mt_logo

ప్రతి ఇంటికి ఆసరా.. ప్రతి గడపకి సంక్షేమం.. ఇది మన తెలంగాణ ప్రభుత్వ ప్రభంజనం

  • దేశ సంక్షేమ రంగంలో..  తెలంగాణ బంగారు బాట 
  • స్వరాష్ట్ర పాలనలో ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల 
  • ఆసరా ఫించన్లు, పలు రకాల సంక్షేమ పథకాలు..
  • తొమ్మిదేండ్ల కాలంలో ఆసరా తదితర పింఛన్ల కోసం  రూ. 58,696 కోట్లు ఖర్చు చేసింది.
హైదరాబాద్, జూన్ 9 :  స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు, ఆసరా అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సంకల్పించారు. సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.50 వేల కోట్లకు పైగా నిధులతో పలు రకాల ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. పదేళ్ళకు చేరుకున్న స్వరాష్ట్ర పాలనా కాలంలో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలను ఆసరా ఫించన్లు సహా పలు రకాల సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం దేశ సంక్షేమ రంగ చరిత్రలోనే..తెలంగాణను అగ్రభాగాన నిలిపింది. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆసరా ఫించన్లు, ఇతర సంక్షేమ పథకాలు పేదల్లో ఆర్థిక భరోసాను ఆత్మగౌరవాన్ని నింపినాయి. ఆసరా పెన్షన్  కాకుండా.. రైతులకందించిన పంటపెట్టుబడి వంటి వ్యక్తిగత ఆర్థిక సాయం సామాజిక పెట్టుబడిగా మారింది. 
ముఖ్యమంత్రి గారి మాటల్లో… రూపాయి ప్రజల్లో తిరిగడం ద్వారా స్పిన్ ఆఫ్ ఎకానమీ కి దారితీసింది.  ప్రజల కొనుగోలు శక్తి పెరిగి తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన పొలిటికల్ ఎకానమీ నేడు తెలంగాణ సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో నెలకొన్న గత పాలనలోని పారడైమ్ ను షిఫ్ట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని స్థాపించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా అందిస్తున్న మానవీయ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం దేశ ప్రజలను మన్ననలు అందుకుంటున్నది. 
ఎస్సీల సంక్షేమం : స్వతంత్ర భారతంలో ఈనాటికీ ఈ వివక్ష కొనసాగడం అత్యంత హేయమైన చర్యగా రాష్ట్ర ప్రభుత్వం  భావించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ కులాల అభివృద్ధి దిశగా పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్సీ కులాలను అటు సామాజిక వివక్ష నుంచి దూరం చేయడంతోపాటు, ఇటు ఆర్థిక స్వావలంబనను కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
దళితబంధు: తరతరాలుగా వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాలకు ఆర్థిక గౌరవంతో పాటు, సామాజిక గౌరవాన్ని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నది. ఈ పథకం కింద ఎలాంటి బ్యాంకు లింకేజీ గానీ, సెక్యూరిటీగానీ లేకుండా, లబ్ధిదారుడు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 లక్షల గ్రాంటును ఉచితంగా అందజేస్తుంది. దళితులను స్వయం సమృద్ధులుగా, వ్యాపార వర్గాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దళిత బంధు పథకాన్ని అందుకుంటున్న వారు ఏదైనా అనుకోని సందర్భంలో నష్టాలకు గురవ్వడం ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడానికి రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రభుత్వం తరఫున రూ. 10 వేల కంట్రిబ్యూషన్ తో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం జరగుతున్నది. దళితబంధు కోసం 2023-24 బడ్జెట్లో రూ. 17,700 కోట్లు ప్రతిపాదించడమైంది. 
షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి (ఎస్ సీ ఎస్ డీ ఎఫ్): షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపుకు చట్టబద్ధత కల్పించింది.  ఎస్సీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో నిధులు పూర్తిగా ఖర్చుకాని పక్షంలో ఈ చట్టం ప్రకారం ఆ నిధులను తరువాతి సంవత్సరానికి ఖచ్చితంగా బదలాయింపు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద 2014 -15 నుండి 2022-23 వరకు రూ. 92,640.41 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. 
ఆర్థిక చేయూత పథకం: అర్హులైన లబ్దిదారులకు ఆర్థిక చేయూత పథకం ద్వారా వారికి అందించిన 1 లక్ష రూపాయల నుంచి రూ. 12 లక్షల రూపాయల వరకు లోన్ ను అనుసరించి 60% నుండి 80% వరకు రాయితీని ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ పథకం కింద 2014-15 నుండి 2022-23 వరకు 1,62,444 మంది లబ్దిదారులకు 2029.78 కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ గా అందించింది. 
