కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆదినుంచీ అన్నదాతపై కక్షగట్టింది. పంటకు కనీస మద్దతు ధర ప్రకటించకపోగా నల్లచట్టాలతో రైతన్నలను రోడ్డుకీడ్చింది. వందలాది మంది రైతులను పొట్టనబెట్టుకొన్నది. అంతటితో ఆగకుండా మోటర్లకు మీటర్లు పెట్టి రైతన్నల ఇంట్లో కరెంటు బిల్లుల మోత మోగిస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు తప్ప మిగతా రాష్ట్రాలన్నీ కేంద్రం తాయిలాలు, బెదిరింపులకు భయపడి బాయికాడ మోటర్లకు మీటర్లు పెడుతున్నాయి. అన్నదాతను నిలువునా దోచేస్తున్నాయి. వ్యవసాయానికి నిరంతర కరెంట్ అనే ఆలోచనే చేయని కేంద్రం.. ఫసల్ బీమా యోజనా, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో తూతూమంత్రంగా రైతులను ఆదుకొన్నట్టు నటిస్తున్నది. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి రైతు రుణమాఫీకి తాము వ్యతిరేకమని నిండు పార్లమెంట్‌లో ప్రకటించింది. తమది రైతు వంచక ప్రభుత్వమే అని చెప్పకనే చెప్పింది.
బీజేపీ కార్పొరేట్ సర్కార్!
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా లోక్‌సభ సాక్షిగా అన్నదాతలను అవమానించారు. తాజాగా, ఆయన లోక్‌సభ సమావేశాల్లో ప్రసంగిస్తూ రైతు రుణమాఫీకి తమ బీజేపీ సర్కారు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమ పథకాలను తాయిలాలుగా అభివర్ణించి, బడుగు, బలహీనవర్గాల ప్రజలను ఘోరంగా అవహేళన చేశారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు రుణమాఫీ చేయడం నేరమన్నట్టుగా మాట్లాడారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డవారిని ఆదుకొనే పథకాలను రేవ్‌డీలు (మిఠాయిలు) అని అవహేళన చేసిన ప్రధాని మోదీ బాటలోనే అమిత్ షా నడిచారు. రైతులు రుణాలు చేయలేని పరిస్థితికి వారిని తీసుకొస్తామంటూ ఊదరగొట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా అన్నదాతలతోపాటు సామాన్య ప్రజలు మండిపడ్డారు. నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. రైతుల రుణమాఫీ తప్పయితే..మరి కేంద్రం కార్పొరేట్లకు రైటాఫ్ చేసిన 14.56 లక్షల కోట్ల సంగతేంది? అని నిలదీశారు. కార్పొరేట్లకు రుణమాఫీ సంక్షేమం కిందికి వస్తుందా? అని బీజేపీ సర్కారుకు చురకలంటించారు. రైతు, ప్రజా వ్యతిరేక బీజేపీకి ఇక తాము ఓటేయబోమని స్పష్టం చేశారు.