mt_logo

వార్డు కార్యాల‌యాలు.. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు

  • న‌గ‌రంలో ప్ర‌జ‌ల ముంగిట‌కే పాల‌న‌
  • అప‌రిష్కృత స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

మ‌న కండ్ల ముందు స‌మ‌స్య క‌న‌బ‌డితే దానికి వెంట‌నే ప‌రిష్కార మార్గం చూప‌గ‌లం.. ఈ ఆలోచ‌న‌నుంచి పుట్టిందే వార్డు కార్యాల‌యాల వ్య‌వ‌స్థ‌. న‌గ‌రంలో నిత్యం ప్ర‌జ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌కు ఆన్ ది స్పాట్ సొల్యూష‌న్ చూప‌డ‌మే వీటి ల‌క్ష్యం. సూటిగా చెప్పాలంటే ప్ర‌జ‌ల ముంగిటికే పాల‌న తేవ‌డం. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ ఆలోచ‌న‌ల్లోనుంచి పుట్టిన ఈ వ్య‌వ‌స్థకు ఆదిలోనే మంచి స్పంద‌న వ‌స్తున్న‌ది. 

జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 18 పరిధిలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేట డివిజన్ల పరిధిలో నాలుగు వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేశారు. గత పదిరోజుల్లో జూబ్లీహిల్స్‌ వార్డు పరిధిలో రోజుకు సుమారు సగటున 15 నుంచి 20 ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో కొన్ని ఫిర్యాదులు నేరుగా జీహెచ్‌ఎంసీ గ్రీవియెన్స్‌ సెల్‌ ద్వారా వస్తుండగా కొన్ని ఫిర్యాదులు వార్డు కార్యాలయాల్లో అందుతున్నాయి. వీధిదీపాల సమస్యలు, పార్కుల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు, చెత్త తొలగింపులో జాప్యం, కుక్కల బెడద, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. వీటితో పాటు మ్యాన్‌హోళ్లు పొంగుతున్నాయని, వర్షపునీరు నిలుస్తోందని కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు.  

ఎప్పటికప్పుడు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల ద్వారా తమ పరిధిలో పౌరులు నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో అధికారులు దృష్టి పెట్టారు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు నిర్దేశిత గడువును విధిస్తూ సిటిజన్‌ చార్టర్‌ ఏర్పాటు చేశారు. సిటిజన్‌ చార్టర్‌లో సూచించిన విధంగా ఫిర్యాదులను పరిష్కరించడం కోసం వార్డు కార్యాలయాల్లో అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌(ఏఎమ్‌సీ) నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీధిదీపాల విభాగం అధికారులు, శానిటేషన్‌, ఎంటమాలజీ , యూబీడీ విభాగంతో సహా పది విభాగాలకు చెందిన అధికారులు ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండి తమకు వస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. వార్డు కార్యాలయంలో ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు ఆయా విభాగాలకు పంపించడం కోసం ఆపరేటర్‌ను నియమించారు. వచ్చిన ఫిర్యాదుల పురోగతిని రోజువారీగా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తున్నారు.

జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లో పార్కును సరైన రీతిలో నిర్వహించకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చిమొక్కలు పెరిగిపోయాయని, పార్కులో సరిగా నీళ్లు పోయడం లేదంటూ రెండ్రోజుల క్రితం కేవీకేఎస్‌.ప్రసాదరావు అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌ వార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ ఫిర్యాదు సంబంధిత యూ బీడీ విభాగం అధికారులకు పంపించడంతో అదే రోజు సాయంత్రానికి పార్కులోని పిచ్చిమొక్కలను తొలగించడంతో పాటు చెత్తాచెదారాన్ని తొలగించారు.