అంబేద్కర్ విగ్రహం: దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు, ఆ ఆశయాల సాధనకు ప్రజాప్రతినిధులు, అధికార గణాన్ని ఉద్యుక్తులను చేసే లక్ష్యంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల ఎత్తైన ‘అంబేద్కర్ విగ్రహాన్ని’ నెలకొల్పారు. 14 ఏప్రిల్ 2023 న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేడ్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.  నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ పరిసరాల్లో మొత్తం 11.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. మహా విగ్రహం కొలువుదీరిన ప్రాంగణం ఆరు ఎకరాల వరకు ఉంటుంది. మహారాష్ట్రలోని ధూలె జిల్లాలోని గోండూరు గ్రామానికి చెందిన స్థపతి రాంజీ సుతార్ అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహ స్థాపనకు ప్రభుత్వం రూ. 146.50 కోట్లు ఖర్చు చేసింది. 
అంబేద్కర్ భవనాలు: 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023 మార్చి నాటికి తెలంగాణలో 140 కోట్ల ఖర్చుతో 910 ఎస్సీ కమ్యూనిటి హాళ్ళు నిర్మితమయ్యాయి.  భవన్ లు, విగ్రహాల ఏర్పాటు కు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 368.27 కోట్లను మంజూరు చేసింది. వీటిలో 96 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.  రూ. 40 కోట్లతో చేపట్టిన మరో 319 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 2014-15 నుండి 2022-23 వరకు ప్రభుత్వం వీటి నిర్మాణానికి రూ. 140.55 కోట్లను ఖర్చు చేసింది. 
ఎస్సీ హాస్టళ్ళు: ప్రభుత్వం 6,11,716 మంది ఎస్సీ విద్యార్థుల హాస్టళ్ల నిర్వహణ ఖర్చుల కోసం 2014-15 నుండి 2022-23 వరకు రూ. 1976.91 కోట్లను ఖర్చు చేసింది. ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు: దళితులు కేవలం ఉద్యోగస్తులుగానే కాకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా, పదిమందికి ఉపాధి కలిపించే ఎంటర్ ప్రెన్యూయర్లుగా తయరు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1,60,914 మందికి రూ. 2,013.64 కోట్ల రూపాయలను సబ్సిడీల ద్వారా రాయితీలు కల్పించి ప్రోత్సహించింది. ఎస్సీలకు, గౌడలకు మద్యం దుకాణాల కేటాయింపు :  రాష్ట్ర ప్రభుత్వం 2021-23 లైసెన్సులో రిటైల్ దుకాణాల్లో గౌడులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం మద్యం దుకాణాల్ని కేటాయించింది. 
ఎస్సీ లకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్: పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం దళిత నివాసాల్లో వాడల్లో వెలుగులు నింపే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి దళితుని ఇంటికి 101 యూనిట్ల వరకు విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తున్నది. 2014-15 నుండి 2022-23 వరకు 22,23,475 దళిత గృహాలకు రూ.284.13 కోట్ల ఖర్చుతో ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
 ఎస్సీలకు విద్య : తరతరాలుగా విద్యకు దూరం చేయబడిన ఎస్సీ కులాలకు నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా దేశానికే ఆదర్శంగా ఎస్సీ గురుకులాలను ఏర్పాటుచేసి, ప్రభుత్వం విద్యను కొనసాగిస్తున్నది. ఈ గురుకులాల్లో విద్యను అభ్యసించిన విద్యార్ధులు అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సాధించి డాక్టర్లుగా,  ఇంజనీర్లుగా, ఐటి ప్రొఫెషనర్లుగా విజయ తీరాలకు చేరుకుంటున్నారు. 
ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు: రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉన్న 132 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలుండగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 104 పాఠశాలలను స్థాపించారు. దీంతో మొత్తం ఎస్సీ గురుకుల పాఠశాలల సంఖ్య 236 కు చేరుకుంది. వీటిలో మొత్తం 5,428 మంది టీచర్లు పనిచేస్తుండగా, 1,13,280 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 
ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు: రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం 112 ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుండగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 126 కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం ఎస్సీ జూనియర్ కాలేజీల సంఖ్య 238 కి చేరుకున్నది. వీటిలో  మొత్తం 964 మంది టీచర్ల పనిచేస్తుండగా, మొత్తం విద్యార్థుల సంఖ్య 38,389. 
