొత్తగా ఎవరో వచ్చి 24 గంటల కరెంట్‌పై అసత్య ప్రచారాలు చేస్తే తామెట్లా నమ్ముతామని, వారికి గట్టిగా బుద్ధి చెప్తామని అన్నదాతలు పేర్కొంటున్నారు.