- నగర ప్రజల కోసం ఫ్రెష్‌రూమ్స్
- గ్రేటర్‌లో 23 బహుళ వినియోగ మరుగుదొడ్లు
సీఎం కేసీఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ నిరంతర శ్రమతో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకొంటున్నది. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టడంతో హైదరాబాద్ ప్రపంచానికే కేంద్ర బిందువుగా మారుతున్నది. పరిశ్రమలు.. కంపెనీలు, ఉపాధి, ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నది. మహానగరానికి వలసలూ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు తెలంగాణ సర్కారు మంచి మౌలిక వసతులను కల్పిస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా గ్రేటర్‌లో కొత్తగా బహుళ వినియోగ మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకురానున్నది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన ది అర్బన్ లూ సక్సెస్ కావడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్‌లలో 13 చోట్ల ఎంపిక చేశారు. జోన్ల వారీగా కన్‌స్ట్రక్షన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విధానంలో మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్స్ (టాయిలెట్లు) ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ‘ ది అర్బన్ లూ కంపెనీ సొంత నిధులతో టాయిలెట్లను నిర్మించి, నిర్వహణ చేపట్టనుంది. పే అండ్ యూజ్ పద్ధతిలో వినియోగదారుల నుంచి రుసుం వసూలు చేయనున్నది. 14 సంవత్సరాల కాల వ్యవధితో జీహెచ్‌ఎంసీ ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఈ టాయిలెట్లలో శానిటరీ నాప్‌కిన్ల డిస్పెన్సరీ, బేబీ చేజింగ్ స్పేస్, వాటర్ లెస్ టాయిలెట్, వాసనలేని యూరినల్స్ తదితర ప్రత్యేకతలు ఉంటాయి.
ఈ ప్రాంతాల్లో ఏర్పాటు..
కూకట్‌పల్లి జోన్‌లో ఐడీపీఎల్ క్రాస్‌రోడ్, చింతల్, సికింద్రాబాద్ జోన్‌లో బషీర్‌బాగ్, వైఎంసీఏ నారాయణగూడ, ఛే నంబర్ జంక్షన్, మోండామార్కెట్, శేరిలింగంపల్లి జోన్‌లో టెలికాంనగర్ హ్యుండాయ్ షోరూం, మియాపూర్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్ జోన్‌లో ఉప్పల్ జంక్షన్, ఉప్పల్ బస్టాప్ వెనుకాల, వనస్థలిపురం సుష్మా థియేటర్ డిమార్ట్ వద్ద, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, కొత్తపేట సిగ్నల్, చార్మినార్ నల్లగొండ క్రాస్‌రోడ్ , ఆల్‌నూర్ మసీద్ డీఆర్‌డీఓ దగ్గర, చాంద్రాయణ గుట్ట వంతెన వద్ద , ఖైరతాబాద్ జోన్‌లో నాంపల్లి స్టేషన్, రెడ్‌హిల్స్, ఫిష్ మార్కెట్ బేగంబజార్, మోహిదీపట్నం బస్టాప్, నెహ్రూ విగ్రహం ముందు, కోఠి బస్టాండ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, కింగ్‌కోఠి బస్టాప్, టౌలిచౌకి ఫ్లై ఓవర్ వద్ద మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్స్ (టాయిలెట్లు) ఏర్పాటు చేయనున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 19 పనులకు సంబంధించి సభ్యులు ప్రత్యేకంగా చర్చించి అభివృద్ధి పనులను ఆమోదించనున్నారు. ప్రధానంగా రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.