ఎస్సీ డిగ్రీ కాలేజీలు: రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 30 ఎస్సీ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో మొత్తం 1200 మంది అధ్యాపకులు విధులు నిర్వరిస్తుండగా, 25,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 
 పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు: రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు కింద ప్రతి సంవత్సరం 2.5 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు లబ్ది చేకూర్చింది. 2014-15 నుండి 2022-23 వరకు మొత్తం 26,68,397 మంది విద్యార్థులకు రూ. 3,762.22 కోట్ల రూపాయలను పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లుగా అందించింది. 
ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు : ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కింద అందించే మొత్తాన్ని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 65,000 ల నుండి రూ. 1,50,000 లకు, పట్టణ ప్రాంతాల్లో రూ. 75,000 ల నుండి రూ. 2,00,000 లకు పెంచారు. 2014-15 నుండి 2022-23 వరకు 5,78,417 మంది విద్యార్థులకు రూ. 368.06 కోట్లను ప్రభుత్వం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లుగా అందించింది. 
స్టడీ సర్కిళ్ళు: రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉన్న ఎస్సీ స్టడీ సర్కిళ్ళతో పాటు నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యపేట, సిద్దిపేట, జగిత్యాల్  జిల్లాల్లో కొత్తగా ఎస్సీ స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేసింది.  ఎస్సీ స్టడీ సర్కిళ్ళు సివిల్ సర్వీసులు, సెంట్రల్ సర్వీసులు, గ్రూప్ ఎ, బి తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ఈ సర్కిళ్ళలో కోచింగ్ నిస్తూ వారి భవితకు బంగారు బాటలు వేస్తున్నాయి.  హైదరాబాద్ లో ప్రధాన శాఖ విద్యార్థులకు సేవలందిస్తోంది.  2014-15 నుండి 2022-23 వరకు వీటిలో కోచింగ్ తీసుకున్న 1314 మంది అభ్యర్థులు వేర్వేరు పోస్టులకు ఎంపికయ్యారు. 
ఎస్టీల సంక్షేమం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు గిరిజనులు ఆత్మగౌరవంతో, భవిష్యత్ మీద భరోసాతో ఉన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి దార్శనికతతో నేడు గిరిజనుల్లోని అనేక తెగలు విద్యాధికులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా, రాజకీయాల్లో రాణిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. యావత్ దేశంలోనే నేడు తెలంగాణలో గిరిజనుల సంక్షేమం పరిఢవిల్లుతున్నది. 
ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం (సబ్ ప్లాన్): ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతిని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎస్టీల కోసం ఖచ్చితంగా అత్యధిక నిధులను కేటాయించాలనే నిబంధనను పటిష్టంగా అమలు చేస్తున్నది. ఎస్టీ సబ్ ప్లాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్ళలో రూ. 43,936.32 కోట్లను ఖర్చు చేసింది. 
గిరిజనులకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు: రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కేంద్రాలు, ఐటిడిఎ ప్రధాన కేంద్రాలు, గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తరించిన మొత్తం 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్త 7,200 చదరపు అడుగుల గిరిజన భవనాలకు ఒక్కో భవనానికి రూ. 1 కోటి చొప్పున మంజూరు చేసింది.  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ. 21.50 కోట్లతో కుమరం భీమ్ ఆదివాసీ భవన్ ను, 61,544 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 21.71 కోట్లతో సేవాలాల్ బంజారా భవన్లను గిరిజన సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి నిర్మించడం జరిగింది.
అధికారికంగా ఆదివాసీ పండుగలు: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేందుకు వారి పండుగలైన సంత్ సేవాలాల్ జయంతి, కుమరంభీం జయంతి, వర్ధంతులు, బౌరాపూర్ జాతర, జంగుబాయి జాతర, నాచారం జాతరలకు ప్రభుత్వం ప్రతిఏటా నిధులు విడుదల చేస్తూ, అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది.  ప్రభుత్వం రెండేళ్ళకోసారి వచ్చే మేడారం జాతర కోసం ప్రతీ ఏటా రూ. 354 కోట్లను విడుదల  చేస్తున్నది. 
గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు: స్వతంత్ర భారత చరిత్రలో గిరిజన రాజకీయ సాధికారతా దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ఉద్యమ ఆకాంక్షకు కార్యరూపమిచ్చారు. 500 జనాభాను మించి వున్న 2,471 తండాలు, గూడాలను., నూతనంగా గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. దాంతో గతంలోని 675 కలుపుకొని మొత్తం 3,146 తండాలు, గూడాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. తద్వారా వేలాది మంది ఆదివాసీ, లంబాడీ, గిరిజన యువతీ యువకులను సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, రాజకీయ అధికారంలో భాగస్వాములను చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. 
ఎస్టీలకు విద్య-ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు: రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉన్న 91 ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలుండగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 70 పాఠశాలలను స్థాపించారు. దీంతో మొత్తం ఎస్టీ గురుకుల పాఠశాలల సంఖ్య 161 కి చేరుకున్నది. వీటిలో మొత్తం 3,220 మంది టీచర్లు పనిచేస్తుండగా, 66,168 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 
ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు: రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం 30 ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుండగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 88 కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం ఎస్టీ జూనియర్ కాలేజీల సంఖ్య 118 కి చేరుకున్నది. వీటిలో  మొత్తం 1064 మంది టీచర్ల పనిచేస్తుండగా, మొత్తం విద్యార్థుల సంఖ్య 23,840. 
ఎస్టీ డిగ్రీ కాలేజీలు : రాష్ట్ర ఏర్పాటుకు ముందు నాటి తెలంగాణ ప్రాంతంలో ఎస్టీలకు ఒక్క డిగ్రీ కాలేజీ లేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 22 ఎస్టీ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో మొత్తం 946 అధ్యాపకులు విధులు నిర్వరిస్తుండగా 14,020 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.   
 బీసీల సంక్షేమం : తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల్లోని ప్రతీ కులానికి ప్రత్యక్ష ప్రయోజనాలను చేకూర్చేలా ప్రవేశపెట్టిన పథకాలు బిసి కులాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు బిసీలు సామాజికంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యా పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కుల వృత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో  ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు ప్రతి పల్లె స్వయం సమృద్ధి సాధించి పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడిని నిజం చేస్తున్నాయి. పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ప్రీ – మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల నుండి డే స్కాలర్‌షిప్‌లు, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకాలు అమలు చేస్తున్నారు.
 గొర్రెల పంపిణీ పథకం :  రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా జులై 2022 నాటికి 3.94 లక్షల యూనిట్లు (82.64 లక్షల గొర్రెలు) పంపిణీ చేసింది. వీటిద్వారా మరో 1 కోటి 32 లక్షల గొర్రెపిల్లలు జన్మించాయి. మే 2023 నాటికి ప్రభుత్వం ఈ పథకానికి రు. 5001.53 కోట్లు ఖర్చు చేసింది. 
ఆసరా ఫించన్లతో సకల జనులకు భరోసా: ఉమ్మడి పాలనలో నాటి తెలంగాణ ప్రాంతంలో వయసు మీద పడిన వృద్ధులు ఎదుర్కొన్న ముఖ్య సమస్య.. ‘ సామాజిక ఆర్థిక అభధ్రత’. తమను పట్టించుకునే వారు కానీ ఆదుకునే వారు కానీ లేరనే అభధ్రత మనిషిని నిత్యం కృంగదీసి నిర్వీర్యం చేస్తుంది. వయస్సు మీద పడిన వృద్ధులకు, పలు రకాల శారీరక వైకల్యాలతో బాధపడే అభాగ్యులకూ వారి అంతిమ దశలో వేదనతో మరింత కృషించిపోవడం సరైందికాదని సిఎం కేసీఆర్ భావించారు. ఇటువంటి దుర్భర పరిస్థితుల నుంచి అభ్యాగ్యులను గట్టెంక్కించడానికి, ఇతరుల మీద ఆధారపడేవారికి ’ఆసరా’ తో అండగా నిలవడం సామాజిక బాధత్యగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్లకు, ఆసరా అర్హులైన వారందరికీ పింఛన్లతో భరోసానందిస్తున్నది. 
2004 నుంచి 2014 వరకు పదేండ్ల పాటు సాగిన ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు పింఛన్ల కోసం తెలంగాణ కు కేవలం రూ.5,558 కోట్లు కేటాయించాయి. కానీ, తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ప్రభుత్వం 2014 నుండి మే 2023 మధ్య తొమ్మిదేండ్ల కాలంలో  ఆసరా తదితర పింఛన్ల కోసం దాదాపు పదింతలు అనగా  రూ. 58,696 కోట్లు ఖర్చు చేసింది. 2014 వరకు తెలంగాణ లో పింఛన్లు పొందే లబ్దిదారుల సంఖ్య 29,21,828 మాత్రమే ఉండేది. వీరి కోసం ప్రతి ఏటా కేవలం 861 కోట్లు ఖర్చయ్యేవి. కాగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా మరికొంతమందిని గుర్తించి వారికి ఆసరా ఫించన్లను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దాంతో.. ఆసరా పింఛన్ లబ్దిదారుల సంఖ్య నూతన రాష్ట్రంలో 44,82,254 మందికి పెరిగింది. వీరి పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 11,628 కోట్లు ఖర్చు చేస్తున్నది. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిదేండ్ల ప్రభుత్వం 58,696 కోట్ల రూపాయలను ఆసరా పింఛన్లుగా లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఇది దేశ సంక్షేమ చరిత్రలో స్వర్ణయుగాన్ని లిఖించింది. ఈ నేపథ్యంలో…వొక్కో ఆసరా ఫించను వివరాలను తెలుసుకుందాం.
 బీడీ కార్మికులకు పింఛన్లు: బీడీలు చుట్టడమే జీవనాధారంగా బతుకుతున్న 4,25,793  కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం నెలకు 2,016 రూపాయలు చొప్పున పింఛన్లు ఇస్తున్నది. 25 మే 2023 నాటికి రాష్ట్ర ప్రభుత్వం బీడి కార్మికుల పించన్ల కోసం 5712.30 కోట్ల రూపాయలను అందించింది. దేశంలో బీడి కార్మికుల కోసం ఫించను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఒక కుటుంబంలో ఇతరులు ఎలాంటి పింఛన్ పొందుతున్నప్పటికీ, అదే కుటుంబంలో పీఎఫ్ ఖాతా కలిగిన బీడీ కార్మికులందరికీ ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించింది. 
దివ్యాంగులకు పింఛన్లు: శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. రాష్ట్రంలో అర్హులైన 5,16,890 మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ 3,016 చొప్పున పదేళ్ళలో 10310.36 కోట్ల రూపాయలను వారికి పింఛన్ల రూపంలో అందించడం జరిగింది.
బోదకాలు బాధితులకు పింఛన్లు: రాష్ట్రంలోని 18,644 మంది పైలేరియా (బోదకాలు) బాధితులను ఆదుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 2,016 చొప్పున వారికి పింఛను అందిస్తున్నది. 25 మే 2023 నాటికి నాటికి మొత్తం 161.84 కోట్ల రూపాయలను వారికి అందించడం జరిగింది. 
గీత కార్మికులకు పింఛన్లు: కల్లుగీత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న రాష్ట్రంలోని 67,048 మంది గీత కార్మికులకు, గౌడ కులస్తులకు నెలకు రూ. 2,016 పింఛను అందుతున్నది.  25 మే 2023 నాటికి 880.45 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల పింఛన్ల కోసం అందించడం జరిగింది.
నేత కార్మికులకు పింఛన్లు: నేత వృత్తి పైన ఆధార పడి జీవిస్తున్న నేత కార్మికులకు, పద్మశాలీలకు రాష్ట్ర ప్రభుత్వం  ఆసరాగా నిలుస్తున్నది. రాష్ట్రంలోని 38,240 మంది నేత కార్మికులకు నెలకు 2,016 రూపాయల చొప్పున పింఛను అందుతున్నది. 2022 డిసెంబర్ నాటికి 518.58 కోట్ల రూపాయలను ప్రభుత్వం చేనేత కార్మికుల పింఛన్ల కోసం అందించడం జరిగింది.
డయాలసిస్ బాధితులకు పింఛన్లు: కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చికిత్సను పొందుతున్న 4667 మందికి నెలకు రూ.2016 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందిస్తున్నది.  2022 నుండి ప్రారంభమైన పథకం ద్వారా డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.09 కోట్ల రూపాయలను అందించడం జరిగింది.
ఎయిడ్స్ బాధితులకు పింఛన్లు: రాష్ట్రంలోని 37,674 మంది ఎయిడ్స్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.2016 చొప్పున పింఛను అందిస్తున్నది. 25 మే 2023 నాటికి ప్రభుత్వం 448.01 కోట్ల రూపాయలను ఎయిడ్స్ బాధితుల పించన్ల కోసం అందించడం జరిగింది.
కళాకారులకు పింఛన్లు: తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సాహిత్య కళలకు పెద్దపీట వేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వున్న అర్హులైన 1967 మంది కళాకారులకు నెలకు రూ.3016 చొప్పున రూ. 49.30 కోట్లను నేటి వరకు అందించడం జరిగింది.
‘కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్’ : ముఖ్యంగా ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపోయే నిరుపేద కుటుంబాలను పెండ్లి ఖర్చుల అవస్థలనుంచి గట్టెక్కించడానికి రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు  నిర్ణయించారు. దీనికై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని, మైనారిటీలకు షాదీముబారక్ పథకాలన్నీ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆడబిడ్డ పెండ్లి ఖర్చులకుగాను రూ.1,00,116 ఆర్థికసాయం అందిస్తున్నది. దివ్యాంగులకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ. 1,25,145 చెల్లిస్తున్నారు. 2014 నుండి 2023 మే మధ్య కాలంలో 12,71,839  నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు రూ 11,130 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. 
నేతన్న సంక్షేమం : స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను చేపట్టింది. చేనేత కార్మికులకు  నూలు, రంగులపై కేంద్ర ప్రభుత్వం కేవలం 10 శాతం సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకొంటే, తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నది.  వీటితోపాటు, నేత కార్మికులకు పావలా వడ్డీకే రుణ సదుపాయం కల్పించడంతో పాటు,  2010 నుంచి 2017 వరకూ జాతీయ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల వద్ద  ఒక్కొక్క చేనేత కార్మికుడు తీసుకున్న లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. నేత కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకొనేందుకు 2017 సంవత్సరం నుంచి బతుకమ్మ చీరెల  తయారీని కూడా నేతన్నలకే అప్పగిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ రూ. 1,727 కోట్లు అందించుకున్నాం.
మత్స్యకారుల సంక్షేమం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జల వనరులను అభివృద్ధి చేయడమే గాకుండా,  రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప, రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టింది.  వాటిపై హక్కులను మత్స్యకారులకే కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది.  చేపల పెంపకం కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసింది. ప్రమాదంలో మరణించే మత్స్యకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ద్వారా రూ. 4 లక్షలు, ప్రభుత్వం మరో రూ.5 లక్షలు, మొత్తంగా 9 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తూ అండగా నిలుస్తున్నది. 
గీత కార్మికుల సంక్షేమం: దేశంలో ఎక్కడా లేని విధంగా వైన్‌ షాపుల కేటాయింపులో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. తద్వారా గౌడ సోదరులు వ్యాపార రంగంలో బలంగా నిలదొక్కుకునేందుకు అవకాశం కల్పించింది. మరణించిన లేదా అంగవైకల్యం చెందిన గీత కార్మికునికి సమైక్య రాష్ట్రంలో 50 వేల రూపాయల పరిహారం మాత్రమే అందేది. గౌడ సోదరుల సంక్షేమాన్ని ప్రధాన బాధ్యతగా స్వీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఈ పరిహారాన్ని 5 లక్షల రూపాయలకు పెంచింది. 
50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ప్రభుత్వం 2,016 రూపాయల పింఛన్‌ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలోని 65,668 మంది గీత కార్మికులకు పింఛన్ల కింద ఇప్పటివరకు దాదాపు 800 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. రైతుబీమా తరహాలోనే గౌడ సోదరులకు కూడా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రభుత్వం అందించబోతున్నది. ఇందుకు అవసరమైన బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
మైనారిటీల సంక్షేమం: సర్వమత సమభావన పునాదిగా అన్నివర్గాలలో విశ్వాసాన్ని నెలకొల్పుతూ, ఎవరి పట్ల వివక్షా, ఉపేక్షా లేకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సర్వజనులకూ అందిస్తున్నది. మైనారిటీల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. మైనారిటీ బాలుర కోసం 107, బాలికల కోసం 97 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పింది. మైనారిటీ బాలికల విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ఇమామ్ లకు, మౌజన్లకు నెలకు రూ.5 వేల చొప్పున మొత్తం 10 వేల మందికి జీవన భృతిని అందజేస్తున్నది. 
బ్రాహ్మణ సంక్షేమం: సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. దేవాలయాలను నమ్ముకొనిజీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా ఆదుకుంటున్నది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాలలో విధులు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా వేతనాలు అందిస్తున్నది. 
ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద / శాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుండి రూ.5 వేలకు ప్రభుత్వం పెంచింది. ఈ భృతిని పొందే అర్హత వయస్సును ప్రభుత్వం 75 ఏళ్ల  నుండి 65 ఏళ్లకు తగ్గించింది.  ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూప దీప నైవేద్య పథకాన్ని విస్తరింప చేసింది.